పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. జావెలిన్ త్రోలో సుమిత్‌కు స్వర్ణం

ABN , First Publish Date - 2021-08-30T22:21:15+05:30 IST

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. జావెలిన్ త్రోలో సుమిత్‌కు స్వర్ణం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో నేడు మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలుగొట్టి స్వర్ణ పతకం సాధించాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌ నాలుగు పతకాలు సాధించగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఈ ఉదయం దేవేంద్ర ఝహారియా జావెలిన్ త్రో ఎఫ్-46లో రజత పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో అతడికిది మూడో పతకం కాగా,  డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. అలాగే, ఎఫ్-46లోనే సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకం సాధించి పెట్టాడు.


అంతకుముందు అవనీ లేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్1 ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఫలితంగా 19 ఏళ్ల అవని.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 25వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో చైనా 119 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Updated Date - 2021-08-30T22:21:15+05:30 IST