Abn logo
May 13 2021 @ 06:00AM

మేల్కొంటేనే మనుగడ!

ఏడాది కిందట... సమాజాన్ని కరోనా పలకరించిన వేళ... అంతటా భయం కమ్మేసింది. ‘పాజిటివ్‌’ అనే మాట అప్పుడు ఆశ్చర్యానికి, ఆతృతకు సంకేతంగా ఉండేది. వీధిలో ఒక కేసు వస్తే వీధివీధంతా మౌనం దాల్చేది. సినిమాలు బంద్‌, షికార్లు బంద్‌..ఇల్లే సర్వస్వం అంటూ ప్రాణాలు కాపాడుకున్న రోజులు. నెలలతరబడి ఓపిక పట్టిన రోజులు. కొంతలో కొంత ప్రాణాలు నిలబడ్డ రోజులు. కానీ, అవన్నీ భ్రమలని తేలిపోయింది. మన నైజం కనుక్కోవడానికా అన్నట్టు– సుమారుగా రెండునెలలు మొహంచాటేసినట్టు నటించిన వైరస్‌ కోరల్లో చిక్కుకుని విలవిలలాడే పరిస్థితి వచ్చింది. ఉదాసీనత కొంప ముంచింది. 


మాస్క్‌ పెట్టుకోండి, ఆరడుగుల దూరం పాటించండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి....కరోనా ప్రారంభం నుంచి వైద్యులు, అధికారులు, నాయకులు చెబుతూనే ఉన్నారు. వింటూనే ఉన్నాం. కానీ, గత కొద్ది నెలలుగా.. అంటే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలించినప్పటి నుంచీ చూస్తే ఇవి పాటించడంలో మనం ఎంత నిర్లక్ష్యం చేశామన్నది అందరికీ తెలిసిందే. ఆరడుగుల దూరం అనేమాట ఎప్పుడో మరిచిపోయాం. మూతి కిందకి మాస్క్‌ లాక్కుని జనారణ్యంలోకి దూసుకుపోయాం. మాల్స్‌, హోటళ్లు, మార్కెట్లు అన్నీ ఈదేశాం. నిలబడడానికి కూడా ఖాళీలేని బస్సుల్లో మళ్లీ వేలాడాం....ఆటోలలో కిక్కిరిసి ప్రయాణించాం. ఏతావాతా వైరస్‌ విస్తృతికి సాధ్యమైనంత అవకాశాన్ని అందించాం. అందరమూ అన్నీ తెలిసిన వారమే...సోషల్‌ మీడియాలో టపీటపీమని మీటలు నొక్కి సుద్దులు చేప్పే వారమే. కానీ, ఆచరణలో మనకు మనం మినహాయింపు ఇచ్చుకున్న ఘనులం. టీకా వేయించుకోండర్రా అని చెబితే మొదటగా స్పందించినవారు అతితక్కువ మంది. టీకా రానంతకాలం ఎప్పుడు..ఎప్పుడు అనే ప్రశ్నలు. వచ్చాకా సవాలక్ష సందేహాలు. ముప్పుముంచుకొచ్చాకా ఇప్పుడు ఉరుకులు..పరుగులు...టీకాల కొరత అంటూ పెడబొబ్బలు. ఇలా మహమ్మారికి ‘పాజిటివ్‌’ వాతావరణం చేతులారా కల్పించామనడంలో సందేహం లేదు. 


ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని మనకోసం మనం మనగలిగితే సమస్య కొంతవరకూ అధిగమించవచ్చు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి పలుచోట్ల అమలు చేస్తున్నది నైట్‌ కర్ఫ్యూలు, సెమీ లాక్‌డౌన్లు, లాక్‌డౌన్లు. ఏది విధించినా కొంతసమయం సడలింపులు ఉంటాయి. లేకపోతే జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది. కానీ, ఆ సడలింపు సమయమే కొంపముంచుతోందనేది అందరికీ తెలిసిందే. జనమంతా అదేసమయంలో రోడ్లమీదకు వచ్చి అవసరాలు తీర్చుకుంటారు. మామూలు రోజుల కంటే ఆ సమయంలో మరింత రద్దీ ఉంటుంది. షాపులు కిక్కిరిసి పోతాయి. తర్వాత అంతా ఇళ్లకు వెళ్లిపోతారు. ఈలోగా మహమ్మారికి దానిపని అదిచేసుకు పోతుంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను యంత్రాంగంతోపాటు ప్రజానీకం కూడా అన్వేషించాలి. ఆలోచనలు పంచుకోవాలి. నగరం లేదా పట్టణం అంతటా వ్యాపారసంస్థలు తెరిచే ఉంచాలి. కానీ, పౌరులను పరిమిత సంఖ్యలో బయటకు వదలాలి. అంటే నగరాన్ని, పట్టణాన్ని ప్రాంతాలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కొక్క ప్రాతం వారే బయటకు వచ్చి కొనుగోళ్లు చేసేవిధంగా నిబంధనలు విధించాలి. ఆరోజు బయటకు వచ్చేందుకు అనుమతి ఉన్న ప్రాంతం వారు మినహా మిగిలిన వారు బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలి. దీనివల్ల జనసంచారం తగ్గుతుంది. వ్యాపారాలు నడుస్తాయి.... ప్రజల అవసరాలు తీరతాయి. ఇది ఒక అభిప్రాయం మాత్రమే. ఇలా అభిప్రాయాలు స్వీకరించి చర్చించి లోటుపాట్లను సవరించి ఆమలు చేయలగలిగితే ముందు కరోనా వ్యాప్తి తగ్గుతుంది. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ ఎలాగూ ఉండనే ఉంది. అంతాసరే, తప్పంతా పౌరులదేనా, ప్రభుత్వాల ప్రభుత్వాల పాత్ర ఏమీలేదా...వైఫల్యాలు లేవా...అంటే...ఉన్నాయి. వాటిపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే మనకు ఇప్పుడు కావలసింది ప్రతీకారాత్మక విమర్శలు కాదు... దూషణపర్వాలు కాదు. భయంకర సమస్య నుంచి విముక్తి. ఇందుకు సమష్టి కృషి.

నల్లాన్‌చక్రవర్తుల సతీష్‌కుమార్‌

Advertisement
Advertisement
Advertisement