కట్టుదిట్టమైన చట్టాలు, నీరుగార్చే తీర్పులు

ABN , First Publish Date - 2021-02-24T05:54:23+05:30 IST

భారత స్త్రీకి నిత్యజీవితంలో ఎంతటి వివక్ష ఎదురవుతున్నా, చట్టపరంగా మాత్రం రక్షణలు బలంగానే ఉన్నాయి. సమానతల విషయంలో...

కట్టుదిట్టమైన చట్టాలు, నీరుగార్చే తీర్పులు

భారత స్త్రీకి నిత్యజీవితంలో ఎంతటి వివక్ష ఎదురవుతున్నా, చట్టపరంగా మాత్రం రక్షణలు బలంగానే ఉన్నాయి. సమానతల విషయంలో సానుకూల చట్టాలు, కుటుంబహింసల నుంచి అనేక రక్షణలు ఉన్నాయి. అవకాశాలపరంగానూ రోజురోజుకూ అనుకూలత పెరుగుతున్నది. స్త్రీ గౌరవానికి భంగం కలిగించకుండా 160సంవత్సరాల నాడే భారతీయ శిక్షాస్మృతిలో అనేక సెక్షన్లను పొందుపరిచారు. అందులో ప్రధానమైనది సెక్షన్‌ 354. స్త్రీ గౌరవానికి భంగం కలిగించినవారికి రెండు సంవత్సరాల జైలుశిక్షగాని, జరిమానాగాని ఈ సెక్షన్‌ కింద శిక్షగా విధించవచ్చు. ఆ తర్వాత 2013లో ఈ శిక్షను ఐదేళ్లకి పెంచడమేగాక కచ్చితంగా జైలు, జరిమానా రెండూ విధించాలని సవరించారు. ఈ సెక్షన్‌ ద్వారా పసిపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకూ ఎవరైనా రక్షణ పొందవచ్చు.


ప్రపంచవ్యాప్తంగా పిల్లల పైనా, మైనర్‌ బాలికల పైన లైంగిక హింసలు పెరిగిపోవడంతో 1992లో ఐక్యరాజ్యసమితి దీనిపై ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. దీనిని అంగీకరించిన భారత ప్రభుత్వం లైంగిక వేధింపుల నుంచి పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో ‘పోక్సో’ చట్టాన్ని 2012 నుంచి  అమలులోకి వచ్చేట్లుగా ఆమోదించింది. భారతదేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదనపు సెషన్స్‌ కోర్టులు ఉన్నందున అందులో ఒక అదనపు జిల్లా కోర్టును ఈ కేసులు విచారించడానికి కేటాయించడమే గాక ఈకాలంలో ఈ కేసుల కోసం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని కూడా నియమించారు. ఈ కొత్త చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఎవరైనా వ్యక్తి కామపరమైన కోరికతో పిల్లల మర్మావయవాల్నిగానీ, వక్షభాగాన్ని గానీ, పృష్ట భాగాన్ని గానీ తాకితే వారు మూడేళ్ళకు తగ్గకుండా శిక్షించబడతారు. ఈ విధంగా శాసన నిర్మాణ వ్యవస్థ స్త్రీల పట్ల, బాలల పట్ల జరిగే లైంగిక వేధింపుల కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, మరోప్రక్క వీటిని నీరుగార్చే ప్రయత్నమూ జరుగుతుంది. న్యాయవ్యవస్థలో భాగమైన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తే ఇలాంటి చర్యకు పాల్పడటం విచారకరం కాగా, ఆ న్యాయమూర్తి స్త్రీ కావడం మరో విషాదం. 


మహారాష్ట్రలోని నాగపూర్‌లో 39ఏళ్ళ పురుషుడు ఒక 12సంవత్సరాల మైనర్‌ బాలికను తినడానికి ఏదో పెడతానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి ఆ బాలిక వక్షోజాల్ని తాకరాని విధంగా తాకడమే గాక ఆ పాప వేసుకున్న దుస్తుల్ని తొలగించే ప్రయత్నం చేయగా ఆ పాప భయంతో కేకలు వేసింది. ఆ పాప తల్లిదండ్రులతో పాటు సమీపంలోని జనం పాపను కాపాడారు. ఈ కేసుని విచారించిన కోర్టు నిందితునికి మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ఇది కనీస శిక్ష. ఇంతకంటే తక్కువ శిక్ష విధించే అవకాశం లేదు.


ఈ కేసుపై నిందితుడు అప్పీలు చేసుకోగా బొంబాయి హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ న్యాయమూర్తి పుష్ప గండేవాలా జనవరి 19న నిందితునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. నిందితుడు బాలిక దుస్తుల్ని తొలగించడంగాని, దుస్తులలోకి చేయి జొనపడంగాని చేయలేదని, "చర్మానికి చర్మం ఆనించలేద"ని కనుక పోక్సో చట్టం వర్తించదని తీర్పు చెప్పారు. న్యాయమూర్తి పుష్ప వ్యాఖ్యలకు ఈ చట్టంలో పేర్కొన్న అంశాలకు, కూర్చిన పదబంధాలకు, నిర్వచనాలకు ఎక్కడా పొంతనే లేదు. చర్మానికి చర్మం అనే పదమే సెక్షన్‌ 7లో ఎక్కడా లేదు. 


