ఇంట్లో వడదెబ్బ

ABN , First Publish Date - 2022-05-17T05:49:02+05:30 IST

ఎర్రని ఎండల్లో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఉంటే చాలు ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా

ఇంట్లో వడదెబ్బ

ఎర్రని ఎండల్లో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఉంటే చాలు ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా? ఎండల్లో తిరిగినా, ఇంట్లో నీడ పట్టున ఉండిపోయినా సన్‌స్ట్రోక్‌ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. మరి ఈ నడి వేసవిలో ‘ఇండోర్‌ హీట్‌ స్ర్టోక్‌’ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?


ఎండ, వేడి సోకితేనే డీహైడ్రేషన్‌, ఎండదెబ్బ తగులుతుందని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉంటున్నవాళ్లు కూడా వేసవి వేడి మూలంగా డీహైడ్రేషన్‌, వడదెబ్బలతో కుదేలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎండలో తిరగడం వల్ల తగిలే ఎండదెబ్బ ఎంత ప్రమాదకరమైనదో, ఇంటిపట్టున తగిలే హీట్‌స్ట్రోక్‌ కూడా అంతే ప్రమాదకరమైనది. 


ఎందుకిలా?

గది ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ఇండోర్‌ హీట్‌ స్ర్టోక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత, గది ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీల సెల్షియస్‌ మాత్రమే ఉండాలి. కానీ ఇంట్లోని వాతావరణం వేడెక్కిపోవడం మూలంగా ఆ ప్రభావం మన శరీరాల మీద పడుతుంది. గదులు చిన్నవిగా, గాలి చొరబడే వీలు లేకుండా ఉన్నా, తలుపులు మూసి ఉంచుతున్నా, గదిలో ఫ్యాన్‌ గాలి బయటకు వెళ్లే వీలు లేక అదే ప్రదేశంలో తిరుగుతూ ఉన్నా, గది ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే ఐదు లేదా ఆరు డిగ్రీలు పెరిగిపోతుంది. ఎసి ఆపేసి, ఎండలో పార్క్‌ చేసిన కారులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఇంట్లో కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. విపరీతమైన ఉక్కపోత, డీహైడ్రేషన్‌ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎయిర్‌ కండిషనర్లు, ఎయిర్‌ కూలర్లతో గదిలోని వాతావరణాన్ని చల్లబరిచి, 25 డిగ్రీల కంటే తక్కువకు తగ్గించుకోవాలి. ఎసి, లేదా కూలర్లు లేకపోతే, కిటికీలను తెరచి ఉంచి, ఇంట్లోకి గాలి చొరబడేలా చేయాలి. వేడిని పీల్చుకోవడం కోసం కిటికీలకు తడిపిన కర్టెన్లు కట్టాలి. వంటింట్లో పని చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ తప్పక ఉపయోగించాలి. వంటగదిలోని కిటికీలు కూడా తెరచి ఉంచాలి. అలాగే ప్రతి అరగంటకూ నీళ్లు తాగుతూ ఉండాలి. 


సమస్యను పెంచే పొడి వాతావరణం

పొడి వాతావరణంలో డీహైడ్రేషన్‌ను గుర్తించడం కష్టం. తేమతో కూడిన విశాఖపట్నం, చెన్నైలతో పోలిస్తే, పొడిగా ఉండే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఇండోర్‌ హీట్‌స్ర్టోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం పొడి ప్రాంతాల్లో చమట పట్టకపోవడమే! కాబట్టి చమటతో సంబంధం లేకుండా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. 


