సంతోష్‌కు నెలరోజులుగా ఫోన్లు!

ABN , First Publish Date - 2022-04-18T08:24:41+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. శనివారం కామారెడ్డిలో తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా

సంతోష్‌కు నెలరోజులుగా ఫోన్లు!

జితేందర్‌గౌడ్‌, యాదగిరి, సీఐ నంబర్ల నుంచి..

మొబైల్‌ కాల్‌ డేటాలో గుర్తించిన పోలీసులు

తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

కేసును బాన్సువాడ డీఎస్పీకి బదిలీ చేసిన ఎస్పీ

ఏడుగురిపై కేసులు నమోదు.. ఏ7గా నాటి సీఐ

నిందితులపై చర్యలకు ఆర్యవైశ్య సంఘం డిమాండ్‌

ఆత్మహత్యలతో తమకు సంబంధం లేదన్న నిందితులు

అజ్ఞాతం నుంచి మీడియా ప్రతినిధులకు ఫోన్‌

ఇంకా పట్టుకోకపోవడంపై పోలీసులపై విమర్శలు

నిందితులపై పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ చర్యలు!


కామారెడ్డి/రామాయంపేట/మెదక్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. శనివారం కామారెడ్డిలో తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం సంతో్‌షకు నెల రోజులుగా మునిసిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ యాదగిరి, సీఐ నాగార్జునగౌడ్‌ల నుంచి ఎక్కువసార్లు ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. లాడ్జిలోని సంఘటన స్థలంలో దొరికిన సంతోష్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించగా.. ఈ విషయం తెలిసినట్లు సమాచారం. దీనిపై సీఐ నాగార్జునగౌడ్‌తోపాటు పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇందుకోసం కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డికి అప్పగించారు. ఆయన నేతృత్వం లో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ము మ్మరం చేశారు. ఇప్పటికే సంతోష్‌ సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల మేరకు ఏడుగురిపై 306 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. ఏ1గా మునిసిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, ఏ2గా ఏఏంసీ చైర్మన్‌ సరాప్‌ యాదగిరి, ఏ3గా పృథ్వీరాజ్‌, ఏ4గా తోట కిరణ్‌, ఏ5గా కృష్ణాగౌడ్‌, ఏ6గా స్వరాజ్‌, ఏ7గా అప్పటి రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌లను చేర్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


అధికార పార్టీ నేతల ఆగడాలతోనే!

అధికార పార్టీ నేతల ఆగడాలు, వారి అడుగులకు మడుగులొత్తిన పోలీసు అధికారి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలికావడంతో వారిపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వివరించినా పట్టించుకోలేదని సంతోష్‌ తన సెల్ఫీ వీడియోలో వాపోయిన విషయం తెలిసిందే. నిందితుల ఆగడాలు భరించలేక కామారెడ్డికి వెళ్లిన సంతోష్‌, ఆయ న తల్లి.. లాడ్జిలో రూమ్‌ తీసుకుని ఉన్నారు. ఐదు రోజులపాటు వారు తీవ్ర మనోవేదన అనుభవించినట్లు తెలుస్తోంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక కన్నతల్లితో చెప్పుకొని ఆత్మహత్య చేసుకోవాలని సంతోష్‌ నిర్ణయించుకోవడంతో కొడుకు లేకుండా బతకలేనంటూ ఆమె కూడా అతనితోపాటే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, సంతోష్‌, పద్మ ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆదివారం డీఎస్పీ సోమనాథంను కలిసి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు నిందితులపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  


ఆ ఆరుగురు ఎక్కడున్నారు? 

సంతోష్‌ అతని తల్లి పద్మల బలవన్మరణానికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడున్నారు? ఆత్మహత్యలతో సంబంధం లేకుంటే ఆ ఆరుగురు రహస్య ప్రాంతాల నుంచి మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటి? రెండు రోజులు కావస్తున్నా పోలీసులు పురోగతి ఎందుకు సాధించలేకపోతున్నారు? సెల్‌ఫోన్‌ సిగ్నల్‌, సీసీ కెమెరాల సహాయంతో ఎన్నో కీలక కేసులు గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు వీరిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? ఇప్పుడు రామాయంపేటలో ఎవరిని కదిలించినా ఇలాం టి ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రామాయంపేట విలేకరులతో ఫోన్‌లో మాట్లాడిన జితేందర్‌గౌడ్‌, యాదగిరి.. తమ పరువుకు భంగం కలిగించే విధంగా సంతోష్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌లపై జనవరి 3న ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. దానిపై విచారణ జరిగిన తరువాత తామెన్నడూ సంతో్‌షపై కక్షగట్టలేద ని, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడలేదన్నారు. వారి చావులకు తామే కారణమంటూ ప్రతిపక్షాలు రాజకీయ కుట్రతో ఆరోపిస్తున్నాయన్నారు. అయితే సంతోష్‌ పోస్టింగ్‌లపై టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుతోపాటు వారిపై సంతోష్‌ చేసిన ఫిర్యాదుపై పోలీసులు అప్పుడే కేసులు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


ఇంతకీ ఆ ఫోన్‌లో ఏముంది?

 సంతోష్‌ సెల్‌ఫోన్‌లో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది. సీఐ నాగార్జునగౌడ్‌ తన సెల్‌ఫోన్‌ లాక్కుని వ్యక్తిగత, వ్యాపార సమాచారాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు జితేందర్‌గౌడ్‌, యాదగిరిలకు ఇచ్చినప్పటి నుంచే వేధింపులు ఎక్కువయ్యాయని సంతోష్‌, పద్మ తమ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే సంతోష్‌ ప్రాణం తీసుకునేంతటి ముఖ్యమైన సమాచారం సెల్‌ఫోన్‌లో ఏముందన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఇదే విషయమై ఇంటలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సీఐ నాగార్జునగౌడ్‌ పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ నాయకులు ఆదివారం రామాయంపేటలో ఆందోళన చేపట్టారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ఏడుగురు టీఆర్‌ఎస్‌ నేతల ఫ్లెక్సీని దహనం చేశారు. 


అండగా మేముంటాం: రేవంత్‌రెడ్డి భరోసా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆదివారం రామాయంపేటకు వెళ్లి సంతోష్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. సంతోష్‌ కుటుంబపెద్ద గంగం అంజయ్య, కుమారుడు శ్రీధర్‌తో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. అధైర్య పడొద్దు. కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరో సా ఇచ్చారు. కాగా, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసైగల్లోనే నిందితులు ఉన్నారని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. మరో 48 గంటల్లో వారిని పట్టుకొని శిక్షించకపోతే మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఘటనకు మెదక్‌ ఎమ్మెల్యే సైతం నైతిక బాధ్యత వహించాలన్నారు. కాగా, ఆత్మహత్య ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. అధికార పార్టీకి కొమ్ముకాయడాన్ని పోలీసులు మానుకున్నప్పుడే టీఆర్‌ఎస్‌ గూండాయిజం పోతుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. 

Updated Date - 2022-04-18T08:24:41+05:30 IST