Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెత్తం తీసుకొని... అసెంబ్లీకి వెళ్ళాలనిపించింది!

మహిళలతో ఎలా ప్రవర్తించాలి? వారిని ఎలా గౌరవించాలి?.. ఈ విషయంలో గత తరానికి... వర్తమానానికి మధ్య తేడాలున్నాయా?.. ఉంటే ఆ తేడాలను మనం ఎలా గుర్తించాలి? అనే విషయాలపై  చర్చ జరగాల్సిన అవసరాన్ని ఇటీవల జరుగుతున్న సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.మహిళలతో మర్యాదగా ప్రవర్తించే సంస్కారాన్ని చిన్నతనం నుంచి నేర్పించడమే దీనికి పరిష్కారమంటున్నారు ప్రముఖ రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు జి. పరిమళ సోమేశ్వర్‌. ‘నవ్య’తో ఆమె పంచుకున్న అభిప్రాయాలివి...


అందరూ స్త్రీలను గౌరవించాలంటారు కానీ, ఎవరూ గౌరవించరు. ఇదివరకటి రోజుల్లో చాలామటుకు మగవాళ్లు ఇంట్లో ఎలా ఉన్నా, బయట మాత్రం మహిళలపట్ల కాస్తంత మర్యాదగానే మెలిగేవారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లను వివాదాల్లోకి లాగేస్తున్నారు. మహిళల నాయకత్వాన్ని మగవాళ్లు సహించలేరు... అది రాజకీయ రంగమైనా, ఉద్యోగంలోనైనా సరే! జయలలితకు ఒకప్పుడు జరిగిన అవమానం గుర్తుతెచ్చుకోండి. తమిళనాడు శాసనసభలో ఆమెకు జరిగిన అవమానం అత్యంత హేయమైంది. కరుణానిధి ఒక పెద్ద రచయిత. పైగా భిన్నమైన రాజకీయ దృక్కోణం కలిగిన మేధావిగా ఆయనకు పేరుంది. అలాంటి వ్యక్తి సమక్షంలోనే కదా... దారుణమైన, అమానవీయమైన దాడిని జయలలిత ఎదుర్కొన్నారు. ప్రగతిశీల దృక్పథం ఉందనుకునే మగవాళ్లు సైతం మహిళల ఆధిక్యతను సహించలేరనడానికి ఇదొక నిదర్శనం. రాజకీయాల్లో అధికారమే కావాలి కానీ సంస్కారం అక్కర్లేదు. మహిళలు ఎప్పుడూ తమకు తగ్గి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారు. రచయిత్రుల గురించి కూడా ‘‘ఆడవాళ్లు ఉబుసుపోక రాస్తున్నారు, రచనలను వండుతున్నారు’’ అంటూ హేళన చేసేవారు. తాము పెద్ద మేధోపరమైన రచనలు చేస్తున్నట్టు కొందరు మగ రచయితలు ప్రచారం చేసుకునేవారు. ఈ జాడ్యం అన్ని రంగాల్లో వేళ్లూనుకొనుంది.


అది ప్రజాప్రతినిధులకు తెలీదా...

ఇద్దరు మగవాళ్లు తలపడుతూ ‘అమ్మ, అక్క’ పదాలతో మధ్యలో ఆడవాళ్లను తీసుకురావడం మన సంస్కృతిలో భాగమైపోయింది. అలాంటి జుగుప్సాకరమైన పదజాలం లేకుండా మగవాళ్లు మాట్లాడుకోవడమే కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనను చూసి చాలా బాధపడ్డాను! ఆ వెంటనే ఒక అధ్యాపకురాలిగా బెత్తం పుచ్చుకొని అసెంబ్లీకి వెళ్లి ‘సైలెన్స్‌, సైలెన్స్‌’ అని పెద్దగా అరవాలనిపించింది. హద్దులు మీరిన వాళ్లకు నాలుగు తగిలించాలనిపించింది. చట్టాలు చేయవలసిన వ్యక్తులే చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం దారుణం. ఇదివరకు ‘అమ్మ, అక్క’ అంటూ దూషించుకునేవారు. ఇప్పుడు నేరుగా భార్యలనూ తీసుకొస్తున్నారు. అవతలివారిని ఎదుర్కోవడానికి ఇలాంటి చౌకబారు పద్ధతి సరైంది కాదు. శాసనసభతో సంబంధం లేని వ్యక్తుల గురించి, అక్కడ లేని వాళ్ల గురించి మాట్లాడటం తగదని ప్రజా ప్రతినిధులకు తెలియదా! 


