‘ఉద్దీపన’ అంతంత మాత్రమే... ఆర్ధికరంగ నిపుణులు

ABN , First Publish Date - 2020-10-22T23:49:47+05:30 IST

కరోనా వైరస్ నేపధ్యంలో... నిస్తేజంగా ఉన్న కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకుగాను... డిమాండ్‌ను భారీగా పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం అంతంతమాత్రమేనని రూటర్స్ పోల్‍‌లో పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

‘ఉద్దీపన’ అంతంత మాత్రమే... ఆర్ధికరంగ నిపుణులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపధ్యంలో... నిస్తేజంగా ఉన్న కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకుగాను... డిమాండ్‌ను భారీగా పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం అంతంతమాత్రమేనని రూటర్స్ పోల్‍‌లో పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.


దేశంలో కరోనా కేసులు 77 లక్షలు దాటిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన దేశం భారతే. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 80 రోజులకు పైగా సుదీర్ఘ లాక్‌డౌన్ విధించిని విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది. ఆర్థిక పునరుజ్జీవానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ... ఎన్నో చర్యలు ప్రకటించాయి.


పెదవి విరిచిన ఆర్థికవేత్తలు... లాక్ డౌన్ సమయంలో కేంద్రం రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇటీవల 10 బిలియన్ డాలర్ల మేర డిమాండ్ పెంచే చర్యలను కూడా ప్రకటించింది. కాగా... ప్రభుత్వ ప్యాకేజీలు, చర్యలపై పలువురు ఆర్థికవేత్తలు  పెదవి విరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి నిరాశావాదంగా ఉంటుందని అక్టోబరు 13 నుండి 21 వరకు నిర్వహించిన సర్వేలో 55 మందిఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పరిస్థితి రెండు నెలల క్రితం నాటికంటే మరింత నిరాశాజనకంగా ఉందని పేర్కొనడం గమనార్హం. 


ఏమాత్రం సరిపోదు... ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వ తాజాగా ప్రకటించిన డిమాండ్ ప్యాకేజీ ఏమాత్రం సరిపోదని  మొత్తం 39మంది ఆర్థికవేత్తల్లో 34 మంది(దాదాపు 90శాతం మంది) అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయం, మూలధన వ్యయాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్యలు ఆర్థిక వివేకంతో కూడుకున్నవని, అయితే... ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధికి ఊతమిచ్చే చర్యలు మాత్రం అంతంతమాత్రమేనని అభిప్రాయపడ్డారు. 


కాగా... మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన జీడీపీ రెండో త్రైమాసికంలో మైనస్ 10.4 శాతం, మూడో త్రైమాసికంలో మైనస్ 5 శాతం నమోదు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.


డబుల్ మైనస్ లో 26 ఆర్థిక వ్యవస్థల జీడీపీ... ఆసియాలో మూడో అతిపెద్దదైన భారతీ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 9.8 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. మొత్తం 55 దేశాల్లోని 26 ఆర్థిక వ్యవస్థలు 10 శాతం కంటే ఎక్కువ ప్రతికూలత నమోదు చేస్తాయనే అంచనాలున్నాయి. అయితే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 9 శాతం, 5.7 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చునని అంచనా వేస్తుండడం గమనార్హం. 

Updated Date - 2020-10-22T23:49:47+05:30 IST