‘ఎస్‌ఈబీ’ వివరాలు సమర్పించండి

ABN , First Publish Date - 2020-06-05T09:35:49+05:30 IST

‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో’ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన

‘ఎస్‌ఈబీ’ వివరాలు సమర్పించండి

  • సీఎస్‌ సహా ఆరుగురికి హైకోర్టు నోటీసులు
  • ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసిన ఉద్యోగుల సమాఖ్య నేత


అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో’ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌ కమిషనర్‌, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, ఎస్‌ఈబీ ముఖ్య కార్యదర్శి, ఎస్‌ఈబీ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక, అక్రమ మద్యం నిరోఽధానికి ఎస్‌ఈబీ ఏర్పాటు చేస్తూ గత నెల 9న జీవో 41 జారీ అయిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాకు చెందిన పి.శ్రీనివాసరావు దీనిని హైకోర్టులో  సవాల్‌ చేశారు. దీనిపై గురువారం ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఎస్‌ఈబీకి న్యాయబద్ధ అనుమతి లేదని, బ్యూరో కేసులు నమోదు చేసినా న్యాయపరీక్షలో నిలబడవని తెలిపారు. జిల్లా, జోనల్‌ కేడర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్‌ అధికారులను బ్యూరో లో నియమిస్తున్నారని, సిబ్బందికి ఆప్షన్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా ఎస్‌ఈబీ ఏర్పాటుపై తమకెలాంటి అభ్యంతరం లేదని, దీనివల్ల తాము ఎదుర్కొనే సమస్యలూ లేవని ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది సుధీర్‌.. ఎస్‌ఈబీ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థించడంతో ధర్మాసనం అనుమతించింది. 

Updated Date - 2020-06-05T09:35:49+05:30 IST