ఇప్పుడే వాళ్లు అలంకారప్రాయమే...

సామాన్యులు కూడా మన నాయకుల ప్రవర్తనను గమనించాలి. మహిళలను గౌరవించడంలో ఆంధ్రా కంటే తెలంగాణ అసెంబ్లీ కాస్త నయం అనిపిస్తుంది. అక్కడ మహిళలకు పదవులు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. అంతేకానీ, మరీ అంతలా దిగజారి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, ఆడవాళ్లను అవమానించడం వంటివి ఈ ఏడేళ్లలో నేనైతే చూడలేదు. చట్టసభలో మహిళా సమస్యలు చర్చకు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా శాసనసభ్యురాళ్లు అంతా ఏకమవ్వడం గతంలో చూశాం. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేలు కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నారు. ఆయా పార్టీల మౌత్‌పీస్‌గా మారుతున్నారు. ఆ క్రమంలో తామూ స్పృహలేకుండా ప్రవర్తిస్తూ, సంస్కార రహితంగా ఇతరులను దుర్భాషలాడుతున్నారు.

చైతన్యం రావాలి...

చదువుల వల్ల సంస్కారం వస్తుందనుకుంటాం. కానీ, కొందరిలో అది కూడా కనపడదు. చట్టసభల్లోని వారంతా చాలామటుకు చదువుకున్నవారే. ‘చంపేస్తా, అణిచేస్తా, ఒరేయ్‌, సన్నాసి...’ ఇలాంటి మాటలా వారి నోటి వెంట రావాల్సింది? ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీకి పంపితే, ఇలాంటి దుర్భాషలతో కాలయాపన చేయడం ప్రజా ధనాన్ని వృథా చేయడమే కదా! రాజకీయాలు అసహ్యంగా మారాయనడానికి కొందరు ఎమ్మెల్యేలు వాడుతున్న పదజాలమే నిదర్శనం. ‘పాలిటిక్స్‌ ఈజ్‌ ది లాస్ట్‌ రిసార్ట్‌ ఆఫ్‌ స్కౌండ్రల్స్‌’ అంటారు. చట్టసభల్లో జెంటిల్‌మాన్‌ ఎవరూ ఉండటంలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఉండనివ్వరు. కులం, మతం, వ్యక్తిగత ప్రయోజనం ఆధారంగా కాకుండా, నాయకుల గుణం చూసి ఎన్నుకునే చైతన్యం ప్రజల్లో రావాలి. అవకాశవాద రాజకీయాలను పాతరేయ్యాలి. ఇతరులతో మంచిగా మెలిగే సంస్కారాన్ని, ఆడవాళ్లతో మర్యాదగా ప్రవర్తించే తీరును చిన్నతనం నుంచి ఇంటిలోను, బడిలోను నేర్పించాలి. అంతకన్నా ముందు... ఆదర్శంగా ఉండాల్సిన నేతలు కనీసం చట్టసభల్లోనైనా మనుషులుగా మెలగడం మరవకూడదు.’’

 

చట్టసభలో మహిళా సమస్యలు చర్చకు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా శాసనసభ్యురాళ్లు అంతా ఏకమవ్వడం గతంలో చూశాం. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేలు కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నారు. ఆయా పార్టీల మౌత్‌పీస్‌గా మారుతున్నారు.


                                                                                                     కె. వెంకటేష్‌

Advertisement
Advertisement