సురభి నాటక దీపం

ABN , First Publish Date - 2022-06-14T06:20:42+05:30 IST

135 సంవత్సరాల సురభి నాటకరంగ చరిత్రలో ఒక శకం ముగిసింది. నాటకమే జీవితంగా, జీవితమే నాటకంగా ఏడు దశాబ్దాల పాటు సురభి నాటక రంగాన్ని తానొక్కడై నడిపించిన కళాయోగి...

సురభి నాటక దీపం

135 సంవత్సరాల సురభి నాటకరంగ చరిత్రలో ఒక శకం ముగిసింది. నాటకమే జీవితంగా, జీవితమే నాటకంగా ఏడు దశాబ్దాల పాటు సురభి నాటక రంగాన్ని తానొక్కడై నడిపించిన కళాయోగి, ‘సురభి బాబ్జి’గా ప్రఖ్యాతులైన ఆర్‌. నాగేశ్వర్‌రావు. ఆయన ఈ నెల 9న కన్నుమూసి తన జీవన రంగానికి తెరదించారు. వనారస గోవిందరావు నుంచి బాబ్జి తరం వరకు సాగిన సురభి నాటకరంగ ప్రయాణంలో ఒక వృత్తి నాటకం జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతికి చేరుకోవడం భారతీయ నాటకరంగంలో ఒక మైలురాయి.


సురభి బాబ్జి 1949 జూలై 1న శ్రీకాకుళం జిల్లా గమిడిపేటలో చిన్న వెంకట్రావు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తల్లి సురభి వ్యవస్థాపకులైన వనారస గోవిందరావు కూతురు. బాబ్జి తల్లిదండ్రులిద్దరూ నాటకరంగంలో నటీనటులే. ఆయన తొలుత బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి, తర్వాత కాలంలో లవకుశ, శ్రీకృష్ణుడు, మహావిష్ణువు, వీరబ్రహ్మంగారు, నక్షత్రకుడు, వెంగళార్య, కార్యవర్ధిరాజు, భవానీ శంకరుడు వంటి పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అంతేగాక లవకుశ, మాయాబజార్‌, బాలనాగమ్మ, వీరబ్రహ్మంగారి చరిత్ర, బొబ్బిలి యుద్ధం, చింతామణి, రంగూన్‌ రౌడి... వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.


నర్సీపట్నంలో డిగ్రీ పూర్తిచేసిన బాబ్జి 1973లో తండ్రి ప్రారంభించిన వెంకటేశ్వర నాట్యమండలి బాధ్యతలను తలకెత్తుకుని కొత్త ఆశలతో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాతి కాలంలో సురభి నాటక కళా సంఘానికి కార్యదర్శిగా సురభి సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వాటి వికాసానికి దృష్టి సారించాడు.


1904 నాటికే సురభి నాటకాలు హైదరాబాదులో ప్రదర్శితమయ్యేవి. ఆ కాలంలోనే తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద హీరోయిన్‌ ‘సురభి కమలాబాయి’ హైదరాబాద్‌లోనే పుట్టింది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో సురభి నాటకాల ప్రాభవం అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పరంపరను అందిపుచ్చుకుని అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో సురభిని సజీవంగా నిలిపినవాడు బాబ్జి. 1991లో హైదరాబాద్‌ నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సురభి రంగస్థలాన్ని ఏర్పాటుచేసి నాటకాలకు శ్రీకారం చుట్టాడు. వీరి ప్రదర్శనలకు సామాన్య ప్రేక్షకులతోపాటు, ప్రజాప్రతినిధులూ క్యూ కట్టేవారు. ఆ రోజుల్లో ప్రతి సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా హాల్సే కాదు, సురభి నాటక సమాజం ప్రదర్శనలూ ప్రతి ఆటా హౌజ్‌ఫుల్‌గా నడిచేవి. బాబ్జి హైదరాబాదును తన కార్యక్షేత్రంగా చేసుకుని సురభి నాటక ప్రాభవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాడు. ఆ తర్వాత విదేశాలకూ ఈ విస్తరణ జరిగింది.


బాబ్జి వారసత్వంగా వచ్చిన తమ నాటక కళకు కొత్త నైపుణ్యాలను అద్దటంపై దృష్టి సారించాడు. అందుకోసం ఆదరించే ప్రతి తలుపునూ తట్టాడు. అందించిన ప్రతి స్నేహహస్తాన్నీ తన పిడికిట పట్టుకుని సురభి నాటక అభ్యున్నతికి అహరహం కృషి చేసాడు. అందుకోసం ఎందరినో ఒప్పించాడు, మెప్పించాడు. 


సురభి వారిని ఒక కులంగా గుర్తించడానికి బాబ్జి ప్రభుత్వాలతో యుద్ధమే చేయాల్సివచ్చింది. మురళీధరన్‌ కమిషన్ ముందు సంచార నాటకరంగ కళాకారులుగా బీసీ జాబితాలో చేర్చమని మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు. అయినప్పటికీ ప్రయత్నాన్ని విరమించుకోకుండా ఆనాటి వై.యస్‌. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకుంటే అప్పుడు సురభిని ఒక కులంగా గుర్తించి బిసి ‘బి’ జాబితాలో చేర్చారు. ఈ శాశ్వత పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి సురభి వారసులకు ఒక వరమే అయ్యింది.


