మేకిన్ ఇండియా పేరుతో సెల్లింగ్ ఇండియా...‌: సుంకర పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-03-25T21:18:06+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేకిన్ ఇండియా పేరుతో సెల్లింగ్ ఇండియా...‌: సుంకర పద్మశ్రీ

విజయవాడ‌: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ  ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ..అన్నం పెట్టే రైతులను రోడ్ల పాలు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా పేరుతో సెల్లింగ్ ఇండియా చేస్తున్నారని  ఎద్దేవా చేశారు. దేశభక్తి ,హిందూత్వం పేరుతో బీజేపీ దేశ ప్రజలకు శఠగోపురం పెడుతోందన్నారు. దేశ భవిష్యత్‌ను మార్చగలిగే యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని సుంకర పద్మశ్రీ  ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయిలో ఉండి మోదీ దిగజారి మాట్లాడి.... ప్రధాని పదవికి కళంకం తేస్తున్నారని సుంకర పద్మశ్రీ  చెప్పారు. నేత లేడు - నీతి లేదు అని కాంగ్రెస్‌పై ఆయన చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు.


ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని నాశనం చేస్తుంటే నోరు విప్పడం లేదని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం అని మీరు ఇచ్చిన మాట మీకైనా గుర్తుందా ? అని సుంకర పద్మశ్రీ   నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ఇచ్చిన హామీ, విభజన హామీలు అమలు చేయగలరా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఊపిరిపోసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ గుజరాత్ వ్యాపారస్తులకు అమ్మేస్తున్నారని సుంకర పద్మశ్రీ  ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని సుంకర పద్మశ్రీ  కోరారు


విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అలాంటి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సుంకర పద్మశ్రీ   డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ నేతలను చూస్తుంటే జాలి కలుగుతుందని సుంకర పద్మశ్రీ  వ్యాఖ్యానించారు. ఏపీలో మేకపోతు గాంభీర్యం ఢిల్లీలో పిల్లి కూతలు పాపం బీజేపీ నేతలని సెటైర్లు వేశారు. మీ రాజకీయ స్వార్థం కోసం ఏపీకి ద్రోహం చేసి చరిత్రహీనులు కావొద్దని హితువు పలికారు. ప్రజలు సంస్కారం ఉన్న వాళ్లు కాబట్టి మీకు చెప్పుతో కాదు ఓటుతో బుద్ధి చెబుతారని సుంకర పద్మశ్రీ  పేర్కొన్నారు.

Updated Date - 2021-03-25T21:18:06+05:30 IST