ఇక.. కదలిక!?

ABN , First Publish Date - 2022-09-27T06:43:53+05:30 IST

అటు... గాలి జనార్దన్‌ రెడ్డి మైనింగ్‌ కేసు! ఇటు... వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులు! అన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోనే ఉన్నాయి. గాలి కేసులో ఇప్పటిదాకా అసలు విచారణ ప్రారంభంకాకపోవడంపై..

ఇక.. కదలిక!?

గాలి కేసులో సుప్రీం తీర్పు దెబ్బతో జగన్‌ కేసులపైనా ప్రభావం

మైనింగ్‌ కేసులో విచారణ త్వరగా ముగించాలన్న సుప్రీం

జాప్యానికి కారణాలు చెప్పాలని సీబీఐ కోర్టుకు ఆదేశం

అదే కోర్టులో సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులు

2012-13లో 11 చార్జిషీట్లు వేసిన సీబీఐ

దశాబ్దకాలంగా అంగుళం కూడా కదలని విచారణ

వ్యూహాత్మకంగా జగన్‌ వరుస పిటిషన్లు

డిశ్చార్జి, హాజరు మినహాయింపు పిటిషన్ల పరంపర

కింది కోర్టు కొట్టేస్తే హైకోర్టులో అప్పీలు

అసలు విచారణ మొదలుకాని వైనం

ఈ వైఖరికి చెక్‌ చెప్పాలని గాలి కేసులో సుప్రీం తీర్పు

ఇది జగన్‌ కేసులకూ వర్తిస్తుందంటున్న నిపుణులు


అటు... గాలి జనార్దన్‌ రెడ్డి మైనింగ్‌ కేసు! ఇటు... వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులు! అన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోనే ఉన్నాయి. గాలి కేసులో ఇప్పటిదాకా అసలు విచారణ ప్రారంభంకాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఏమిటి కారణం?’ అని ప్రశ్నించింది. మరి... జగన్‌ అక్రమాస్తుల కేసుల మాటేమిటి? ‘గాలి’ కేసులపై సుప్రీం స్పందన జగన్‌పైనా పడుతుందా? ఎప్పటికప్పుడు డిశ్చార్జి పిటిషన్లను దాఖలు చేస్తూ... దశాబ్దం దాటినా అసలు విచారణ జరగకుండా ఆపుతున్న వైఖరికి  అడ్డుకట్ట పడుతుందా? ప్రస్తుతం న్యాయ నిపుణుల్లో జరుగుతున్న చర్చ ఇది!


(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డిపై 2009 నుంచి సాగుతున్న విచారణ త్వరిత గతిన తేల్చాలని,  నిందితులు దాఖలు చేస్తున్న  డిశ్చార్జి పిటిషన్ల విచారణను ముగించి, తీర్పులు కూడా వెలువరించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై దాఖలైన కేసులపైనా  ప్రభావం చూపే అవకాశముందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కేవలం విచారణను ఆలస్యం చేసేందుకే నిందితులు పుంఖానుపుంఖాలుగా  డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ప్రాథమికంగా తేలడంతో... అలాంటి వారి కేసుల విచారణను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది.


గాలి జనార్దన్‌ రెడ్డిపై హైదరాబాద్‌ లోని సీబీఐ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ కోర్టులో గత 12 ఏళ్లుగా సాగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏ కారణాలతో విచారణ ఆలస్యమవుతోందో సీల్డు కవర్లో నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జిని ఆదేశించింది. నిందితులు వరుసగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు విచారణ కొలిక్కి రాకుండా చేస్తున్నారని తేలడమే సుప్రీం స్పందనకు కారణం.


అదే కోర్టులో జగన్‌ కేసులూ... 

గాలి జనార్దన్‌ రెడ్డి కేసు ఉన్న సీబీఐ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ కోర్టులోనే  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై  ఉన్న కేసుల విచారణ జరుగుతోంది. జగన్‌తోపాటు సహ నిందితులు సీబీఐ కోర్టులో వరుసగా డిశ్చార్జి పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఒక్క కేసులో కూడా అసలైన విచారణ మొదలుకాలేదు. డిశ్చార్జి పిటిషన్లు, బెయిల్‌ పిటిషన్లు, కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోరే పిటిషన్లపైనే విచారణ కొనసా.....గుతోంది. దశాబ్దం కావస్తున్నా ఇదే పరిస్థితి. ఇప్పుడు గాలి జనార్దన్‌ రెడ్డి కేసుల విషయంలో సుప్రీం తీవ్రంగా స్పందించింది. దీని ప్రభావం జగన్‌ కేసులపైనా ఉంటుందని... డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగించేందుకు ఆస్కారం ఏర్పడిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 


అప్పుడేం జరిగింది...

తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత... వైఎస్‌ జగన్‌ ఆస్తులు, వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. 2004-2009 మధ్య జగన్‌ అనేక అక్రమ లావాదేవీల ద్వారా రూ.43 వేల కోట్ల మేరకు అక్రమంగా సంపాదించినట్లు మాజీ మంత్రి పి.శంకర్‌ రావు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని 2011 ఆగస్టు 10న ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. 2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. జగన్‌ వ్యాపార సామ్రాజ్యంలోకి అక్రమ పెట్టుబడులు వచ్చాయని, క్విడ్‌ ప్రో కో ద్వారా ఆస్తులు పోగు చేశారని ఆరోపించింది. జగన్‌, మరో 74 మందిపై కేసులు నమోదు చేసింది. 2012-2013 మధ్య 11 చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. అదే సమయంలో... ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా 9 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రతి చార్జిషీటులోనూ జగనే తొలి నిందితుడు. ఆ తర్వాతి స్థానం వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిదే. ఇంకా... హెటెరో, అరబిందో ఫార్మా, రాంకీ,  వాన్‌పిక్‌,  దాల్మియా సిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, రఘురాం సిమెంట్స్‌,  పెన్నా సిమెంట్స్‌, ఇందూ టెక్‌ జోన్‌,  లేపాక్షి నాలెడ్జి హబ్‌, ఏపీ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌ తదితర కంపెనీలపై అభియోగాలు నమోదయ్యాయి. వైఎస్‌ సర్కారు నుంచి కాంట్రాక్టులు, భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పొంది... దీనికి బదులుగా (క్విడ్‌ ప్రో కో) జగన్‌ మీడియా సంస్థలతోపాటు, ఆయన సతీమణికి చెందిన భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులు (అత్యధిక ప్రీమియంతో వాటాల కొనుగోలు) పెట్టాయని సీబీఐ పేర్కొంది. ఇవి ముడుపులే కాని పెట్టుబడులు కావని స్పష్టం చేసింది.


కార్మెల్‌ ఆసియా, జగతి పబ్లికేషన్స్‌ వాల్యుయేషన్‌ను విజయసాయిరెడ్డి ఎక్కువగా చేసి చూపించి... ఒక్కో షేర్‌ను రూ.350తో కొనుగోలు చేయించారని, సూట్‌ కేస్‌ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఆయా కంపెనీలకు వైఎస్‌ ప్రభుత్వం చేసిన లబ్ధి, ఆ కంపెనీల ద్వారా జగన్‌ సంస్థల్లోకి నిధులు ప్రవహించిన విధానం, విదేశీ లింకులన్నీ పూసగుచ్చినట్లు వివరించింది. అక్రమ మనీలాండరింగ్‌ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు నివేదికలు ఉన్నందువల్లే సాక్షి టీవీకి అనుమతులు పునరుద్ధరించకుండా నిలిపివేశారు. పలు సంవత్సరాల పాటు సాక్షి టీవీ, సాక్షి పత్రిక, జననీ ఇన్‌ ఫ్రా ఖాతాలను సీబీఐ స్తంభింప చేసింది.


జైలు... బెయిలు... పిటిషన్లు..

అక్రమాస్తుల కేసులో 2012 మే నెలలో అరెస్టైన జగన్‌... 2013 సెప్టెంబరులో బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పటికీ ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మరుక్షణం నుంచే తనపై దాఖలైన చార్జిషీట్లకు సంబంఽధించి విచారణను ఆలస్యం చేసేందుకు ఆయన ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నిస్తూనే ఉన్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాను పార్లమెంట్‌ సభ్యుడినని, ఒక రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ అధ్యక్షుడినని, రాష్ట్రమంతటా పర్యటించాలని, తన తరఫున జి.అశోక్‌ రెడ్డి కోర్టుకు  హాజరవుతారని పేర్కొంటూ అనేక పిటిషన్లు దాఖలు చేశారు. అనేక పిటిషన్లను కోర్టు తిరస్కరించినప్పటికీ అదేపనిగా మళ్లీ మళ్లీ పిటిషన్లను దాఖలు చేస్తూనే ఉన్నారు. తాను 3 వేల కిమీ పాదయాత్ర చేయనున్న రీత్యా 2017 నుంచి 2018 వరకు  ఆరునెలల పాటు  వ్యక్తిగతంగా హాజరు కాలేనని పలు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిని కూడా కోర్టు తిరస్కరించింది. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నందువల్ల, భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉన్నందువల్ల తాను హైదరాబాద్‌కు విచారణకు రాలేనని పిటిషన్లు సమర్పించారు, ప్రతి గురువారం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చి శుక్రవారం రాత్రి రావడం వల్ల ప్రోటోకాల్‌, భద్రతకు సంబంధించిన సమస్యలు, ప్రజాధనం ఖర్చుపెట్టాల్సి రావడం  తలెత్తుతాయని కూడా చెప్పుకొన్నారు.


కింది కోర్టు ఈ పిటిషన్‌ కూడా తిరస్కరించినప్పటికీ ఆయన హైకోర్టుకు వెళ్లి అనుమతి  తెచ్చుకున్నారు. అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని కూడా జగన్‌  పిటిషన్లు దాఖలు చేశారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటూ డిశ్చార్జి పిటిషన్లను కూడా దాఖలు చేశారు. సీబీఐ కేసులకంటే ముందు ఈడీ కేసుల్లో విచారణ జరగరాదని కూడా కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 9న హైకోర్టులో జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇలా దాదాపు దశాబ్దకాలంగా తనపై నమోదైన కేసుల విచారణ ప్రక్రియ మొదలుకాకుండా జగన్‌ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ... కింది కోర్టు కొట్టివేస్తే హైకోర్టుకు వెళ్తూ... లిటిగేషన్లు చేస్తుండటంతో కేసులు ముందుకు కదలడం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవినీ కవచంగా వాడుకుంటున్నారని చెబుతున్నారు. 2013లో జగన్‌ బెయిల్‌కు సంబంధించిన కేసును విచారిస్తూ సుప్రీంకోర్టు తీవ్రమైన  వ్యాఖ్యలు చేసింది. ‘‘బెయిల్‌ విషయంలో ఆర్థిక నేరాలను ప్రత్యేక దృష్టిలో చూడాలి. భారీ ఎత్తున ప్రజల నిధులను స్వాహా చేసినందువల్ల వాటిని ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేసే నేరాలుగా భావించాలి’’ అని తెలిపింది.

Updated Date - 2022-09-27T06:43:53+05:30 IST