బస్తీ వెలివేసినా...

ABN , First Publish Date - 2020-07-16T05:30:00+05:30 IST

కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు.. రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అయితే వీరు నివాసం ఉండే అపార్ట్‌మెంట్లలోకి కొందరు రానివ్వడం లేదు...

బస్తీ వెలివేసినా...

కరోనా అనుభవం

కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు.. రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అయితే వీరు నివాసం ఉండే అపార్ట్‌మెంట్లలోకి కొందరు రానివ్వడం లేదు. కొన్ని చోట్ల ఇళ్లు ఖాళీ చేయించిన ఘటనలున్నాయి.  హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌ టెక్నిషియన్‌ 23ఏళ్ల శ్రీలత (పేరు మార్చాం) కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానికులు ఆమెను ఇల్లు ఖాళీ చేయాలని వేధించారు. అయితే ఇంటి యజమానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడిన ఆమె అనుభవం ఇది... 


‘‘మాది మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఓ కుగ్రామం. మా అమ్మ, నాన్నకు నేనొక్కదాన్నే. 20ఏళ్ల క్రితం ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసమని హైదరాబాద్‌కు వచ్చాం. ఇక్కడే మా నాన్న కూలీ పనులకు వెళ్లగా, అమ్మ ఇళ్లలో పనులు చేసేది. అనుకోని ప్రమాదంలో నాన్న మాకు దూరమయ్యాడు. అప్పటి నుంచి అన్నీ అమ్మనే చూసుకుంటూ నన్ను చదివించింది. ఇళ్లలో పని చేస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అద్దె ఇంట్లో జీవనం సాగించాం. సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం బేగంపేటలోని ఎన్‌బీటీ నగర్‌లో గల పాటిగడ్డలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాం. రెండు గదులు మాత్రమే ఉండే ఆ ఇంట్లో ఒక గదిలో అమ్మతో కలిసి నేను ఉంటుండగా, మరో గదిలో మా ఇంటి యజమాని చెన్నూరు సుధాకర్‌- మమత దంపతులు వారి పిల్లలతో ఉంటున్నారు. నేను మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్‌ ల్యాబ్‌లో టెక్నిషియన్‌గా పని చేస్తున్నా. కరోనా కేసులు పెరుగుతున్నా.. మరో వైపు లాక్‌డౌన్‌ విధించి ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నా కానీ ల్యాబ్‌కు వెళ్ళి పరీక్షలు చేశాను. రెక్కాడితే కాని డొక్కా ఆడని పరిస్థితి మాది. 


జూన్‌ 26 మరిచిపోలేని రోజు..

ఒకరోజు మాతో పాటు పని చేసే ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. దీంతో ల్యాబ్‌లో పని చేసేవారందరికీ కరోనా పరీక్షలు జూన్‌ 25న జరిపారు. మరుసటి రోజు (జూన్‌ 26న) రిపోర్టులు వచ్చాయి. ల్యాబ్‌లో పని చేసే పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అద్దె ఇంట్లో ఉన్న నాకు మా ల్యాబ్‌ నుంచి ఫోన్‌ చేసి నాక్కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారమిచ్చారు. దాంతో ఒక్కసారిగా ఏమీ తోచలేదు. ఇంటి యజమాని, బస్తీవాసుల గురించే ఆందోళన.. ఈ పరిస్థితుల్లో బయటకు గెంటేస్తే పరిస్థితేందని భయపడ్డాను. ఈ మహానగరంలో ఎక్కడకు వెళ్ళి ఉండాలని దిగాలు చెందాను. వెంటనే మా అమ్మను సమీపంలో బంధువుల ఇంటికి పంపాను. నేను మా ఇంటి యజమాని సుధాకర్‌ అన్నకు ఫోన్‌ చేశాను. అతను ఎన్‌టీఆర్‌ గార్డెన్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తాడు. విషయం చెప్పగానే ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యాన్ని చెప్పాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. అన్నవాళ్ల భార్య మమతకు విషయం చెప్పగా కొంత కంగారుపడింది. నిత్యం వారి పిల్లలు నా వద్దే ఉండేవారు. కలిసి తినేవాళ్లం. అన్ననే వాళ్ల భార్యకు అన్నీ సర్థిచెప్పి భయపడాల్సిన పని లేదని దైర్యం చెప్పాడు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకున్నాడు. నాకు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు.