దశలవారీ సన్‌స్ర్టోక్‌

వడదెబ్బ తగిలితే, మొదటి దశలో తీవ్రమైన అలసట, కండరాల బలహీనత, చమటలు పట్టే పరిస్థితి ఉంటుంది. రెండో దశలో శరీరం నిస్సత్తువగా మారిపోయి, అయోమయ పరిస్థితి నెలకొంటుంది. మూడో దశలో శరీరంలో ఎలక్ర్టొలైట్లను కోల్పోవడం మూలంగా మగతగా మారి స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతారు. ఈ పరిస్థితిలో చికిత్స ఆలస్యమైతే హీట్‌స్ర్టోక్‌ ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ప్రతి అరగంటకూ ఓఆర్‌ఎస్‌, ఇతర ద్రవాలను అందిస్తూ, చల్ల నీళ్లతో స్నానం చేయిస్తే, హీట్‌స్ర్టోక్‌ నుంచి కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ ఇలా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోతే వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 


చిట్కాలు ఉన్నాయి

ఇండోర్‌ హీట్‌స్ర్టోక్‌ తగలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

రోజులో 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగడంతో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ లేదా ఎలకా్ట్రల్‌ నీళ్లు అదనంగా తీసుకోవాలి.

ఆల్కహాల్‌, కెఫీన్‌, కృత్రిమ పండ్ల రసాలు, శీతల పానీయాలు శరీరాన్ని మరింత డీహైడ్రేట్‌ చేస్తాయి. కాబట్టి వేసవిలో వీటితో దాహార్తిని తీర్చుకోకూడదు.

మసాలాలు, ఉప్పు, కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం తగ్గించాలి. ఇవన్నీ డీహైడ్రేషన్‌ను పెంచుతాయి.

పెరుగన్నం, చల్లదనాన్నిచ్చే పండ్లు, నీరు ఎక్కువగా ఉండే పుచ్చ, దోస, బత్తాయి మొదలైన పండ్లు, కీరా లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలోకి వెళ్లకూడదు.

ఇంటి పనులు చేసేటప్పుడు ఎక్కువ అలసటకు గురవకుండా చూసుకోవాలి. సరిపడా నిద్ర, విశ్రాంతి అవసరం. 

రోజుకు రెండు సార్లు చల్లనీళ్లతో స్నానం చేయాలి.

ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా లేత రంగులతో కూడిన తేలికైన, చమటను పీల్చే కాటన్‌ దుస్తులు ధరించాలి.

బయటకు వెళ్లేటప్పుడు తలకు, ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోవాలి. గొడుగు ఉపయోగించాలి. సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి. నీళ్ల సీసా వెంటబెట్టుకెళ్లాలి. 

వంటగదిలో వీలైనంత తక్కువ సమయం గడపాలి. ఉదయం వేళ పెందలాడే వంట ముగించేసుకోవాలి. వంటగదిలో ఉన్నంతసేపూ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేసి ఉంచాలి.

జిమ్‌కు వెళ్లే అలవాటున్నా, ఇంట్లో వ్యాయామాలు చేస్తున్నా ఉదయం 8 లోపు, సాయంత్రం 6 గంటల్లోపు వ్యాయామాలు ముగించాలి. 

గది ఉష్ణోగ్రత 28 డిగ్రీలకు మించకుండా చూసుకోవాలి.


ఫ్రిడ్జ్‌ నీళ్లు వద్దు

చల్లచల్లని నీళ్లు గొంతులో నుంచి జారుతుంటే హాయిగా ఉండే మాట నిజమే అయినా, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే ఫ్రిజ్‌ నీళ్లను పరిమితంగానే తీసుకోవాలి. ఎండ వేడిమికి ఒంట్లో తరిగిన నీటి శాతాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం దాహం వేసిన ప్రతిసారీ ఫ్రిజ్‌లో చల్లబరిచిన నీళ్లు తాగితే, అవి జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీరంలో నీటి మోతాదు తరిగి డీహైడ్రేషన్‌కు గురవుతాం. కాబట్టి గది ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉన్న నీళ్లు లేదా కుండ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.


