రైజింగ్‌ షురూ!

ABN , First Publish Date - 2020-09-30T09:37:13+05:30 IST

ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం రుచి చూసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తూ పటిష్ఠ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ....

రైజింగ్‌ షురూ!

200కి పైగా స్కోరు సాధిస్తేనే గ్యారెంటీ లేని తాజా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ చేసింది 162 పరుగులే.. అటు చూస్తే భీకర ఫామ్‌లో ఉండి ఓటమనేదే లేని ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఇంకేముంది రైజర్స్‌కు మరో ఓటమి ఖాయమే అనిపించింది.. కానీ బౌలింగే తమ ప్రధాన ఆయుధమనే అంచనాను నిజం చేస్తూ తొలిసారిగా రైజర్స్‌ బౌలర్లు కదం తొక్కారు. తొలి ఓవర్‌ నుంచే సాగించిన వికెట్ల వేటను చివరి వరకు కొనసాగిస్తూ తమ జట్టుకు గెలుపు బోణీ అందించారు. అంతకుముందు బెయిర్‌స్టో, వార్నర్‌, విలియమ్సన్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచారు.


బోణీ కొట్టిన హైదరాబాద్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం


అబుదాబి: ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం రుచి చూసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తూ పటిష్ఠ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో గెలిచింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ (3/14) తన లెగ్‌స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడుతూ శ్రేయాస్‌, ధవన్‌, పంత్‌ వికెట్లు తీశాడు. అటు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో రైజర్స్‌ ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), వార్నర్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), విలియమ్సన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. రబాడ, మిశ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి ఓడింది. ధవన్‌ (34), పంత్‌ (28) ఓమాదిరిగా ఆడారు. భువీకి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రషీద్‌ ఖాన్‌ నిలిచాడు.

బౌలర్ల హవా: ఓ మాదిరి లక్ష్యమే అయినా ఫామ్‌లో ఉన్న ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ఆరంభం నుంచే తడబడ్డారు.

పిచ్‌ చక్కగా సహకరించడంతో రైజర్స్‌ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస విరామాల్లో వికెట్లను తీశారు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా (2)ను భువనేశ్వర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. పవర్‌ప్లేలో 34 పరుగులే చేసిన ఢిల్లీ ఏడో ఓవర్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌ (17)ను కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ కేవలం ఒక్క పరుగే ఇచ్చి ఈ వికెట్‌ తీశాడు. ఈ సమయంలో ధవన్‌, పంత్‌ కాసేపు బౌలర్లను ఎదుర్కొన్నా పరుగుల్లో వేగం కనిపించలేదు. చివరకు కుదురుకున్న ధవన్‌ను కూడా రషీద్‌ తన గూగ్లీ బంతికి చిత్తు చేయడంతో 62 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. నెమ్మదైన ఆటతో రన్‌రేట్‌ భారీగా పెరుగుతుండడంతో రిషభ్‌ పంత్‌ 13వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత హెట్‌మయెర్‌ కూడా 15వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదడంతో రైజర్స్‌లో ఆందోళన పెరిగింది. కానీ స్వల్ప విరామంలోనే హెట్‌మయెర్‌ను భువీ.. పంత్‌ను రషీద్‌ పెవిలియన్‌కు చేర్చి ఊరటనిచ్చారు. 17వ ఓవర్‌లో ఏడు పరుగులే ఇచ్చిన నటరాజన్‌ సూపర్‌ యార్కర్‌తో స్టొయినిస్‌ (11)ను ఎల్బీ చేయడంతో ఢిల్లీ ఆశలు వదులుకుంది. ఆఖరి ఓవర్‌లో 28 రన్స్‌ కావాల్సి ఉండగా అక్షర్‌ (5) వికెట్‌ కోల్పోయి 12 పరుగులతో సరిపుచ్చుకుంది.

ఆరంభంలో ఆచితూచి.. : టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించినా చక్కటి భాగస్వామ్యాలతో ఈసారి మెరుగ్గా ఆడింది. ప్రారంభంలో ఢిల్లీ బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులు వేయగా ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో ఆచితూచి స్పందించారు. చివరకు ఆరో ఓవర్‌లో వార్నర్‌ 6,4 బాది పవర్‌ప్లేలో స్కోరును 38 పరుగులకు చేర్చాడు. అయితే ఆ తర్వాత కూడా ఎక్కువగా భారీ షాట్లకు వెళ్లకున్నా క్రీజు మధ్యలో చురుగ్గా పరిగెడుతూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ రన్‌రేట్‌ తగ్గకుండా చూస్తూ తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే కీలక సమయంలో స్పిన్నర్‌ మిశ్రా వరుస ఓవర్లలో వార్నర్‌, మనీశ్‌ పాండే (3) వికెట్లను తీసి రైజర్స్‌కు ఝలక్‌ ఇచ్చాడు. 

విలియమ్సన్‌ క్లాస్‌..: మిడిలార్డర్‌ పటిష్ఠంలో భాగంగా జట్టులోకి వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ తనపై అంచనాలను నిజం చేస్తూ చెలరేగాడు. కళాత్మక షాట్లతో ఆకట్టుకుంటూ బెయిర్‌స్టోతో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేశాడు. 16, 17 ఓవర్లలో అతను రెండేసి ఫోర్లతో గేరు మార్చి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా అటు బెయిర్‌స్టో 43 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే 18వ ఓవర్‌లో బెయిర్‌స్టోను రబాడ అవుట్‌ చేశాడు. ఇక, తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన టీనేజర్‌ అబ్దుల్‌ మసద్‌ 4,6తో 19వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో విలియమ్సన్‌ను అవుట్‌ చేసిన రబాడ కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో రైజర్స్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి) పంత్‌ (బి) మిశ్రా 45, బెయిర్‌స్టో (సి) నోకియా (బి) రబాడ 53, మనీశ్‌ పాండే (సి) రబాడ (బి) మిశ్రా 3, విలియమ్సన్‌ (సి) అక్షర్‌ (బి) రబాడ 41, సమద్‌ (నాటౌట్‌) 12, అభిషేక్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 162/4. వికెట్ల పతనం: 1-77, 2-92, 3-144, 4-160. బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 3-0-26-0, రబాడ 4-0-21-2, నోకియా 4-0-40-0, స్టొయినిస్‌ 3-0-22-0, అమిత్‌ మిశ్రా 4-0-35-2, అక్షర్‌ 2-0-14-0.

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్‌ 2, ధవన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 34, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 17, రిషభ్‌ పంత్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 28, హెట్‌మయర్‌ (సి) మనీష్‌ పాండే (బి) భువనేశ్వర్‌ 21, స్టొయినిస్‌ (ఎల్బీ) (బి) నటరాజన్‌ 11, అక్షర్‌ (బి) ఖలీల్‌ 5, రబాడ (నాటౌట్‌) 15, నోకియా (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం:  20 ఓవర్లలో 147/7. వికెట్ల పతనం: 1-2, 2-42, 3-62, 4-104, 5-117, 6-126, 7-138. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-2, ఖలీల్‌ అహ్మద్‌ 4-0-43-1, నటరాజన్‌ 4-0-25-1, అభిషేక్‌ శర్మ 4-0-34-0, రషీద్‌ ఖాన్‌ 4-0-14-3.

Updated Date - 2020-09-30T09:37:13+05:30 IST