ఇక నాటకానికి వస్తే సురభికీ–ప్రభుత్వానికీ మధ్య బాబ్జి వారధిలా నిలిచాడు. నాటి ఐఏఎస్ అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్, నాటక కళాకారుడు గరిమెళ్ళ రామ్మూర్తి వంటి వారి సహకారంతో 1980లో సాంస్కృతిక శాఖ నుంచి తొలి గ్రాంటును సాధించారు. ఆ తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యం కొనసాగింది. అంతేకాదు బాబ్జి ఇతర రాష్ట్రాల్లోని నాటక సంస్థలతో అనుబంధాలను చిగురింప చేసుకున్నాడు. గుబ్బి వీరన్న నాటక కంపెనీ, రంగశంకరం, అలరిపు, కేంద్ర సంగీత నాటక అకాడమీ, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలతో జతకట్టి సురభి నాటకరంగ వికాసానికి పూనిక వహించాడు.


స్వీయ అస్తిత్వపు ఛాయలతో వృత్తి నాటక ప్రక్రియగా సాగుతున్న సురభిని ఆధునిక ప్రయోగాల అంచులకు తీసుకువెళ్ళడానికి నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. దూరదృష్టితో బాబ్జి దీనిని స్వాగతించాడు. సురభి కళాకారులకు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి అంతర్జాతీయ నాటక దర్శకులు బి.వి.కారంత్‌ నిర్దేశకత్వం వహించారు. ఇందులో సమకాలీన నాటకరంగ మెళకువలను నేర్చుకున్న కళాకారులచే మూడు ప్రయోగాత్మక నాటకాలు వెలుగు చూశాయి. అవి: 1996లో ‘భీష్మ’, 1997లో ‘ఛండీప్రియ’, 1998లో ‘బస్తీ దేవత యాదమ్మ’. ఈ నాటకాలను నవ్య శైలిలో ప్రదర్శించారు. వీటికి దర్శకుడు బి.వి.కారంత్‌ అయితే సహదర్శకుడు బాబ్జి. సురభి నాటకాలు హైదరాబాదులోనే కాదు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి బాబ్జీ కార్యదక్షతే కారణం. ఆ క్రమంలో 150 మంది కళాకారులతో ఫ్రాన్స్‌ వెళ్ళి రెండు నెలలపాటు నాటకాలను ప్రదర్శించి సురభి గొప్పదనాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేసాడు.


నాటకరంగ వికాసం కోసం 1980లో మొదలైన ఆయన ప్రయత్నాలు ఒక 40ఏళ్ళపాటు నిరాటంకంగా సాగాయి. ఈ క్రమంలో బాబ్జికి కొండంత అండగా నిలిచినవారు నేటి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఒక రకంగా సురభి కనుమరుగవకుండా ఉండడానికి రమణాచారి తానెంత చేయగలడో అంతకుమించి సేవ చేసాడు. కళాకారుల సంక్షేమమే కాదు, వారి నాటక ప్రదర్శనలకు అవకాశాలు కల్పించి సురభి నాటక సమాజాన్ని సజీవంగా నిలిపినవాడు రమణాచారి. దానిని అందిపుచ్చుకుని ముందుకు సాగినవాడు ‘సురభి బాబ్జి’.


‘ప్రేక్షకులు ఆరుగురు వున్నా... ఆరువేలమంది ఉన్నా మా ప్రదర్శనలో మాత్రం తేడా ఉండదు’ అని గర్వంగా చెప్పుకునే బాబ్జి హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పుష్కర కాలంపాటు నాటకాలను ప్రదర్శించారు. వారంలో 3 రోజులపాటు ఆ నాటక ప్రదర్శనలు నగర ప్రజలను కనువిందు చేసినవి. చివరికి ‘కరోనా’ మహమ్మారి మూలంగా ఈ ప్రదర్శనలు ఆగిపోయినవి.


బాబ్జి నాటకరంగ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు, తెలుగు విశ్వ విద్యాలయం, రామినేని ఫౌండేషన్‌ వంటి ఎన్నో పురస్కారాలు ఆయనను వరించినవి. చివరగా 125ఏళ్ళ సురభి నాటకోత్సవాలు (2012) సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సురభి నాటక సమాజం భవిష్యత్తు గురించి బాబ్జి అన్న మాటలు ఇవి: ‘కాలమాన పరిస్థితులు ఎంతగా మారాయంటే ఇప్పుడు మనం చూస్తున్న సురభి భవిష్యత్తు ప్రశ్నార్థకమేననిపిస్తుంది. ఇప్పుడు నడిపిస్తున్న ఏడవతరం వారిని రేపేంటి అన్న ప్రశ్న, భవిష్యత్తుపై పలు భయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మేమున్నంతకాలం ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది’. విషాదం ఏమిటంటే ఆ దీపం వెలిగించే ఆయనే వెళ్ళిపోయాడు.

డా. జె.విజయకుమార్‌జీ

తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌

Updated Date - 2022-06-14T06:20:42+05:30 IST