జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు 30 వరకు

ABN , First Publish Date - 2021-06-20T10:24:48+05:30 IST

రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటినీ ప్రారంభించాలన్న మంత్రిమండలి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచగా..

జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు 30 వరకు

పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం.. 1న పునఃప్రారంభం 

ఇంటర్‌ బోర్డు బాటలోనే పాఠశాల విద్యాశాఖ?

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటినీ ప్రారంభించాలన్న మంత్రిమండలి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచగా.. ఇంటర్‌ బోర్డు మరింత ఆశ్చర్యం కలిగించే నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 20 వరకు ఉన్న వేసవి సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించింది. జూలై 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని, సిబ్బంది అప్పటినుంచే విధులకు హాజరు కావాలని పేర్కొంటూ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి జూనియర్‌  కాలేజీలకు వేసవి సెలవులను తొలుత మే 31 వరకే ఇచ్చారు. అయితే కరోనా కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో సెలవులను బోర్డు ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే పొడిగిస్తున్నట్లు గతంలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించడం, ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది అంతా విధులు నిర్వర్తిస్తుండడంతో పాఠశాలలు, కళాశాలలకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ నెల 21 నుంచి హాజరుకావాల్సి ఉంటుందని అందరూ భావించారు. కానీ, జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులను అనూహ్యంగా పొడిగించడంతో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం చల్లబడినా, లాక్‌డౌన్‌ను కూడా ఎత్తేసినా సెలవులను పొడిగించడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విషయంపై మాత్రం పాఠశాల విద్యాశాఖ శనివారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్‌ బోర్డు తరహాలోనే స్కూళ్లకు సైతం వేసవి సెలవులను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తారని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. జూలై 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నందున.. టీచర్లు కూడా అప్పటినుంచే విధులకు హాజరవ్వాలన్న ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-06-20T10:24:48+05:30 IST