Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 21 Jan 2022 03:53:26 IST

ఉప్పెనలా ఉద్యమం

twitter-iconwatsapp-iconfb-icon
ఉప్పెనలా ఉద్యమం

ఆట... పాటతో దంచుడు


‘రివర్స్‌ పీఆర్సీ’పై ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు తమ నిరసనలకు సృజనాత్మకతను కూడా జోడించారు. పేరడీ పాటలతో జగన్‌ సర్కారుకు చురకలు అంటించారు. తమకు న్యాయమైన పీఆర్సీ కావాల్సిందే అంటూ... ‘ఊ అంటావా సీఎం... ఉఊ అంటావా’ అని పాటరూపంలో ప్రశ్నించారు. మరోచోట...‘ఇంతన్నాడు అంతన్నాడే జగన్‌’ అంటూ చివరికి తమకు మోసం చేశారని మండిపడ్డారు. ఇంకోచోట... ‘అయ్యయ్యో వద్దమ్మా’ ప్రకటనకు పేరడీ కట్టారు. ‘‘అయ్యయ్యో వద్దమ్మా... పక్కనే సీఎం ఉన్నాడు... పెద్ద పీఆర్సీ ఇస్తానన్నాడు... ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్నాడు... మా దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు... సుఖీభవ... సుఖీభవ’’ అని చిందేశారు. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

ఉపాధ్యాయులు, వారికి మద్దతుగా ఉద్యోగులు దండులా కదిలారు. వేలాదిమంది కదం తొక్కుతూ కలెక్టరేట్లను ముట్టడించారు. ప్రభుత్వం గృహ నిర్బంధాలు చేయించినా, కలెక్టరేట్లకు వెళ్లకుండా అడుగడుగునా తనిఖీలు చేయించి అరె్‌స్టలు చేయించినా.. మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, జీపులు, కార్లలో భారీ సంఖ్యలో తరలి వచ్చారు. నిఘా వర్గాలు ఆశ్చర్యపోయేలా, సర్కారు ఉలిక్కిపడేలా ఉద్యోగులు ఉప్పెనలా కదిలారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. ప్రభుత్వ బెదిరింపులు, కేసులు పెడతారేమోనన్న భయం.. ఏవీ వారిని ఆపలేకపోయాయి. అన్ని జిల్లాల్లో వేలాది మంది  ప్రదర్శనగా కలెక్టరేట్లకు చేరుకున్నారు. భారీగా మోహరించిన పోలీస్‌ వలయాలను దాటుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను ఎత్తి పక్కకు పడేశారు. వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్ల ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ నినదించారు. ఫిట్‌మెంట్‌ పెంచాలని, పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు కొనసాగించాలని, ఐదేళ్లకోసారి పీఆర్‌సీ ఇవ్వాలని నినాదాలు చేశారు. అశుతోశ్‌ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుపై గుంజీలు తీస్తూ, తలకిందులుగా నించుని నిరసనలు తెలిపారు. ప్రభుత్వ తీరును ఎద్దేవా చేస్తూ పాటలు పాడారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం   ఉపాధ్యాయ సంఘాల నేతలను గృహ నిర్బంధం చేయించింది. కలెక్టరేట్లకు వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముట్టడిలో పాల్గొనరాదంటూ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాదిమంది ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ప్రతి చోటా వేల సంఖ్యలో ముట్టడిలో పాల్గొన్నారు. కలెక్టరేట్ల ముందు బహిరంగ సభను తలపించేలా జన సందోహమే కనిపించింది. ఫ్యాప్టోలోని అన్ని సంఘాల నేతలు ఒక్కో జిల్లాలో ఒక్కొక్కరు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సెలవులు పెట్టేసి ముట్డడికి వెళ్లారు. 


జగన్‌ పత్రికను తగులబెట్టి.. 

ఉపాధ్యాయులు భారీగా తరలిరావడంతో కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ‘పీఆర్సీ రద్దు చేస్తావా? గద్దె దిగుతావా?’, ‘సీఎం డౌన్‌ డౌన్‌’ నినాదాలతో కలెక్టరేట్‌ మార్మోగింది. జగన్‌ సొంత పత్రికను తగులబెట్టి నిరసనను తెలియజేశారు. ఆ తర్వాత పీఆర్సీ ప్రతులకు నిప్పంటించి గంటసేపు రాస్తారోకో చేశారు. దాదాపు 8 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలి వచ్చారు. పోలీసులు ఉద్యమనాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. సీఎం సొంత జిల్లా కడపలో రివర్స్‌ పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయలోకం భగ్గుమంది. ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినా ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పృహ తప్పిపడిపోయారు. చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయ ముట్టడికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది టీచర్లు రావడంతో ప్రాంగణం అట్టుడికింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.