Abn logo
May 20 2020 @ 01:43AM

ప్రస్తుత చార్జీలతో మనుగడ కష్టమే : ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: ప్రస్తుతం అమల్లో ఉన్న టెలికాం చార్జీలు పరిశ్రమ మనుగడకు ఏ మాత్రం మద్దతు ఇచ్చేవిగా లేవని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ అన్నారు. మంగళవారం ఆయన విశ్లేషకులతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ట్రాయ్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావం ప్రకటించారు. తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ సౌకర్యవంతంగా ఉన్నదని, కొన్ని అంతరాలను తొలగించేందుకు గిగాహెడ్జ్‌ కన్నా తక్కువ విభాగంలోకి ప్రవేశించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఇటీవల తీసుకున్న చర్యలు కొంత ఊరట కలిగించేవే అయినా చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కో వినియోగదారుని పై తమకు వస్తున్న సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.154 మనుగడకు మద్దతు ఇచ్చేదిగా లేదంటూ అది స్వల్పకాలంలో రూ.200, దీర్ఘకాలంలో రూ.300 వరకు చేరగలవని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇందులో గరిష్ఠ స్థాయిలో సగటు రాబడి వచ్చినా కూడా రూ.100 కన్నా తక్కువ చెల్లింపు సామర్థ్యం గల అల్పాదాయ కస్టమర్లకు సేవలందించగలుగుతామని ఆయన చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement