ఆ విద్యా సంస్థలను మూసేయండి

ABN , First Publish Date - 2021-03-28T09:58:10+05:30 IST

కొవిడ్‌ కేసులు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు.

ఆ విద్యా సంస్థలను మూసేయండి

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు 

విద్యార్థులకు కరోనా పరీక్షలు పెంచుతాం

అధికారులతో సమీక్షలో మంత్రి సురేశ్‌ 


అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసులు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ప్రతి రోజూ రిపోర్టు తీసుకుని సమీక్షిస్తామని తెలిపారు. మాస్క్‌లు లేకుండా  విద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు మాస్క్‌లు అందించాలన్నారు. విద్యార్థులకు థర్మల్‌ స్కానింగ్‌ తప్పకుండా చేయాలన్నారు. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


శనివారం విజయవాడలో కొవిడ్‌ స్థితిగతులపై అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేశ్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ విజృంభణతో గత విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించలేకపోయామన్నారు. అందరి సహకారంతో ఈ విద్యా సంవత్సరాన్ని కొంతమేర కాపాడుకోగలిగామని చెప్పారు. ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవడం ద్వారా అకడమిక్‌ క్యాలెండర్‌ను గాడిలో పెట్టామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు మన రాష్ట్రంలో చేశామని తెలిపారు. కొవిడ్‌ మళ్లీ పుంజుకుంటోందని, ఈ రెండు నెలలు అత్యంత క్లిష్టమైనవని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి స్కూల్‌కు ఎస్‌ఓపీ ఏర్పాటు చేసి, దాన్ని పక్కాగా పాటించాలన్నారు.


విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామన్నారు. కొవిడ్‌పై ఎవరూ అసత్య కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ కాలేజీలో 168 మందికి కరోనా సోకిందని తెలిపారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు పెంచుతామని చెప్పారు. ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-28T09:58:10+05:30 IST