విద్యుత్‌ బిల్లుల్లో తప్పుల్లేవు

ABN , First Publish Date - 2020-05-29T07:30:08+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులకు ఇచ్చిన బిల్లుల్లో కరెంటు వాడకాన్ని లెక్కించడంలో తప్పులేమీ లేవని

విద్యుత్‌ బిల్లుల్లో తప్పుల్లేవు

  • వాడకం పెరగడం వల్లే అధిక బిల్లులు: ఈఆర్‌సీ

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు ఇచ్చిన బిల్లుల్లో కరెంటు వాడకాన్ని లెక్కించడంలో తప్పులేమీ లేవని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. వాడకం పెరగడం వల్లే అధిక బిల్లులు వచ్చాయని పేర్కొంది. కొంతమంది వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సందేహాలపై పరిశీలించిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. చార్జీలు పెంచడం, గ్రూపులు మార్చడం వల్ల అధిక బిల్లులు వచ్చాయనే ప్రచారంలో నిజం లేదని తమ పరిశీలనలో తేలినట్లుగా తెలిపింది. గ్రూప్‌-సీలో 500యూనిట్లకు పైబడి విద్యుత్‌ వినియోగించిన వారికి యూనిట్‌కు రూ.0.90 చార్జీ పెరిగిందని, దీనివల్ల 100యూనిట్లకు పడే భారం రూ.90మాత్రమే ఉంటుందని వివరించింది.


గ్రూప్‌-ఏలో ఉన్నవారు 75 యూనిట్లు దాటితే పడే భారం రూ.58 మించదని, అలాగే గ్రూప్‌-బీలో ఉన్నవారు 225 యూనిట్ల వాడకాన్ని దాటితే పడే భారం గరిష్ఠంగా రూ.260 వరకూ మాత్రమే ఉంటుందని తెలిపింది. తమ వాడకం అంతలేదని ఎవరైనా భావిస్తే సంబంధిత విద్యుత్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. వినియోగదారుల సౌకర్యార్థం బిల్లు చెల్లింపు గడువును జూన్‌ నెలాఖరు వరకూ పొడిగించినట్లు మండలి తెలిపింది.

Updated Date - 2020-05-29T07:30:08+05:30 IST