రికార్డు లాభాలు

ABN , First Publish Date - 2020-06-06T06:59:54+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ)కి లాభాల పంట పండింది. గత ఆర్థిక సంవత్సరం

రికార్డు లాభాలు

  • 2019-2021లో  ఎస్‌బీఐ ప్రాఫిట్‌ రూ.14,488  కోట్లు 
  • బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం 
  • కలిసొచ్చిన అనుబంధ విభాగాల వాటా విక్రయాలు
  • జనవరి-మార్చి త్రైమాసిక లాభం రూ.3,581 కోట్లు


న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ)కి లాభాల పంట పండింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఎస్‌బీఐ రూ.14,488 కోట్ల లాభం ఆర్జించింది. బ్యాంక్‌ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక వార్షిక లాభం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.862 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ తన అనుబంధ విభాగాలైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటాలు విక్రయించింది. తద్వారా సమకూరిన ఏకకాల ఆదాయాలతో లాభం అనూహ్యంగా పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ ఆదాయం రూ.2,96,329.43 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.2,78,082.99 కోట్లుగా నమోదైంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయం ద్వారా రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో రూ.3,484.30 లాభం సమకూరగా.. ఎస్‌బీఐ కార్డ్స్‌లో వాటా విక్రయం తో నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,731.34 కోట్ల లాభం సమకూరింది. 


క్యూ4 లాభం నాలుగింతలు : మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ లాభం నాలుగింతలై రూ.3,581 కోట్లకు చేరుకుంది. ఎస్‌బీఐ కార్డ్స్‌లో వాటా విక్రయంతోపాటు మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గుముఖం పట్టడం లాభాల పెరుగుదలకు దోహదపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఇదే కాలానికి లాభం రూ.838.44 కోట్లుగా నమోదైంది. 2019-20 మూడో త్రైమాసికానికి (క్యూ3) నమోదైన రూ.5,583.36 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం తక్కువే. మరిన్ని ముఖ్యాంశాలు.. 


మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.76,027.51 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రాబడి రూ.75,670.50 కోట్లుగా ఉంది 

2020 మార్చి 31 నాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 6.15 శాతానికి తగ్గాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు నాటికి నమోదైన ఎన్‌పీఏలు 7.53 శాతం

వార్షిక ప్రాతిపదికన నికర ఎన్‌పీఏలు 3.01 శాతం నుంచి 2.23 శాతానికి జారుకున్నాయి

 మొండి బకాయిల నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు తక్షణ అవసరాల కోసమని బ్యాంక్‌ జనవరి-మార్చి కాలానికి రూ.13,495.08 కోట్లు కేటాయించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కేటాయించిన రూ.16,501.89 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి 

ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ రూ.6,050 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా బ్యాంక్‌లో 48.21 శాతం వాటా లభించింది 


రివ్వున ఎగిసిన షేరు : రికార్డు లాభాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఒక్కసారిగా దూసుకు పోయింది. శుక్రవారం బీఎ్‌సఈలో బ్యాంక్‌ షేరు ధర 7.90 శాతం పెరిగి రూ.187.80 వద్ద క్లోజైంది. దీం తో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.1,67,604 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2020-06-06T06:59:54+05:30 IST