విద్యార్థులు ప్రైవేటు బాట! విలీనంతో బెడిసికొట్టిన వ్యూహం!

ABN , First Publish Date - 2022-09-22T20:30:23+05:30 IST

పాఠశాలల విలీనం విషయంలో ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టిందా? నూతన విద్యా విధానం అమలులో విద్యా శాఖ అనుకున్నది ఒకటి అయితే... జరిగింది మరొకటా? ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయొద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై

విద్యార్థులు ప్రైవేటు బాట! విలీనంతో బెడిసికొట్టిన వ్యూహం!

ప్రభుత్వ ‘విలీన’ నిర్ణయంతో తల్లిదండ్రులు నిరసన 

వేలాది మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చేరిక 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు

విద్యాశాఖ పరిధిలో మొత్తం 1,924 స్కూళ్లు

గత విద్యా సంవత్సరంలో 1,62,213 మంది విద్యార్థులు

ఈ ఏడాది 1,34,792 మంది మాత్రమే!

17 శాతం మేర తగ్గుదల


పాఠశాలల విలీనం విషయంలో ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టిందా? నూతన విద్యా విధానం అమలులో  విద్యా శాఖ అనుకున్నది ఒకటి అయితే... జరిగింది మరొకటా? ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయొద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహించారా? ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది తగ్గిపోయిన విద్యార్థుల గణాంకాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1,62,213 మంది చదువుకోగా, ప్రస్తుత విద్యా సంవత్సరం(2022-23)లో 1,34,792 మంది మాత్రమే వున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరికలు తగ్గడం, మిగిలిన తరగతుల్లో కొంతమంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరడం వల్ల గత ఏడాదితో పోలిస్తే 27,421 మంది (17 శాతం) విద్యార్థులు తగ్గారు.


ఇదో ఉదాహరణ...

బుచ్చెయ్యపేట మండలం మంగళాపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో  ఒకటి నుంచి నుంచి ఏడో తరగతి వరకు 87 మంది విద్యార్థులు వుండేవారు. ఈ ఏడాది ఆరు, ఏడు తరగతులను విజయరామరాజుపేట ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.  మొత్తం 59 మంది విద్యార్థులకుగాను 17 మంది మాత్రమే ఉన్నత పాఠశాలలో చేరారు. మిగిలిన వారు చోడవరం, వడ్డాదిల్లోని ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 28 మంది మాత్రమే మిగిలారు. 




(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు చేపడుతుంటే, మరోవైపు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలబాట పడుతున్నారు.. రోజుకో కొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నండడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు, తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో విద్యాశాఖ పరిధిలో 1,924 పాఠశాలలు వున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1,152, ప్రాథమికోన్నత పాఠశాలలు 341, ఉన్నత పాఠశాలలు 431 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం(2021-22)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 1,62,213 మంది విద్యార్థులు చదువుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2022-23)లో ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 1,34,792కు తగ్గింది. అంటే గత విద్యా సంవత్సరం కంటే 27,421 మంది తక్కువ వున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరినట్టు తెలిసింది. అయితే విద్యా శాఖ అధికారులు దీనిపై ఏకీభవించడంలేదు. పాఠశాలల్లో అడ్మిషన్‌లు ఇంకా జరుగుతున్నాయని, మండల విద్యా శాఖ అధికారుల నుంచి సమగ్ర నివేదికలు అందలేదని చెబుతున్నారు. 


విలీన నిర్ణయమే కారణమా?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానమే ప్రధాన కారణమని తెలిసింది. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి పాఠశాలల విలీనం జోలికి వెళ్లని ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరంలో విలీన ప్రక్రియ చేపట్టింది. తొలుత హైస్కూళ్లకు ఒక కిలోమీటరు పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను, మూడు కిలోమీటర్ల పరిధిలో వున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుని, అమలు చేసిన విషయం తెలిసిందే. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు మండలాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్ని పాఠశాలల్లో విలీన ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. పాఠశాలలను విలీనం చేయొద్దని తాము విజ్ఞప్తి చేసినా, ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పలువురు తల్లిదండ్రులు  అసంతృప్తి వ్యక్తం చేసి, తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. కరోనా ప్రభావంతో చాలాచోట్ల ప్రైవేటు  పాఠశాలలు మూతపడడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది కరోనా దాదాపు తగ్గుముఖం పట్టడం, ప్రైవేటు పాఠశాలలకు తెరుచుకోవడంతో మళ్లీ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. ఈ రెండు కారణాల వల్ల గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 27,421 తగ్గింది.



Updated Date - 2022-09-22T20:30:23+05:30 IST