‘‘సాహిత్యంలో స్థానికత ప్రాధాన్యం గుర్తించి రాసిన కథలివి’’

ABN , First Publish Date - 2020-08-31T06:40:31+05:30 IST

‘యానాం చరిత్ర’ పుస్తకం రాసాక నా దృష్టి కథల మీద పడింది. చరిత్ర ఘటనలు ఆధారంగా కథలు రాయాలనిపించింది. వీటిలో ‘‘ఒప్సియం’’, ‘‘లా‘మూర్‌’’, ‘‘తీర్పు వెనుక’’, ‘‘ఔను నిజం’’, ‘‘కొత్త నది’’, ‘‘మన్యం వోరి మేడ’’...

‘‘సాహిత్యంలో స్థానికత ప్రాధాన్యం  గుర్తించి రాసిన కథలివి’’

పలకరింపు : దాట్ల దేవదానం రాజు


యానాం నగరం ఇతివృత్తంగా ‘యానాం కథలు’ ఎందుకు రాయాలనిపించింది?

‘యానాం చరిత్ర’ పుస్తకం రాసాక నా దృష్టి కథల మీద పడింది. చరిత్ర ఘటనలు ఆధారంగా కథలు రాయాలనిపించింది. వీటిలో ‘‘ఒప్సియం’’, ‘‘లా‘మూర్‌’’, ‘‘తీర్పు వెనుక’’, ‘‘ఔను నిజం’’, ‘‘కొత్త నది’’, ‘‘మన్యం వోరి మేడ’’ వంటి కథలకు చరిత్రే ఆధారం. భౌగోళి కంగా యానాం తెలుగు ప్రాంతం మధ్య ఉన్నప్పటికీ అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. పరిపాలనా పరంగా తమిళ ప్రాబల్యంగల ప్రాంతం ఇది. ఎక్కడో దూరంగా ఉన్న పుదుచ్చేరి... వినూత్న సంక్షేమ పథకాల అమలు... రాయితీలు... ఉన్నత సాంకేతిక విద్య అందుబాటులో ఉండటం... జీవన వాస్తవికత... ఇలా తెలుగు పాఠక లోకానికి ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ట్టుగా ఉంటుందన్న తలంపుతో ఈ కథలు రాసాను. యానాంలోని ఒకనాటి సామాజిక జీవితాన్ని, జీవనో త్సాహాన్ని, సంఘర్షణని ఈ కథల ద్వారా చెప్పాలనుకు న్నాను. సాహిత్యంలో స్థానికత ప్రాధాన్యం గుర్తించి రాసిన కథలివి. నిర్దిష్ట స్థల కాలాదుల్ని కేంద్రంగా చేసుకుని వచ్చిన కథానికల సమాహారం ‘యానాం కథలు’. యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో, చరిత్రతో ముడివడిన ప్రజల జీవన పోరాటాల్నీ భావో ద్వేగాల్నీ చిత్రించడానికి ప్రయత్నించాను. స్థానిక కథలు సామాజిక చరిత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తాయని బలంగా నమ్మాను. మరొక విషయం కూడా చెప్పాలి. ఇంత వరకు ఆంగ్లేయులకు భారతీయులకు నడుమ సంబంధ బాంధవ్యాల గురించి తెలుగులో కథలు న్నాయి. కాని ఫ్రెంచి ఏలుబడిలో ఉన్న భారతీయు లకు ఫ్రెంచి వారికి మధ్య ఉన్న సంబంధాల గురించి ఎవరూ రాయలేదని ప్రసిద్ధ సాహితీవేత్తలు చెప్పడం జరిగింది. అదొక గుర్తింపుగా భావిస్తాను. ఫ్రెంచి రచయిత డానియల్‌ నెజర్స్‌ వీటిని ఫ్రెంచి భాషలోకి అనువదించారు. ఆయన అనువాదం చేసిన ఒక కథని (‘‘రథం కదలాలి’’) ఫ్రెంచి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే వివిధ భాషల కథాసంకలనంలో ప్రచురణకు స్వీకరించారు. 


‘కథల గోదారి’ కథలు ఒక ప్రయోగంగా తలచి రాసారా? 

మానవతా విలువలు పెంచి పోషించే కథలంటే ఇష్టం. ఒక జీవిత సత్యాన్ని, ఒక నైతిక సంఘర్షణని ఆవిష్క రించినపుడే కథాప్రయోజనం నెరవేరుతుందని అను కుంటాను. వేమూరి సత్యనారాయణ ‘ఆనాటి వాన చినుకులు’ శీర్షిక ఇచ్చి కథ రాయమన్నారు. రెండు రోజుల్లో రాసి పంపాను. ఇదే ప్రేరణతో ప్రముఖ రచ యితల్ని ‘గోదారి’ పదంతో ముడిపెట్టి కథాశీర్షిక అందిస్తే కథ రాస్తానని చెప్పాను. కుతుహలంతోనూ అభిమానం తోనూ ఇచ్చారు. శీర్షిక ఆధారంగా ఇతివృత్తం అల్లుకుని కథలు రాయడం మొదలెట్టాను. ఇది ప్రయోగం అని తలచలేదు. వ్యక్తిగతంగా అనుకోని కథలు ఊహించు కోడానికి రాయడానికి ఇది ఉపయోగపడింది. ఇందులో చాలా కథలు వాస్తవ సంఘటనలకు కథారూపాలే. శ్రీకాంతశర్మ ‘జీవధార’, శ్రీరమణ ‘కథల గోదారికి గొజ్జింగి పూదండ’గా విలువైన ముందుమాటలు రాయడం నాకెంతో ఆనందం కలిగించిన విషయం. ‘కథల గోదారి’ కథాసంపుటి నాకు గోదారి రచయితగా పేరు తెచ్చి పెట్టింది. యానాంను గోదారి ఒరుసుకుని ప్రహిస్తుండటం వల్ల నిత్యమూ గోదారిగాలి పీలుస్తూ గోదారి నీరు తాగడం వల్ల ఈ కథలు రాయగలిగానని అనుకుంటాను. 

94401 05987 

Updated Date - 2020-08-31T06:40:31+05:30 IST