Abn logo
Sep 21 2020 @ 00:00AM

పాడిపరిశ్రమతో కొత్త జీవితం

Kaakateeya

సమాజంలో తమపట్ల ఉన్న చెడు అభిప్రాయాన్ని తుడిచేయాలనుకున్నారు. అందరిలా గౌరవంగా బతకాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు వారు సొంతంగా పాల కేంద్రాన్ని నిర్వహిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. దేశంలోనే ట్రాన్స్‌జెండర్‌ మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న మొట్టమొదటి ‘మిల్క్‌ సొసైటీ’ని విజయవంతంగా నడుపుతున్న తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ మహిళల పాడి ప్రయాణమిది...


తూతుకూడి జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరంలోని మంథితోపు గ్రామంలోని డెయిరీ ఫార్మ్‌ ఇప్పుడు 85 మంది ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు ఇల్లు, బతుకునిచ్చే చోటు. అప్పటిదాకా చేయి చాచి బతికిన వారు ఇప్పుడు తలెత్తుకొని జీవిస్తున్నారు. ‘‘జీవితంలో మొదటిసారి మేము అందరితో సమానం అని అనిపిస్తుంది. అవకాశాలు ప్రతి ఒక్కరిలోని నైపుణ్యం, సత్తాను చాటుతాయడానికి మా సహకార సంఘం నిరూపించింది. మాకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని విజయం సాధిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే  ఎదర్కోగలమనే నమ్మకం, ధైర్యం మాకు ఉన్నాయి’’ అని గర్వంగా చెబుతారు దేశంలోనే ట్రాన్స్‌జెండర్‌ మహిళల పేరుతో రిజిస్టర్‌ అయిన మొట్టమొదటి ‘మిల్క్‌ సొసైటీ’కి అధ్యక్షురాలైన భూమిక. కోవిల్‌ పట్టిలోని మారుమూల గ్రామానికి చెందిన ఆమె ట్రాన్స్‌జెండర్‌ అన్న కారణంతో ప్రతి సంవత్సరం అయిదారు ఇళ్లు మారాల్సి వచ్చేది. ‘ఎట్టకేలకు మాకు ఇప్పుడు ప్రశాంతత దొరికింది’ అంటారు భూమిక.


కలెక్టర్‌ చొరవతో కొత్త జీవితం

కొన్ని జిల్లాల్లో ట్రాన్‌ ్సజెండర్‌ మహిళల కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేశారు. అయితే తుతూకూడిలో అలా కాకుండా  తమకు నివాసంతో పాటు జీవనోపాధి మార్గం కూడా చూపాలని తూతుకూడి జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరిని కలిసి ఏడాది క్రితం తమ గోడు విన్నవించారు ట్రాన్స్‌జెండర్‌ మహిళల హక్కుల కోసం పోరాడుతున్న గ్రేస్‌బాను. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే నిరంతరం ఉపాధి పొందే ఏర్పాటు చేయాలనుకున్నారాయన. అప్పుడే ఆయనకు డెయిరీ ఫార్మ్‌తో ట్రాన్స్‌జెండర్లకు స్థిరమైన ఉపాధి కల్పించవచ్చనే ఆలోచన వచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ మహిళల పేరుతో ‘మిల్క్‌ సొసైటీ’ని రిజిస్టర్‌ చేయించారు. మంథతోపెలోని రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు అధికారులు. చీఫ్‌ మినిస్టర్‌ సోలార్‌ పవర్డ్‌ గ్రీన్‌హౌజెస్‌ ఫర్‌ ట్రాన్స్‌జెండర్ల కోటా కింది అందరికీ ఇళ్లు కట్టించారు. మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు రోడ్లు వేశారు. పశుసంరక్షణ అధికారుల సూచనల ప్రకారం ఆవుల కోసం షెడ్డు నిర్మించారు.


ఛీఫ్‌ మినిస్టర్‌ గ్రీన్‌హౌజ్‌ ఇనీషియేటివ్‌ కింద షెడ్డు, ఇళ్లకు సౌర విద్యుత్‌ ఏర్పాట్లు చేశారు. రెండు పాడి ఆవులను కొనేందుకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున రుణం ఇప్పించారు. మొదటి విడతగా 30 ఆవులను కొన్నారు. ఆవులను మేపడం, పాలు పితకడం గురించి పది రోజులు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ ‘ఆవిన్‌’ వీరి కేంద్రం నుంచి ఉదయం, సాయంత్రం పాలు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది. రెవెన్యూ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, పశుసంరక్షణ, సహకార సంఘం, రూరల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌ మొదటి వారంలో కలెక్టర్‌ సందీప్‌ ట్రాన్స్‌జెండర్‌ మహిళల ఆధ్వర్యంలో నడిచే ‘డెయిరీ ఫార్మ్‌ను  ప్రారంభించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ‘‘ట్రాన్స్‌జెండర్లు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడం, వారికి స్థిరమైన ఆదాయ మార్గం చూపడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశం’’ అంటారు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ థనపథి. రాబోయే రోజుల్లో ట్రాన్స్‌జెండర్లకు పేపర్‌ ప్లేట్స్‌ తయారీ ద్వారా జీవనోపాధి చూపాలనే ఆలోచనలో ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు. తమకు బతుకు దారి చూపిన కలెక్టర్‌ మీద అభిమానంతో తమ కాలనీకి ‘సందీప్‌ నగర్‌’ అని పేరు పెట్టారు.


రోల్‌మోడల్‌గా నిలుస్తాం

‘‘ఇది ఆరంభం మాత్రమే. మేము కూడా ఇతర కమ్యూనిటీలకు రోల్‌మోడల్‌ అవుతాం. మాది దేశంలోనే ట్రాన్స్‌జెండర్‌ మహిళలు నడుపుతున్న మొట్టమొదటి మిల్క్‌ సొసైటీ. మా సొసైటీ ‘ద మంథతోపె ట్రాన్స్‌జెండర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ సొసైటీ’ ద్వారా రోజుకు 250 నుంచి 280 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నాం. మా 85 మందిలో 30 మంది వద్దే సరైన పత్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో కొందరు డిగ్రీ చదివిన వారు, తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ రిజర్వ్‌ బోర్డులో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. వారికి ఏ లోటు లేకుండా చూడడమే కాకుండా, వారు తిరిగి చదువు కొనసాగించాలని అందరం కోరుకుంటున్నాం’’ అని వివరిస్తారు బాను.  


Advertisement
Advertisement
Advertisement