ఈ పానీయాలు శ్రేష్ఠం

సుగంధ పాల వేరుతో తయారుచేసే నన్నారి పానీయం వేసవి వేడిమి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే పచ్చి మామిడికాయతో తయారుచేసే ఆమ్‌ కా పన్నా, పుదీనా, జీలకర్ర పొడి కలిపిన తాజా మజ్జిగ, లేత జామ ఆకులు, కొత్తిమీర, తులసి, పుదీనా ఆకులను జోడించిన మజ్జిగ లాంటి పానీయాలు ఎండదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఉసిరి రసం కూడా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందుకోసం ఉసిరి కాయ ముక్కలు, కొద్దిగా అల్లం, చక్కెర దంచి, నీళ్లు కలుపుకుని తాగాలి. తాజా మజ్జిగలో సన్నగా తరిగిన అల్లం, నిమ్మ ఆకులు, కరివేపాకు వేసి కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. ఈ రసంతో జీర్ణశక్తి పెరిగి పేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 


ఏ ఓఆర్‌ఎస్‌లు మేలు?

ఒఆర్‌ఎస్‌లను తయారు చేసే కొన్ని ఔషథ సంస్థలు ‘ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ ఆమోదంతో ఒఆర్‌ఎస్‌ను తలపించే పానీయాలను తయారుచేస్తున్నాయి. ప్యాకెట్ల మీద ‘ఒఆర్‌ఎస్‌’ఎల్‌, విఐటి‘ఒఆర్‌ఎస్‌’ అనే లేబుళ్లు కనిపిస్తే, వాటి జోలికి వెళ్లకూడదు. 


ఇవి ఎంచుకోవాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన ఓఆర్‌ఎస్‌లను ఎంచుకోవాలి. వీటి మీద డబ్ల్యుహెచ్‌ఒ ఫార్ములా అని స్పష్టంగా ముద్రించి ఉంటుంది. అలాగే ఈ పదాల కోసం గమనించాలి.


ఎలకా్ట్రల్‌ వాలైట్‌

రాన్‌బాక్సీ ఒఆర్‌ఎస్‌ వాలైట్‌ ఒఆర్‌ఎస్‌

సిప్లా తయారీ ఒఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌) 


వీటిని దూరం పెట్టాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందని ఓఆర్‌ఎస్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమోదం మాత్రమే పొంది ఉంటాయి. అవేంటంటే...


ఒఆర్‌ఎస్‌ఎల్‌ 

(గ్రీన్‌యాపిల్‌, యాపిల్‌, ఆరెంజ్‌, లెమన్‌)

ఒఆర్‌ఎస్‌ఎల్‌ ప్లస్‌ (రెడీ టు సర్వ్‌)

రెబాలాంజ్‌ విట్‌ ఒఆర్‌ఎస్‌

వీటిలో తీపి కోసం ఎక్కువ చక్కెరలను కలిపేస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ములాకు బదులుగా బజార్లో దొరికే ఇలాంటి ఫార్ములాలను తాగితే, సమస్య తగ్గకపోగా, పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఎండదెబ్బ తగిలి డీహైడ్రేషన్‌కు లోనై, వాంతులు, విరోచనాలు వేధిస్తున్నప్పుడు ఇలాంటి ఓఆర్‌ఎస్‌లు తాగడం ప్రమాదకరం. డయేరియా లక్షణాలు తగ్గాలంటే తక్కువ చక్కెర, ఎక్కువ సోడియం, పొటాషియంలు ఉండే అసలైన ఒఆర్‌ఎస్‌లే తాగాలి. నకిలీ ఓఆర్‌ఎస్‌లలో ఎక్కువ పరిమాణాల్లో చక్కెర, తక్కువ మోతాదులో సోడియం, పొటాషిం ఉంటాయి. వీటితో విరోచనాలు అదుపు కాకపోగా, విపరీతంగా పెరిగిపోతాయి. దాంతో డీహైడ్రేషన్‌ మరింత పెరిగి పరిస్థితి విషమిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏవి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందినవో, ఏవి పొందనివో తెలుసుకోవాలి.

Updated Date - 2022-05-17T05:49:02+05:30 IST