గన్ కల్చర్‌పై US సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. Joe Biden సర్కార్‌కు షాక్!

ABN , First Publish Date - 2022-06-24T14:24:27+05:30 IST

అమెరికాలో తుపాకీ హింస నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

గన్ కల్చర్‌పై US సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. Joe Biden సర్కార్‌కు షాక్!

తుపాకులు అమెరికన్ల హక్కు!

ఆత్మరక్షణ కోసం తీసుకెళ్లొచ్చు: సుప్రీంకోర్టు

వాషింగ్టన్‌, జూన్‌ 23: అమెరికాలో తుపాకీ హింస నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండే హక్కు అమెరికన్లకు ఉందని గురువారం స్పష్టం చేసింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌, బోస్టన్‌ తదితర పెద్ద నగరాలు సహా అన్ని  ప్రాంతాల్లో పౌరులు తమ వెంట తుపాకులు తీసుకుని వెళ్లొచ్చు. వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకీ కలిగి ఉండటం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ తీర్పులో రాశారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ చేసిన చట్టాన్ని కొట్టివేసింది. టెక్సస్‌, న్యూ యార్క్‌, కాలిఫోర్నియాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బైడెన్‌ సర్కారు తుపాకుల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. ఈ దశలో సుప్రీం తీర్పు వెలువడటం గమనార్హం.  


భారత్‌లో ‘మతస్వేచ్ఛ’ మృగ్యం!

అమెరికా పార్లమెంటు ముందుకు భారత్‌కు వ్యతిరేకంగా అసాధారణ రీతిలో ఒక తీర్మానం వచ్చింది. ‘మత స్వాతంత్య్రం ప్రమాదంలో పడిన’ దేశంగా భారత్‌ను ప్రకటించాలని ఆ తీర్మానం కోరింది. భారత్‌ పట్ల వ్యతిరేకతను, పాకిస్థాన్‌ పట్ల సానుకూలతను బాహాటంగానే ప్రదర్శించే అధికార డెమోక్రటిక్‌ పార్టీ మహిళా ఎంపీ ఇహాన్‌ ఒమన్‌ గురువారం ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు మహిళా ఎంపీలు రషీదా తాలిబ్‌, జువాన్‌ వర్గా్‌సతో కలిసి పార్లమెంటు దిగువ సభలో ఆమె ఈ అంశం లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని సభ విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘానికి నివేదించింది. దీనిపై అవసరమైన చర్యలను సూచించాలని సంఘాన్ని కోరింది.       

Updated Date - 2022-06-24T14:24:27+05:30 IST