సూపర్‌స్ర్పెడర్లు 25 లక్షలపైనే!

ABN , First Publish Date - 2021-05-23T08:57:59+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ వైర్‌సను వేగంగా వ్యాపింప చేస్తారని భావిస్తున్న సూపర్‌ స్ర్పెడర్స్‌ 25 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా..

సూపర్‌స్ర్పెడర్లు 25 లక్షలపైనే!

  • వైద్య ఆరోగ్య శాఖ అంచనా.. 
  • జిల్లాలవారీగా వివరాల సేకరణ
  • 45+ ఏళ్ల వారికి కేంద్ర కోటాలో..
  • 18-44 ఏళ్ల వారికి రాష్ట్ర కోటాలో..
  • ఒకట్రెండు రోజుల్లో సీఎంకు నివేదిక
  • ఆ తర్వాత మార్గదర్శకాలు విడుదల
  • దేశంలోనే తొలిసారి తెలంగాణలోనే!


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ వైర్‌సను వేగంగా వ్యాపింప చేస్తారని భావిస్తున్న సూపర్‌ స్ర్పెడర్స్‌ 25 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా! కరోనా వాహకులుగా భావించే వీరందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారంతా ఈ సూపర్‌స్ర్పెడర్ల విభాగంలోకి వస్తారు. వీరిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లోనూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రాష్ట్రంలో  సూపర్‌స్ర్పెడర్లు 25 లక్షల వరకు ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా సేకరించిన సూపర్‌ స్ర్పెడర్ల వివరాలపై ఓ నివేదిక తయారు చేయనున్నారు. దాన్ని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా వారికి టీకా ఎలా ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సూపర్‌ స్ర్పెడర్లను వైద్య ఆరోగ్యశాఖ రెండు విభాగాల కింద పరిగణించనుంది. ఒకటి 45 ఏళ్లు పైబడినవారు, రెండోది 18-45 మధ్యవారు. మొదటి కేటగిరీలోకి వచ్చేవారందరికీ కేంద్ర ప్రభుత్వ కోటాలో టీకా ఇవ్వనున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలు ఇస్తోంది. ఆలోపు వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఇలా రెండు విభాగాలుగా చేసి సూపర్‌స్ర్పెడర్లందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. అయితే సూపర్‌స్ర్పెడర్లలో 45 ఏళ్లకు పైబడిన వారు కొందరు టీకా తీసుకొని ఉంటారనేది ఓ అంచనా. 

 

ఎప్పటి నుంచి అంటే..

టీకాల లభ్యతను బట్టి వీలైనంత త్వరగా ఈ సూపర్‌ స్ర్పెడర్లకు వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్యశాఖ చెబుతోంది. సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే ఈ కార్యక్రమం మొదలు పెడతామని అంటోంది. అయితే వీరికి కొవిన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలా లేక వచ్చిన వారికి వచ్చినట్లుగా టీకా ఇవ్వాలా? అన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిగిన తర్వాతే స్పష్టత వస్తుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైర్‌సను వేగంగా వ్యాప్తి చేసే సూపర్‌స్ర్పెడర్లకు ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి సూచించారు. అయితే కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా రాష్ట్రం తరఫున ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.  


సూపర్‌స్ర్పెడర్లు 25-30 లక్షల మంది..

రాష్ట్రంలో సూపర్‌స్ర్పెడర్ల సంఖ్య 25-30 లక్షలు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 13,16,391 రవాణా వాహనాలున్నాయి. అలాగే ట్యాక్సీ క్యాబ్‌లు 1,22,438 ఉన్నాయి. ఆర్టీసీలో 14905, ప్రైవేటు స్టేజ్‌ క్యారేజ్‌లు 3973, కాంట్రాక్టు క్యారేజ్‌లు 9529, గూడ్స్‌ క్యారేజ్‌ వాహనాలు 6,44,688 ఉన్నాయి. ఈ వాహనాలకు సంబంధించిన సిబ్బందే 22-25 లక్షల మంది ఉంటారు. వీరు కాక రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వీధి వ్యాపారులు 4 లక్షల మంది ఉన్నారు. అయితే అనధికారికంగా మరో లక్ష మంది వరకు ఉంటారని అంచనా. అలాగే బ్యాంకు ఉద్యోగులు, పెట్రోలు బంకుల్లో పనిచేసే వారంతా కలిపి మరో లక్ష వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు, జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల డెలివరీ బాయ్స్‌కు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


కొవిడ్‌ వేవ్‌లను నిరోధించవచ్చు..

సమాజంలో సూపర్‌స్ర్పెడర్లుగా ఉండేవారికి ముందుగా టీకాలివ్వడం అనేది చాలా మంచి విషయం. వారి వల్లే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. ముందుగా వీరికి టీకాలిస్తే వైరస్‌ వ్యాప్తిని ఆపవచ్చు. అలాగే వేవ్‌లు రాకుండా నిరోధించవచ్చు. ప్రస్తుతం టీకా లభ్యత తక్కువగా ఉంది. అయినప్పటికీ వీలైనంత త్వరగా వీరికి వ్యాక్సిన్‌ వేస్తే చాలా ప్రయోజనం. సూపర్‌స్ర్పెడర్లలో డ్రైవర్లే కాకుండా టీచర్లను కూడా చేర్చాలి. అలాగే టిఫెన్‌ సెంటర్ల వారిని, కిరాణా షాపుల వారిని కూడా చేర్చి వ్యాక్సిన్‌ ఇవ్వాలి. 

 డాక్టర్‌ ఎంవీ రావు, యశోదా ఆస్పత్రి


దేశంలో ఇదే తొలిసారి..

కొన్ని దేశాల్లో ఇప్పటికే సూపర్‌స్ర్పెడర్లను గుర్తించి టీకాలు ఇచ్చారు. మన దేశంలో మాత్రం తొలిసారిగా తెలంగాణలోనే వీరిని గుర్తించి టీకాలివ్వనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-23T08:57:59+05:30 IST