ఆ తీర్పే అంతిమం.. రంగులు మార్చాల్సిందే!

ABN , First Publish Date - 2020-06-04T08:39:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర

ఆ తీర్పే అంతిమం.. రంగులు మార్చాల్సిందే!

  • వైసీపీ రంగులపై సుప్రీం తీర్పు
  • 4 వారాల్లో తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశం
  • హైకోర్టు తీర్పులో ఏ సందిగ్ధతా లేదు
  • అందులో జోక్యం చేసుకోనక్కర్లేదు
  • కోర్టు తీర్పులను పాటించి తీరాలి
  • లేదంటే చట్టపాలనకే విఘాతం
  • న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది
  • కార్యనిర్వాహక ఆదేశాలు
  • న్యాయసమీక్ష పరిధిలోకే వస్తాయ్‌
  • త్రిసభ్య ధర్మాసనం స్పష్టీకరణ
  • అధికారులపై ‘ధిక్కరణ’ నిలిపివేత


న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి సందిగ్ధతా లేదని తేల్చిచెప్పింది. కోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందని స్పష్టం చేసింది. పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ పతాకంలోని మూడు రంగులను మూడు వారాల్లో తొలగించాలని రాష్ట్ర హైకోర్టు మార్చి 10వ తేదీన తీర్పు ఇచ్చింది. దానికి విరుద్ధంగా.. ఉన్న మూడు రంగులకు అదనంగా మట్టి రంగు వేయాలని రాష్ట్రప్రభుత్వం 622, 623 జీవోలను జారీచేయడంతో హైకోర్టు ఆగ్రహించి వాటిని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ జీవోలను అమలు చేయకముందే రిట్‌ పిటిషన్‌ వేయడం సరికాదన్న రాష్ట్రప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ వాదనతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. 


హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని తేల్చిచెప్పింది. ‘ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరమే లేదని అభిప్రాయపడుతున్నాం. ఏ రాజకీయ పార్టీ పతాకాన్నీ పోలిన రంగులను పంచాయతీ భవనాలకు వేయరాదని మార్చి 10న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో ఎలాంటి సందిగ్ధతా లేదు. చాలా స్పష్టంగా ఉంది. తన ఆదేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతివాదులు (సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌) ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని హైకోర్టు కరెక్టుగానే చెప్పింది. కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు న్యాయసమీక్ష పరిధిలోకే వస్తాయి. కోర్టుల తీర్పులే అంతిమం. వాటిలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. వాటి అమలును శిరసావహించేందుకు నిరాకరిస్తే.. చట్టపాలనకే విఘాతం కలుగుతుంది. తీర్పులను అమలు చేయకుంటే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే సన్నగిల్లుతుంది’ అని ధర్మాసనం హెచ్చరించింది. హైకోర్టు మార్చి 10న ఇచ్చినదే తుది తీర్పు అని తేల్చిచెప్పింది. దీనిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి.. తీర్పులోని ఆదేశాలను సంపూర్ణంగా ఉల్లంఘిస్తూ రాష్ట్రప్రభుత్వం 622, 623 జీవోలు ఇచ్చిందన్న హైకోర్టు నిర్ధారణలను ఆమోదిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు మేరకు గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన రంగులను బుధవారం నుంచి నాలుగు వారాల్లో తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల అమలుకు గడువు పొడిగించినందున ప్రతివాదులపై కోర్టు ధిక్కరణ చర్యల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.


మీరు రంగులు వేసేదాకా వేచిచూడాలా?

అంతకుముందు సీనియర్‌ న్యాయవాది నరసింహ వాదనలు వినిపిస్తూ.. మట్టి రంగు జోడిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. ఇంకా రంగులు వేయలేదని తెలిపారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘జీవో అయితే ఇచ్చారు కదా..! మీరు రంగులు వేసే దాకా వేచిచూడాలా..’ అని నిలదీసింది. పంచాయతీ భవనాలకు జీవోలో పేర్కొన్న ఏ రంగులు వేయాలో ఇంకా నిర్ణయం కాలేదని న్యాయవాది ప్రస్తావించగా.. పార్టీ రంగులు ఉండొద్దని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ‘మట్టి రంగు జోడించినంత మాత్రాన రంగులు మార్చినట్లు కాదు. ఇది హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండేందుకు అన్వేషించిన తెలివైన మార్గం. ఒక వ్యవస్థ తన విధులను చట్టపరంగా నిర్వర్తించకపోతే (సప్రెషన్‌ ఆఫ్‌ పవర్స్‌ అండ్‌ రూల్‌ ఆఫ్‌ లా) కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. హైకోర్టు ఒకసారి ఉత్తర్వులిచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సిందే’ అని స్పష్టం చేసింది.


గడువులోపే ధిక్కార పిటిషన్‌ వేశారు..

సీఎ్‌స, ఇతర అధికారులపై హైకోర్టు ప్రారంభించిన కోర్టు ధిక్కరణ చర్యల గురించి నరసింహ ప్రస్తావించారు. రంగుల తొలగింపునకు హైకోర్టు తమకిచ్చిన గడువులోపే ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మూడు వారాల్లో రంగులు తొలగించాలని న్యాయస్థానం గడువిచ్చిందని.. అది ఇంకా ముగియలేదని పేర్కొన్నారు. అయితే రెండు వారాల్లో రంగులు తొలగిస్తామంటే.. ధిక్కరణ చర్యలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే మరింత గడువు కావాలని, కనీసం నాలుగు వారాల సమయమైనా ఇవ్వాలని నరసింహ విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అంగీకరించింది. బుధవారం నుంచి నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశిస్తూ సీఎస్‌, ఇతర అధికారులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణకు ప్రభుత్వ న్యాయవాది జీఎన్‌ రెడ్డి, ప్రతివాది సూర్యదేవర వెంకటరావు తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ గుంటూరు ప్రమోద్‌ కుమార్‌, న్యాయవాది ప్రేరణా సింగ్‌ హాజరయ్యారు.

Updated Date - 2020-06-04T08:39:35+05:30 IST