బస్తీవాసుల అడ్డగింపులు...

ఇంట్లోనే హోం క్వారంటైన్‌ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా. అప్పటికే స్థానిక పీహెచ్‌సీ నుంచి వైద్యులు ఇంటికి వచ్చిపోతున్నారు. నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి వెళ్ళి మా అమ్మతో పాటు సుధాకర్‌ అన్న, వారి భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పరీక్షలు చేసుకున్నారు. వారికి నెగటివ్‌గా నిర్థారణయ్యింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. అయితే అప్పటికే నాకు కరోనా పాజిటివ్‌గా తేలడం, ప్రైమరీ కాంటాక్ట్‌గా మా అమ్మ, సుధాకర్‌ అన్నవాళ్లు కరోనా పరీక్షలు చేసుకున్నారనే విషయం బస్తీ మొత్తం దావానంలా వ్యాపించింది. బస్తీవాళ్లు నన్ను అద్దె ఇంటిని ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. బాత్రూమ్‌ ఇంటి బయట ఉండడంతో అందులోకి వచ్చి వెళ్లాలంటే కూడా బస్తీవాసుల నుంచి చివాట్లు తినాల్సి వచ్చేది. చీకటిపడిన తర్వాతే బాత్రూమ్‌కు వెళ్లేదాన్ని. అయితే మా ఇంటి యజమాని మాత్రం సొంత అన్నలా నా వెంట నిలిచారు. రెగ్యులర్‌గా ఫోను ద్వారా వైద్యులు ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఈ నెల 10న మరోసారి కరోనా పరీక్షలు చేశారు. నెగటివ్‌గా వచ్చింది. దాంతో యథావిధిగా ల్యాబ్‌ టెక్నిషియన్‌గా విధులకు వెళ్తున్నాను. ధైర్యంగా ఉండడం వల్లే త్వరగా కోలుకున్నాను. కరోనా వస్తే ఆందోళన చెందాల్సిన పని లేదు. చుట్టుపక్కల వారు పరిస్థితిని అర్థం చేసుకుని, ఆదరాభిమానాలు చూపితే నయమవుతుంది.’’

- బయ్య దామోదర్‌, సిటీ బ్యూరో, హైదరాబాద్‌



సాటి మనిషిగా గుర్తించాలి!
శ్రీలత విషయం తెలిసిన తర్వాత మా బస్తీవాసుల నుంచి నాకు ఒకటే ఫోన్లు.. ఆ యువతిని ఇల్లు ఖాళీ చేయించాలన్నారు. ఈ సమయంలో తగదు అంటే.. మమ్మల్ని కూడా ఖాళీ చేయాలని బెదిరించారు. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే నన్నే ఛీ కొట్టారు. మా పిల్లలు ఆడుకోడానికి బయటకు వెళ్తే వారిని అంటరానివారిగా చూశారు. నాతో, నా భార్యతో నిన్న మొన్నటి వరకు మాట్లాడిన బస్తీవాసులంతా మోహం చాటేశారు. అయినా నా భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉన్న యువతికి నీళ్ల నుంచి నిత్యావసరాల వరకు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేది. ఈ క్రమంలో బస్తీవాసులు వాహనాలను అడ్డుగా పెట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. నిత్యం గొడవకు దిగేవారు. ఈ నెల 10న కరోనా పరీక్ష మరోసారి జరిపేంత వరకు శ్రీలతకు అండగా నిలిచాము. ఆమెకు నెగటివ్‌ రావడంతో సంతోషమనిపించింది. కరోనా వచ్చినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్న ఆ యువతికి అండగా ఉండాల్సింది పోయి చీదరిస్తే ఎలా? మన ఇంట్లోనే ఎవరికైనా కరోనా వస్తే ఆ విధంగానే ప్రవర్తిస్తామా..?
- సుధాకర్, ఇంటి యజమాని

Updated Date - 2020-07-16T05:30:00+05:30 IST