మీతోనే ప్రారంభించండి

ABN , First Publish Date - 2022-04-22T05:30:00+05:30 IST

మనిషికి జీవితంలో శాంతి చేకూరడం ప్రధానం. అలాంటి శాంతి ప్రతి మనిషిలో కలగనంత

మీతోనే ప్రారంభించండి

మనిషికి జీవితంలో శాంతి చేకూరడం ప్రధానం. అలాంటి శాంతి ప్రతి మనిషిలో కలగనంత వరకూ... ఈ ప్రపంచంలో శాంతి నెలకొనడం ముమ్మాటికీ అసాధ్యం. అయితే మనకు ఎక్కడ చూసినా అశాంతే కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యం క్రమేపీ కనుమరుగైపోతోంది. కుటుంబాల్లో అంతఃకలహాలకు ఇదే మూలకారణం. ఇంట్లో కలహాలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఏం చెయ్యాలి? పురుషులైనా, మహిళలైనా... మనమందరం మనుషులమేననే సంగతి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పరస్పర సమానతా భావం ఉండాలి. వారి మనసుల్లో ఎక్కడైనా వెలితి అనిపిస్తే... అది వారిని లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. వేదనకు గురవుతారు. ఆ ఆక్రోశాన్ని ఇంట్లో ఉన్నవారి మీద చూపిస్తారు. బయటి వాళ్ళమీద చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసు, కాబట్టి ప్రేమగా చూడాల్సిన కన్న బిడ్డల మీద ప్రదర్శిస్తారు. అలాంటి వారితో ఎలా మసలుకోవాలో తెలియక... కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అసహనానికి లోనవుతూ ఉంటారు. 



నేను మీకు ఒక కథ చెబుతాను:

పూర్వం ఒక రాజ్యానికి ఒక మహర్షి వచ్చాడు. ఆయనను కలవడానికి రాజకుమారి ఉత్సాహంగా బయలుదేరి వచ్చింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలని ఎంతో కుతూహలంగా అడిగింది. 

‘‘నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నాకు బాగా తెలుసు. నీ వల్ల ఎంతో హాని కలుగుతుంది. నీ వల్ల ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో ఎందరో ప్రాణాలు కోల్పోతారు’’ అన్నాడు ఆ మహర్షి.

ఆ మాటలు విని తల్లడిల్లిన రాజకుమారి... ‘‘నా వల్ల యుద్ధం జరుగుతుందా? నా వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతారా? అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ తరుణోపాయం మీరే చెప్పండి’’ అని అడిగింది.

‘‘అలా జరగకూడదని నువ్వు అనుకుంటే... నేను నీకు ఒక ఉపాయం చెబుతాను. నీ జీవితంలో ఓ మూడు పనులు చెయ్యగలిగితే... ఇవేవీ జరగకుండా ఆపగలవు. కానీ అవి నువ్వు చెయ్యగలవా?’’ అని అడిగాడు. 

‘‘అవేమిటో సెలవివ్వండి స్వామీ’’ అని ఆమె కోరింది.

‘‘మొదటిది... నువ్వు ఎవరినీ అవమానించకూడదు. రెండోది... ఎవరైనా నిన్ను అవమానిస్తే కోపగించకూడదు. మూడోది... ఒకవేళ నిన్ను ఎవరైనా అవమానిస్తే... దానివల్ల నీకు కోపం వచ్చినా సరే, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకూడదు’’ అన్నాడు మహర్షి.

ఇది ద్రౌపది, వ్యాస మహర్షుల మధ్య జరిగిన సంభాషణ.

కానీ... ద్రౌపదికి వివాహం అయ్యాక... ఒకసారి (మయసభలో) దుర్యోధనుడు కాలుజారి పడడం చూసి పకపకా నవ్వింది. దాంతో దుర్యోధనుడికి కోపం వచ్చింది. అనంతరం ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు... ఆమెకు కోపం కలిగింది. జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అదే యుద్ధానికి దారి తీసింది.

అయితే... వ్యాసుడు సూచించిన ఆ మూడు పనులనూ ఇంట్లో మనం అవలంబించగలిగితే... భార్యాభర్తలు ఒకరిని ఒకరు నొప్పించుకోకుండా, బాధ కలిగేలా ఏదీ అనకుండా, ఒకవేళ బాధ కలిగినా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకుండా ఉంటే... ఎలాంటి కలహాలూ తలెత్తవు. అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. తమ జీవితాలు ప్రశాంతంగా సాగేలా చేయాలని ఎంతోమంది నన్ను కోరుతూ ఉంటారు. కానీ ఇందులో ఎవరైనా చేసేది ఏమీ లేదు. మనం రోజు ఆహారం తింటాం, నీరు తాగుతాం. దానికి ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. అలాగే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణానికి కూడా మనమే కృషి చేయాలి. దాన్ని ముందుగా మీతోనే ప్రారంభించండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే... మిగిలిన వారికి కూడా ప్రశాంతత చేకూరే వాతావరణాన్ని సృష్టించగలరు.

 ప్రేమ్‌ రావత్‌

9246275220


Updated Date - 2022-04-22T05:30:00+05:30 IST