ఈ తీర్పు న్యాయ వ్యవస్థ డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. మన దేశంలో న్యాయ నిర్ధారణ ఎంత అశాస్త్రీయంగా ఉంటుందో, చట్టాలు ఎంత కట్టుదిట్టంగా ఉన్నా న్యాయమూర్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వాటి అమలును పూర్తిగా వదిలివేయడం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో జస్టిస్ పుష్ప తీర్పు ఉదంతం ద్వారా అర్థమవుతోంది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల్లో సగంమంది అవినీతిపరులున్నారని ప్రశాంత భూషణ్‌ లాంటి న్యాయనిపుణులు బహిరంగంగా ఆరోపించారంటే న్యాయ నిర్ధారణలో వ్యక్తిగత అభిప్రాయాలకున్న ప్రాధాన్యతే కారణం. జిల్లా కోర్టులు ఇంకా కింద కోర్టుల్లో కూడా న్యాయమూర్తులుగా ఉన్నవారిలో "మేము ఈ సెక్షన్‌ని గుర్తించం, దీని ప్రకారం ఆదేశాలు ఇవ్వం" అనే ధోరణి చాలా రోజులుగా న్యాయపాలనలో ఉంది.


ఈ తీర్పుపై వివాదం చెలరేగడంతో ఇదే న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పడానికి నాలుగు రోజుల క్రితం చెప్పిన మరో వికృతమైన తీర్పు కూడా వెలుగుచూసింది. 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి 5 సంవత్సరాల వయసున్న బాలిక ముందు ఫ్యాంటు జిప్పు తీసి ఆ పాప చెయ్యిపట్టుకున్నాడు. ఆ కేసును విచారించిన కింది కోర్టు అతనికి ఐదేళ్ల కారాగారశిక్షతో పాటు 25వేల జరిమానా కూడా విధించింది. దానిపై అతను చేసుకున్న అప్పీలులో చేయి పట్టుకోవడం, జిప్పు విప్పటం లైంగిక దాడి కాదంటూ జనవరి 15న ఈ న్యాయమూర్తి పుష్ప తీర్పు చెప్పారు.


ఈ సందర్భంగా గతంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పంజాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కెపియస్‌ గిల్‌ కేసును ఒకసారి పాఠకులకు గుర్తుచేయాలి. 1988లో సహచర ఐపిఎస్‌ అధికారి ఎస్‌ఎల్‌ కపూర్‌ ఇచ్చిన విందు సమావేశానికి 20-25 మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల జంటలు హాజరయ్యాయి. ఒంటరిగా వచ్చింది డిజిపి గిల్‌ ఒక్కరే. అదే విందుకు హాజరైన ఐఎఎస్‌ అధికారిణి శ్రీమతి రూపన్‌ డియోల్‌ బజాజ్‌ జఘన భాగంలో తట్టి అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఐపిసిలోని 354 సెక్షన్‌ కింద కేసు పెట్టింది. ఇంకా కొన్ని ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో తమ పోలీస్‌ బాస్‌ పైన కేసు పెట్టకుండా క్లోజ్‌ చేశారు. దీనిపై ఆమె భర్త, మరో ఐఎఎస్‌ అధికారి అయిన బిఆర్‌ బజాజ్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్ దగ్గర ఫిర్యాదు చేశారు. అదీ హైకోర్టులో క్వాష్‌ చేయబడింది. సుప్రీంకోర్టు కేసును పునరుద్ధరించి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ని విచారించమనగా ఆ కోర్టు విచారించి డిజిపికి మూడు నెలల కారాగారశిక్ష విధించింది. చివరకు సుప్రీంకోర్టు ఎంకె ముఖర్జీ బెంచి ఈ శిక్షను ప్రొబేషన్‌ కిందకు మార్చి 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది (1996 ఎఐఆర్‌ 309). ఇంత స్పష్టంగా అనేక వందల కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం, మరెన్నో హైకోర్టులు తీర్పులు చెప్పినా శ్రీమతి పుష్ప ఈ రకమైన వికారపు తీర్పులు చెప్పడం బాధ్యతారహితం.


హైకోర్టు జడ్జిగా 2018లో ఒకసారి ఈమె పేరు ప్రతిపాదన వచ్చినా ఈమెపై ఆరోపణలు ఉండడంతో పదోన్నతి ఇవ్వకుండా పక్కన పెట్టిన కొలిజియం 2019లో మళ్ళీ ఈమె పేరు పరిగణనలోకి తీసుకొని నియమించడాన్ని చూస్తే, న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సర్వజనామోదమైన పద్ధతినొకదాన్ని కనుగొనాలనే వాదన మరోసారి ముందుకు వస్తుంది. ఒకవైపు కట్టుదిట్టమైన చట్టాలు, మరోవైపు నీరుగార్చే తీర్పులు. అయితే అటార్ని జనరల్‌ కె.వేణుగోపాల్‌ జస్టిస్‌ పుష్ప తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. బాబ్డే ఈ తీర్పుపై స్టే విధించారు. పోక్సో చట్టం స్ఫూర్తిని ఆమె తీర్పు నీరుగార్చిందని ఈ సందర్భంగా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతానికి జస్టిస్‌ పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏదేమైనా ఈ ఉదంతం మన న్యాయవ్యవస్థలోని తీవ్రమైన లొసుగుల్ని ఎత్తి చూపింది. సాధారణంగా కేసుల విచారణ సందర్భంలో పెద్ద కోర్టుల ఇచ్చిన తీర్పులు ఉదహరించడం ద్వారా విచారణ సమయంలోనే దానిని అనుసరించి నేర నిరూపణ ప్రక్రియ జరుగుతుంది. జస్టిస్‌ పుష్ప తీర్పుని తర్వాతి కేసుల్లో ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో ఎక్కడైనా స్త్రీలు ఇల్లు వదిలి బయటకు రాగలరా? 

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - 2021-02-24T05:54:23+05:30 IST