బట్లర్‌ భళా.. రైజర్స్‌ డీలా

ABN , First Publish Date - 2021-05-03T09:53:59+05:30 IST

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెత్త ప్రదర్శనతో ఆరో ఓటమిని మూటగట్టుకొంది. డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించినా ఫలితం లేకపోయింది.

బట్లర్‌ భళా.. రైజర్స్‌ డీలా

జోస్‌ సెంచరీ

హైదరాబాద్‌కు తప్పని ఓటమి

ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇదే తొలి శతకం

వార్నర్‌ స్థానంలో విలియమ్సన్‌ పగ్గాలు చేపట్టినా సన్‌రైజర్స్‌ కథ మారలేదు. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటములతో ఫ్యాన్స్‌ను మరోసారి నిరాశపర్చింది. జోస్‌ బట్లర్‌  సెంచరీతో కదం తొక్కడంతో లీగ్‌లో రాజస్థాన్‌ మూడో విజయం నమోదు చేసింది. 


ఢిల్లీ: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెత్త ప్రదర్శనతో ఆరో ఓటమిని మూటగట్టుకొంది. డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించినా ఫలితం లేకపోయింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) సెంచరీతో వీరవిహారం చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 55 పరుగులతో హైదరాబాద్‌పై గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బట్లర్‌ శతకంతో చెలరేగడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) రాణించాడు. అనంతరం భారీ ఛేదనలో బ్యాటింగ్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్లు మనీశ్‌ పాండే (31), బెయిర్‌స్టో (30) మాత్రమే పోరాడే ప్రయత్నం చేశారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (20), విజయ్‌ శంకర్‌ (8), కేదార్‌ జాదవ్‌ (19) విఫలమయ్యారు. ముస్తాఫిజుర్‌ (3/20), క్రిస్‌ మోరిస్‌ (3/29) చెరి మూడు వికెట్లు పడగొట్టారు.  బట్లర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 


బెయిర్‌స్టో, పాండే పోరాడినా:

భారీ ఛేదనను హైదరాబాద్‌కు ఓపెనర్లు బెయిర్‌స్టో, మనీశ్‌ దాటిగా ప్రారంభించారు. తొలి ఆరు ఓవర్లలో వీరు భారీ షాట్లు ఆడడంతో సన్‌రైజర్స్‌ 57 రన్స్‌ చేసింది. అయితే ముస్తాఫిజుర్‌ వేసిన 7వ ఓవర్‌లో పాండే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. స్వల్ప తేడాతో బెయిర్‌స్టో కూడా పెవిలియన్‌ చేరాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ముస్తాఫిజుర్‌, మోరిస్‌ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. భారీ ఆశలున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. చివరి నాలుగు ఓవర్లలో హైదరాబాద్‌ విజయానికి 81 రన్స్‌ చేయాల్సి వచ్చింది. కానీ, మోరిస్‌ వేసిన 17వ ఓవర్లో కేదార్‌ జాదవ్‌, సమద్‌ అవుట్‌ కావడంతో సన్‌ రైజర్స్‌ గెలుపు ఆశలు వదులుకుంది. 


బట్లర్‌ జోరు:

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ ఆట హైలెట్‌గా నిలిచింది. అతను భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలింగ్‌ కకావికలైంది. కెప్టెన్‌ శాంసన్‌ కూడా వేగంగా ఆడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసినా.. భువనేశ్వర్‌, సందీప్‌, శంకర్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పవర్‌ప్లేలో రాజస్థాన్‌ ఒక వికెట్‌ కోల్పోయి 42 రన్స్‌ చేసింది. సందీప్‌ వేసిన 13వ ఓవర్‌లో సిక్సర్‌తో బట్లర్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. చివరి ఏడు ఓవర్లలో బట్లర్‌ మరింత చెలరేగాడు. అయితే అర్ధ సెంచరీకి 2 పరుగుల ముందు సంజూ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్‌లో బట్లర్‌ 56 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేశాడు. 19వ ఓవర్‌లో 6, 4, 6, 6 బాదిన జోస్‌ ఆఖరి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో చివరి బంతికి మిల్లర్‌ సిక్సర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 


రాజస్థాన్‌:

బట్లర్‌ (బి) సందీప్‌ 124; జైశ్వాల్‌ (ఎల్బీ) రషీద్‌ 12; శాంసన్‌ (సి) సమద్‌ (బి) శంకర్‌ 48; రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 15; మిల్లర్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 220/3; వికెట్ల పతనం: 1-17, 2-167, 3-209; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-37-0; సందీప్‌ శర్మ 4-0-50-1; రషీద్‌ 4-0-24-1; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-41-0; విజయ్‌ శంకర్‌ 3-0-42-1; నబీ 1-0-21-0. 


హైదరాబాద్‌:

మనీశ్‌ పాండే (బి) ముస్తాఫిజుర్‌ 31; బెయిర్‌స్టో (సి) అనుజ్‌ (బి) తెవాటియా 30; విలియమ్సన్‌ (సి) మోరిస్‌ (బి) త్యాగి 20; శంకర్‌ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 8; జాదవ్‌ (బి) మోరిస్‌ 19; నబీ (సి) అనుజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 17; సమద్‌ (సి) అనుజ్‌ (బి) మోరిస్‌ 10; రషీద్‌ (సి) మోరిస్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 14; సందీప్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 165/8; వికెట్ల పతనం: 1-57, 2-70, 3-85, 4-105, 5-127, 6-142, 7-142, 8-143; బౌలింగ్‌: త్యాగి 4-0-32-1; ముస్తాఫిజుర్‌  4-0-20-3; సకారియా 4-0- 38-0; మోరిస్‌ 4-0-29-3; తెవాటియా 4-0-45-1. 

Updated Date - 2021-05-03T09:53:59+05:30 IST