అలా ఉండటం అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-06-10T05:30:00+05:30 IST

కొవిడ్‌ను తరిమికొట్టాలంటే తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటే చాలా? భౌతికదూరం పాటిస్తే సరిపోతుందా? మరి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే ఉమ్మి వేయడం మాటేమిటి? దాని గురించి

అలా ఉండటం అందరి బాధ్యత

కొవిడ్‌ను తరిమికొట్టాలంటే తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటే చాలా? భౌతికదూరం పాటిస్తే సరిపోతుందా? మరి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే ఉమ్మి వేయడం మాటేమిటి? దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు ... ఎందుకు? ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘స్టాప్‌ ఇండియా స్పిట్టింగ్‌’ క్యాంపెయిన్‌ అంటున్నారు బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల ఓడెట్‌ కాట్రాక్‌. ఆ విశేషాలు ఇవి...


‘‘కొవిడ్‌ వ్యాప్తి, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడానికి ఉన్న సంబంధం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేను కూడా అలా ఉండిపోకూడదు అనుకున్నా. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ‘స్టాప్‌ ఇండియా స్పిట్టింగ్‌’ క్యాంపెయిన్‌ మొదలుపెట్టా’’ అని అంటారు ఓడెట్‌. ఈమె ‘బ్యూటిఫుల్‌ భారత్‌’ సహవ్యవస్థాపకురాలు కూడా. చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడం వంటి అంశాలపై బ్యూటిఫుల్‌ భారత్‌ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ బెంగళూరులో ఏటా జరిగే లాల్‌బాగ్‌ ఫ్లవర్‌షోను జీరోలిట్టర్‌ ఈవెంట్‌గా నిర్వహించి ప్రశంసలు అందుకుంది. ‘‘మేం 2015లో బ్యూటిఫుల్‌ భారత్‌ ప్రారంభించాం. మొదట లాల్‌బాగ్‌ ఫ్లవర్‌ షోలో వెలువడే వ్యర్థాలపై దృష్టి పెట్టాం. ఈ ఫ్లవర్‌ షోలో 5 నుంచి 8 లక్షల మంది పాల్గొన్నారు. ఎన్ని డస్ట్‌బిన్‌లు పెట్టినా ప్లాస్టిక్‌ కుప్పలుగా పేరుకుపోయింది. తరువాత మేం అధికారులతో మాట్లాడాం. ప్రజల ఆలోచన తీరులో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాం. గత ఆరేళ్లుగా ఫ్లవర్‌ షోను జీరో లిట్టర్‌ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నాం’’ అని తన అనుభవాలను పంచుకుంటారు ఓడెట్‌.


కొవిడ్‌ మొదలయ్యాక....

బ్యూటిఫుల్‌ భారత్‌ క్యాంపెయిన్‌ అనుభవంతో ‘స్టాప్‌ ఇండియా స్పిట్టింగ్‌’ మిషన్‌ను ప్రారంభించారు ఓడెట్‌. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని శిక్షార్హమైన నేరంగా గుర్తించాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ పిటిషన్‌పై కొన్ని వారాల్లోనే 40 వేల సంతకాలను సేకరించారు. ‘‘ఈ సమస్యను అందరూ గుర్తించాలి. ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు. జాతీయ ప్రాఽధాన్యతా అంశంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి’’ అని అంటారు ఓడెట్‌. ఏప్రిల్‌ 15న ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్‌ గైడ్‌లైన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు అన్న నిబంధన చేర్చలేదు. ఆ తరువాత ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని ఆ అంశంపై మాట్లాడారు. ఇప్పుడు బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. ‘‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తూ, మాస్క్‌ ధరించిన మాత్రాన ప్రయోజనం లేదు. వ్యాధి విస్తరించడానికి ఉమ్మివేయడం కారణమవుతుంది. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడం కోసం కృషి చేస్తూ వచ్చాం’’ అని తన ప్రయాణాన్ని పంచుకుంటారు ఓడెట్‌.




ఇదొక అవకాశం!

క్యాంపెయిన్‌లో భాగంగా గత ఏడాది జూలైలో ఒక సర్వే నిర్వహించారామె. రోడ్డుపై ఉమ్మి వేస్తున్న వారిని చూస్తే మీరు ఏం చేస్తారు? అని సర్వేలో భాగంగా ప్రజలను ప్రశ్నించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎనిమిది భాషల్లో యానిమేటెడ్‌ వీడియోలు రూపొందించారు. కన్నడ భాషలో ర్యాప్‌ వీడియోను రూపొందించి విడుదల చేశారు.  స్టాప్‌ ఇండియా స్పిట్టింగ్‌ కార్యక్రమం కోసం ఓడెట్‌తో కలిసి పనిచేయడానికి అనేక సంస్థలు ముందుకొచ్చాయి. రోటరీ, నమ్మ బెంగళూరు ఫౌండేషన్‌, బెంగళూరు అపార్ట్‌మెంట్‌ ఫౌండేషన్‌, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవేర్‌నెస్‌ డ్రైవ్‌లు నిర్వహించారు ఓడెట్‌.


ప్రముఖ కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌, డా. దేవి శెట్టి, పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌లను ఈ ప్రచారంలో భాగస్వాములను చేశారు. ‘‘ఉమ్మివేయడం ఎప్పుడూ మంచిది కాదు. దాని గురించి మాట్లాడటానికి ఈ మహమ్మారి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఉమ్మి ద్వారా టీబీ లాంటి జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. అందరూ తమ వంతు బాధ్యతగా భావిస్తే ఒక పెద్ద మార్పును చూడొచ్చు’’ అని అంటారామె. 

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST