కమ్మేయనున్న కమలం!

ABN , First Publish Date - 2022-06-26T08:54:26+05:30 IST

తెలంగాణను కమలనాథులు కమ్మేయనున్నారు! రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేయడమే ధ్యేయంగా...

కమ్మేయనున్న కమలం!

  • రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముఖ్య నేతల ప్రచారం.. 
  • వారిలో కేంద్ర మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు
  • మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటన
  • ఒక్కో సెగ్మెంటుకు ఒక్కో ముఖ్య నేత, రాష్ట్ర బాధ్యుడు
  • కార్యకర్తల ఇళ్లలో భోజనాలు.. ఇంటింటి ప్రచారం
  • జాతీయ కార్యవర్గ సమావేశాల ముందు ధూం ధాం
  • కేసీఆర్‌ పాలనకు కౌంట్‌డౌన్‌ పేరిట వెబ్‌ ప్రారంభం
  • ‘సాలు దొర.. సెలవు దొర’ పేరిట ప్రారంభించిన ఛుగ్‌
  • మరో 529 రోజుల్లో కుటుంబ పాలన నుంచి విముక్తి
  • వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కండి.. ట్విటర్‌ ఖాతా ఫాలోకండి
  • కేసీఆర్‌, మోదీ పాలనలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
  • మంత్రి కేటీఆర్‌కు పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సవాల్‌


హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను కమలనాథులు కమ్మేయనున్నారు! రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేయడమే ధ్యేయంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలనూ రెండు, మూడు రోజులపాటు చుట్టేయనున్నారు! వీరిలో కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు ఉన్నారు! మోదీ పాలనపై విస్తృత ప్రచారం చేయడమే కాకుండా.. ఇంటింటికీ వెళ్లి ఆయన బహిరంగ సభకు రావాలని ఆహ్వానించనున్నారు! ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనను దునుమాడనున్నారు! హైదరాబాద్‌లో 3 రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీల్లో పాల్గొనడానికి వస్తున్న వీరిని.. పార్టీ ప్రచారానికి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. శనివారం రాత్రి వరకూ ఖరారైన వివరాల ప్రకారం 20 మంది కేంద్ర మంత్రులు, ఆరుగురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మరో ఐదుగురు మాజీ సీఎంలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వివిధ రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలవారితో బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వంటి ముఖ్య నేతలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజక వర్గాల్లో ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే.


 ‘టార్గెట్‌ తెలంగాణ’ అంటున్న కమలనాథులు ఇక్కడి నుంచే భేరీని మోగించనున్నారు కూడా. ఇందులో భాగంగా బీజేపీ దూకుడు పెంచింది. కేసీఆర్‌ పాలనకు బై బై చెప్పే రోజు వచ్చిందంటూ కౌంట్‌ డౌన్‌ వెబ్‌సైట్‌ను తెరిచింది. పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్‌ ఫొటోలతో కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను ఏర్పాటు చేసింది. ఇక, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎనిమిదేళ్ల మోదీ పాలన ఘనతలను వివరించడంతోపాటు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలపై విమర్శలు సర్వసాధారణం. కానీ, సమావేశాలకు వచ్చేవారిని కూడా పార్టీ ప్రచారానికి విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించడం గమనార్హం. ఇందులో భాగంగా ఈ నెల 29, 30వ తేదీల్లోనే కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, బీజేపీ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు నగరానికి చేరుకుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఒక్కొక్కరికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో రాష్ట్ర బాధ్యుడిని అప్పగిస్తారు. ఆయనతో కలిసి సదరు ముఖ్య నేతలు మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తారు. పార్టీ కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేస్తారు. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులతో సమావేశమవుతారు. స్థానికంగా ప్రధాన సమస్యలపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తారు. ఇంటింటికీ వెళ్లి మోదీ బహిరంగ సభ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. మూడో తేదీ సాయంత్రం 4 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు తప్పనిసరిగా రావాలని కోరుతూ బొట్టు పెట్టి మరీ ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. నియోజకవర్గాల్లో రెండున్నర రోజులు పర్యటించిన తర్వాత రెండో తేదీ ఉదయం నోవాటెల్‌ హోటల్‌లో ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.


సాలు దొర.. సెలవు దొర

అలీబాబా 40 దొంగల ముఠా మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుటుంబం లూటీ చేస్తోందని సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని, మరో 529 రోజుల్లో ఆపాలన నుంచి తెలంగాణ విముక్తి అవుతుందని చెప్పారు. ఆ తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్‌ పరిపాలిస్తున్నారని, అందుకే ఆయన పాలనకు బై బై చెప్పే రోజు దగ్గర పడిందని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ‘సాలు దొర.. సెలవు దొర’ నినాదంతో ఏర్పాటు చేసిన కౌంట్‌ డౌన్‌ వెబ్‌సైట్‌ను శనివారం అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతలతో కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఛుగ్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలంటే సెలవు దొర డాట్‌ కాంలో రిజిస్టర్‌ కావాలని, సెలవు దొర ట్విటర్‌ అకౌంట్‌ ఫాలో కావాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, ఒక కుటుంబం బంగారమైంది. కేజీ టు పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళిత బంధు వంటి పథకాలపై వాగ్దానాలు చేసిన కేసీఆర్‌ వాటిని అమలు చేయకుండా కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు’’ అని విమర్శించారు. ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌కు సవాల్‌ చేస్తున్నా. ఎనిమిదేళ్ల మీ పాలనపై, మోదీ పాలనపై బహిరంగ చర్చకు బండి సంజయ్‌ వస్తారు.  ఎవరు నిజాయితీగా ఉన్నారో ప్రజలే నిర్ణయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎ్‌సలో ఉక్కపోత ఎక్కువైందని, దాన్ని కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, టీఆర్‌ఎస్‌ నేతల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని ఛుగ్‌ అన్నారు. ఫోన్లు చేస్తున్నది ఎమ్మెల్యేలా? ఇతరులా? అన్న ప్రశ్నకు ‘కాలమే సమాధానం’ చెబుతుందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు టర్నింగ్‌ పాయింట్‌ కాబోతున్నాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను మోదీ వివరించనున్నారని తెలిపారు.


సంప్రదాయం ఉట్టిపడేలా..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. నుదుటన తిలకం దిద్ది, శాలువాలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకనున్నారు. పోచంపల్లిలో ప్రత్యేకంగా శాలువాలు తయారు చేయిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున స్వాగత ఏర్పాట్లపై శనివారం ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఆహ్వాన కమిటీ కన్వీనర్‌ తూళ్ల వీరేందర్‌గౌడ్‌ తదితరులతో రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ఎయిర్‌పోర్టులో సమీక్షించారు. అతిథులకు ప్రత్యేక లాంజ్‌ ఏర్పాటు చేస్తున్నారు. నోవాటెల్‌, ట్రైడెంట్‌, రాడిసన్‌ తదితర హోటళ్లలో బస చేసేందుకు రూమ్‌లు బుక్‌ చేశారు. ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు 12 మందితో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు.


శంషాబాద్‌ నుంచి భారీ ర్యాలీ

జూలై 1నే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర ఆయనకు స్వాగత ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఆయన నోవాటెల్‌కు చేరుకుంటారు. 2న ఉదయం జాతీయ పదాధికారుల సమావేశం ఉంటుంది. అదేరోజు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 3న ఉదయం జాతీయ కార్యవర్గ సమావేశం, సాయంత్రం భారీ బహిరంగసభ ఉంటాయి.

Updated Date - 2022-06-26T08:54:26+05:30 IST