బొబ్బలెక్కిన కాళ్లు.... నీళ్లింకిన కళ్లు

ABN , First Publish Date - 2022-09-20T09:11:51+05:30 IST

ఏడు రోజుల సుదీర్ఘనడక......ఇంటిదగ్గర గొడ్డు, గోదా వదిలేసి రోడ్డెక్కిన వారు కొందరైతే....పిల్లల భవిష్యత్తు కోసం నడుం బిగించిన వారు మరికొందరు....రాజధాని కోసం ఈ మాత్రం నడక సాగించలేమా అని మొండిగా..

బొబ్బలెక్కిన కాళ్లు.... నీళ్లింకిన కళ్లు

మహాపాదయాత్రలో రైతుల యాతన

ఏడు రోజుల నిరంతరాయ నడకతో భరించలేని నొప్పులు, కాళ్ల వాపులు 

అయినా,జగన్‌ ద్రోహం ముందు ఇవెంత? అడుగు ఆపేది లేదన్న పాదయాత్రికులు 

రేపల్లె శిబిరంలో వైద్యపరీక్షల నిర్వహణ

నేడు కృష్ణాజిల్లాలోకి పాదయాత్ర...


బాపట్ల / రేపల్లె సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏడు రోజుల సుదీర్ఘనడక......ఇంటిదగ్గర గొడ్డు, గోదా వదిలేసి రోడ్డెక్కిన వారు కొందరైతే....పిల్లల భవిష్యత్తు కోసం నడుం బిగించిన వారు మరికొందరు....రాజధాని కోసం ఈ మాత్రం నడక సాగించలేమా అని మొండిగా అడుగులేస్తున్నవారు ఇంకొందరు...అలుపెరగకుండా వయసును లెక్క చేయకుండా మొండిగా నడవడంతో కాళ్లు వాయడం, బొబ్బలెక్కడం, కాలివేళ్లమధ్యన వాపులు...ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కన్నీళ్లే! ఒకరికొకరు సపర్యలు చేసుకుంటూ.. తదుపరి అడుగులకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ మహాపాదయాత్రకు విరామం రోజయినా సోమవారం కనిపించిన దృశ్యాలు! నొప్పులు బాధిస్తుండగా, ‘ప్రభుత్వం కొట్టిన సమ్మెట దెబ్బ ముందు ఈ నొప్పులు పెద్ద లెక్కలోకి కావు’ అని కొందరు పాదయాత్రికులు నీళ్లింకిన కళ్లతో చెబుతుండడం వారి ఆవేదనకు అద్దంపట్టింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కుట్రలు చేసినా అన్నింటినీ ఛేదించుకుని ముందుకుపోవాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ‘అరసవెల్లి భగవానుడి దర్శనం చేసుకుని తమ గోడు చెప్పుకొని తీరతాం’ అని అమరావతి రాజధాని రైతులు చెబుతున్నారు.


అలసిసొలసి...

మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులతోపాటు కళాకారుల బృందం,  వంటగాళ్లు, డ్రైవర్లు, ఇలా అందరూ సోమవారం సేదతీరారు. నడక సాగిస్తున్న అమరావతి రైతులలో ఎక్కువమంది మహిళలు. అందునా వయసుపైబడినవారే. కాళ్లనొప్పులు, వాపులకు ఔషధాలు తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. చాలామంది తమ యోగక్షేమాలను ఫోన్లలో తమ వారికి వివరిస్తూ కనిపించారు. 


శిబిరంలో వైద్య పరీక్షలు...

రేపల్లెలోని సురక్షా ఆస్పత్రి నిర్వాహకులు మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందించారు. మందడం, మల్కాపురాలకు చెందిన మహిళా రైతులకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించగా, తాము నడక ఆపేది లేదని వారు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరిని పరీక్షించి గతంలో వారికున్న ఆరోగ్యపరమైన సమస్యలు తెలుసుకుని నడకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యబృందం వారికి సూచించింది.


మద్దతుకు విరామం లేదు..

సోమవారం విశ్రాంతి రోజయినప్పటికీ స్థానికంగా ఉన్న ప్రజలు వచ్చి వివిధ రూపాలలో తమ మద్దతును తెలిపారు. పాదయాత్రికులకు గొడుగులు పంచిపెట్టి సంఘీభావం ఒకరు తెలిపితే, మరొకరు పండ్లు పంచిపెట్టి అండగా నిలిచారు. ఇంకొకరయితే తన పుట్టినరోజును మహాపాదయాత్ర చేస్తున్న రైతుల మధ్య జరుపుకుని ఆనందం వ్యక్తం చేశారు.


ఈ నెల 12న రాజధాని గ్రామం వెంకటపాలెం సమీపంలోని శ్రీవెంకటేశ్వరుని ఆలయం నుంచి మొదలైన పాదయాత్ర 15న బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. 12 నుంచి 18వరకు సాగిన మహాపాదయాత్ర 123 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. వారం రోజుల సుదీర్ఘ నడక తర్వాత సోమవారం పాదయాత్రకు విరామమిచ్చి రేపల్లెలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్‌ హాల్‌, ఎంసీఏ హాల్‌లో అమరావతి రైతులు సేదతీరారు


 నేడు కృష్ణాలోకి నడక....

రేపల్లెలోని పెనుమూడి రోడ్‌ వద్ద ఆదివారం నడక ఆగింది. సోమవారం విరామం కోసం రేపల్లెలో బస చేశారు. తిరిగి మంగళవారం ఉదయం పెనుమూడి రోడ్‌ వద్ద మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. మూడు కిలోమీటర్ల నడక అనంతరం రాజధాని రైతుల మహాపాదయాత్ర కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. 



వారు రాజధాని గ్రామం మల్కాపురానికి చెందిన భార్యభర్తలు . భర్తపేరు దేవళ్‌రావు, భార్యపేరు సుధారాణి. వీరు ఎకరన్నర భూమిని అమరావతికి ఇచ్చారు. భార్యకు కాళ్లు వాచి నడవలేని స్థితిలో ఉండడంతో భర్త సేవలు చేస్తున్న దృశ్యం ఇది!


ఈయన పేరు రామిశెట్టి బ్రహ్మనాయుడు. తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతు. తనకున్న 44 సెంట్లను రాజధానికోసం ఇచ్చారు. 72 ఏళ్ల వయసులో అలుపెరగకుండా నడవడంతో కాళ్లు వాచి భరించలేని నొప్పులను ఆయన అనుభవిస్తున్నారు. పాదయాత్రికుల వెంట వచ్చిన ఓ డ్రైవర్‌.. ఆయన కాళ్లు నొక్కుతున్న దృశ్యమిది. 

Updated Date - 2022-09-20T09:11:51+05:30 IST