తొలి డోసు ఆపేయండి

ABN , First Publish Date - 2021-07-25T08:34:39+05:30 IST

రాష్ట్రంలో టీకా రెండో డోసు తీసుకోవాల్సిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఒక్క జూలైలోనే 30 లక్షలమంది వరకూ రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. దాంతో, ప్రజలకు మళ్లీ టీకా కష్టాలు మొదలయ్యాయి...

తొలి డోసు ఆపేయండి

  • కొవాగ్జిన్‌ కేవలం రెండో డోసుకే
  • సరిహద్దు జిల్లాల్లో మాత్రం రెండూ
  • వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీకా రెండో డోసు తీసుకోవాల్సిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఒక్క జూలైలోనే 30 లక్షలమంది వరకూ రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. దాంతో, ప్రజలకు మళ్లీ టీకా కష్టాలు మొదలయ్యాయి. కొరత కారణంగా తొలి డోసును నిలిపివేయాలని ప్రభుత్వం తాజాగా మరోసారి నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం రెండు డోసులూ ఇవ్వాలని సూచించింది. ఇక, కొవాగ్జిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి డోసు కింద ఇవ్వరాదని స్పష్టం చేసింది. కేవలం రెండో డోసు వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి మార్గదర్శకాలను జారీ చేశారు. ‘జూలైలో తొలి డోసు బంద్‌’ అనే కథనాన్ని జూన్‌లోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. నిజానికి, టీకాలకు కొరత కారణంగా ఒక దశలో మొదటి డోసును పూర్తిగా నిలిపివేసి రెండో డోసు మాత్రమే ఇవ్వాలని వైద్య శాఖ భావించింది. కానీ, టీకాలు కొంతమేరకు అందుబాటులో ఉండటంతో తొలి డోసును కూడా ఇస్తూ వస్తున్నారు.  శుక్రవారం కేవలం 13,264 మందికే మొదటి డోసు ఇవ్వగా, రెండో డోసు మాత్రం 1.30 లక్షల మందికి ఇచ్చారు. అయినా, కేంద్రం నుంచి వచ్చే టీకాలు సరిపోవడం లేదు. దాంతో, తొలి డోసును పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. కనీసం ఇప్పుడైనా రెండో డోసు వారందరికీ టీకా దొరుకుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇందుకు కారణం.. రోజూ ఒక్కో టీకా కేంద్రంలో కేవలం 50 టోకెన్లనే ఇస్తున్నారు. అంతకుమించి వస్తే వెనక్కు పంపుతున్నారు. దాంతో, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సరిహద్దు జిల్లాల్లో తొలి డోసు కూడా

కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గడం లేదు. ప్రధానంగా సరిహద్దు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజూ వందకు తగ్గడం లేదు. ఆయా ప్రాంతాల్లో రెండు డోసులూ ఇవ్వాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గద్వాల, ఖమ్మం, కొత్తగూడేం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, నారాయణ్‌పేట్‌, నల్లగొండ, సూర్యాపేట్‌ జిల్లాల్లో రెండో డోసు ఇస్తూ, తొలి డోసునూ కొనసాగించాలని ఆదేశించింది.


హుజూరాబాద్‌పై ప్రత్యేక దృష్టి

హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి. పాదయాత్రలు, ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నాయి. జనం సమూహాలుగా తిరుగుతున్నారు. దాంతో, ఆ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్దఎత్తున పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. దీంతో, హుజూరాబాద్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గమంతా రెండు డోసులూ ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాల్లో హుజూరాబాద్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని స్థానిక వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, ఒకవేళ పాటించని నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ మార్గదర్శకాల్లో డీహెచ్‌ హెచ్చరించారు.


Updated Date - 2021-07-25T08:34:39+05:30 IST