జీవనశైలి మారితేనే మనుగడ

ABN , First Publish Date - 2021-10-10T05:35:23+05:30 IST

భూవాతావరణం పరిశోధనకు భౌతిక నమూనాలను రూపొందించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. జపనీస్ శాస్త్రవేత్త సుకురో మనాబె, జర్మన్ వైజ్ఞానికుడు క్లాస్ హాజల్‌మాన్...

జీవనశైలి మారితేనే మనుగడ

భూవాతావరణం పరిశోధనకు భౌతిక నమూనాలను రూపొందించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. జపనీస్ శాస్త్రవేత్త సుకురో మనాబె, జర్మన్ వైజ్ఞానికుడు క్లాస్ హాజల్‌మాన్, ఇటాలియన్ విజ్ఞాని జార్జియో పారసిలకు ఈ గౌరవం లభించింది. భూవాతావరణ సంక్లిష్టతలు, మానవాళి వాటిని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయమై మన అవగాహనకు మనాబె, హాజల్‌మాన్ పరిశోధనలు పునాదులు వేశాయి. వాతావరణ విపరీత పోకడలను నియంత్రించేందుకు ఆ అవగాహన మనకు తోడ్పడుతోంది. గణిత నమూనాల సహాయంతో మానవ చర్యల వల్ల భూమి వేడెక్కుతున్న తీరుతెన్నులను హాజల్‌మాన్ కచ్చితంగా అంచనావేయగలిగారు. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు శీఘ్ర చర్యలు చేపట్టవలసిఉందని ఈ మువ్వురి పరిశోధనలు ప్రభుత్వాలను, సమాజాలను అప్రమత్తం చేస్తున్నాయి. 


వాతావరణ మార్పులకు కారణమవుతున్న హరిత గృహవాయు ఉద్గారాలను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా సకల దేశాల ప్రభుత్వాలు, సమస్త సమాజాలు సమైక్యంగా రేపటి నుంచే పటిష్ఠచర్యలు చేపట్టినప్పటికీ వాతావరణ ముప్పు నుంచి మన ధరిత్రి బయటపడలేదు. గత శతాబ్దాలలో కాలుష్యకారక వాయువుల ఉద్గారం తీవ్రస్థాయిలో ఉండడమే మనలను వెంటాడుతున్న ఆ మహావిపత్తుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ‘గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-–2021’ ప్రకారం వాతావరణ మార్పులకు అత్యధికంగా ప్రభావితమవుతున్న పది దేశాలలో భారత్ ఒకటి. భూతాపం ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదల పర్యవసానాలను భారత్ ఇప్పటికే చవిచూస్తోంది. ‘పగళ్లన్నీ పగిలిపోయే’ వడగాడ్పులు, కుండపోత వర్షాలు, వరదలు, తుపానులు, సముద్ర‍మట్టాల పెరుగుదలతో దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజల జీవితాలకు, జీవనాధారాలకు, భౌతిక ఆస్తులకు ఎనలేని నష్టం వాటిల్లుతోంది. ఈ పర్యవసానాలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. 2100 సంవత్సరం నాటికి మనదేశం తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3 నుంచి 10 శాతాన్ని నష్టపోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల పేదరికం 2040 సంవత్సరం నాటికి 3.5 శాతం మేరకు అధికమవుతుందని ఒక ప్రామాణిక అధ్యయనంలో వెల్లడయింది. వాతావరణ సంబంధిత అపాయాలు, అసమానతలు, దారిద్ర్యం పెచ్చరిల్లిపోవడం ఖాయమని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. 


మనదేశంలో వినియోగం, జీవనశైలి మార్పుల మూలంగా తలసరి హరితగృహ వాయు ఉద్గారాలు నిరంతరం పెరిగిపోతూ ఉన్నాయి. ఇంధనంగా సంప్రదాయ జీవ ద్రవ్యం (వంటచెరకు ఇందుకొక ఉదాహరణ) వినియోగం పట్టణ, నగరాల చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా అధికస్థాయిలో ఉంది. అదే సమయంలో ఆధునికీకరణ, పట్టణీకరణ ప్రక్రియలు విద్యుత్ వినియోగాన్ని విపరీతంగా పెంచివేస్తున్నాయి. మన సమాజం ఆధునిక వినియోగదారు సమాజంగా పరిణమిస్తోందనేది స్పష్టం. శిలాజ ఇంధనాల వినియోగం హెచ్చు స్థాయిలో ఉండడం వల్లే వాతావరణ మార్పు అపాయం పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాల స్థానంలో ఆధునిక శక్తి వనరులను ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోంది. అప్పుడు మాత్రమే కాలుష్యకారక వాయువుల ఉద్గారాలు తగ్గిపోతాయి. ఇది సంభవించాలంటే విద్యుదుత్పత్తి, రవాణా, ఆహార ఉత్పత్తి, గృహావసరాలకు విద్యుత్ వినియోగం మొదలైన రంగాలలో భారీ మార్పులు జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


అయితే జీవనశైలులు, వినియోగం తీరుతెన్నులలో తగుమార్పులు రాని పక్షంలో హరితగృహ వాయు ఉద్గారాలు తగ్గే అవకాశం ఎంతమాత్రం లేదు. సరుకులు, సేవలకు డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడు వాటి ఉత్పత్తి కూడా చాలా హెచ్చుస్థాయిలో ఉండడం సహజం. ఉత్పత్తి కార్యకలాపాలకు సహజవనరులను ఉపయోగించుకోవడం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ క్రమం అంతా కాలుష్య కారక వాయువుల ఉద్గారాలు మరింతగా అధికమయ్యేందుకు దోహదం చేస్తాయనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే జీవనశైలులు, వినియోగ తీరుతెన్నులలో మార్పులు అవసరమని పలువురు గట్టిగా చెబుతున్నారు. వాతావరణ మార్పు సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యవస్థలవారీ, సమాజవ్యాప్త పరివర్తన చాలా అవసరం. విధానాలు, సాంకేతికతలు, జీవనశైలులు, పౌరసమాజంలో మౌలికమార్పులు రావడం చాలా ముఖ్యం. ఆర్థికాభివృద్ధిలో అసమానతలు, అభివృద్ధి చెందుతున్న వినియోగ సమాజంలో పలు సమస్యలకు దారితీస్తాయి. ఒకవైపు ఆధునిక సాంకేతికతలు, అధునాతన సేవలు వర్థిల్లుతుండగా మరో వైపు పేదరికం, పోషకాహారలోపం, ఆరోగ్యసమస్యలు, సామాజిక వెలివేతలు, సహజవనరుల విధ్వంసం మొదలైనవి పెరిగిపోతాయి. ఈ వైరుధ్యం ఇప్పుడు మన సమాజంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని మరి చెప్పనవసరం లేదు. వివిధ సామాజిక సమూహాల జీవనశైలి భావనలు విభిన్న రీతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. అంటే పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్త విషయాల పట్ల వివిధ సామాజికవర్గాల వారి దృక్పథాలు భిన్నంగా ఉంటున్నాయి. అవి అలానే కొనసాగుతాయని కూడా చెప్పి తీరాలి. విభిన్నవర్గాల వారి చర్యలలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు ఏ స్థాయిలో ఉన్నా అవన్నీ పర్యావరణాన్ని విధిగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావాల సమష్టి ఫలితమే వాతావరణ మార్పులు అనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. 


తలసరి ఉద్గారాలను పరిశీలిస్తే మనదేశ ఉద్గారాలు, ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ప్రపంచ ఉద్గారాలలో 7.1 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. తలసరి ఉద్గారాలు 2.47 టిసిఒ 2ఇ (టన్స్ ఆఫ్ కార్బన్ డై ఆక్సైడ్ ఈక్విలెంట్). ప్రపంచ తలసరి సగటు 6.45 టిసిఒ2ఇ. చాలా విషయాలలో వలే ఇక్కడ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంటే వాతావరణ మార్పులను నియంత్రించడంలో అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ బాధ్యత వహించితీరాలి. భారత్‌లో 20 శాతం సంపన్న కుటుంబాలు, పేద కుటుంబాలతో పోల్చితే మొత్తం కార్బన్ ఉద్గారాలలో 7 శాతానికి కారణమవుతున్నాయి. పేద కుటుంబాలు తమ ఆదాయంలో అధిక మొత్తాన్ని ఆహారం, విద్యుత్‌కు వినియోగించడం కద్దు. ఈ కుటుంబాలు కారణమవుతున్న ఉద్గారాలకు ఆహారం, విద్యుత్ వినియోగాలే ప్రధాన కారణాలు. ఇక సంపన్న కుటుంబాలు ప్రైవేట్ వాహనాలు, మన్నికైన వస్తువులు, తృణధాన్యేతర ఆహారానికి అధికంగా వ్యయం చేస్తున్నాయి. ఈ విషయాలు స్పష్టం చేస్తున్నదేమిటి? సంపన్న కుటుంబాలవారే హరిత గృహ వాయు ఉద్గారాలకు ఎక్కువ బాధ్యులు అని కదా. కనుక వాతావరణ మార్పులను నియంత్రించడంలో సంపన్నులే ఎక్కువ బాధ్యత వహించాలి. ఈ వాస్తవం ప్రపంచవ్యాప్తంగా సకల సంపన్న కుటుంబాలకే కాకుండా సంపన్నదేశాలకూ సంపూర్ణంగా వర్తిస్తుంది సంపన్నవ్యక్తులు ఎక్కడి వారైనా సరే, అంతకంటే ముఖ్యంగా సంపన్నదేశాలు తమ జీవనశైలులను మార్చుకోవడం ద్వారా మాత్రమే వాతావరణ మార్పుల నియంత్రణకు ఎక్కువ దోహదం చేయగలుగుతాయి. మరి ఇది జరుగుతుందా? నిజానికి ఇదే, వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సామాన్య మానవుడి ముందున్న ఒక పెద్ద సవాల్.

డాక్టర్ చెన్నమనేని రమేశ్

శాసనసభ్యులు

Updated Date - 2021-10-10T05:35:23+05:30 IST