రామగుండం ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?

ABN , First Publish Date - 2021-07-28T09:06:17+05:30 IST

రామగుండం ఎత్తిపోతల నిర్మాణం ఆగిపోయింది. ఇది పూర్తయ్యేదెన్నడు? తమ భూములకు నీళ్లొచ్చేదెన్నదని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

రామగుండం ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?

నిధులు లేక నిలిచిపోయిన పనులు


పెద్దపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎత్తిపోతల నిర్మాణం ఆగిపోయింది. ఇది పూర్తయ్యేదెన్నడు? తమ భూములకు నీళ్లొచ్చేదెన్నదని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు చివరగా ఉన్న పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని భూములకు నీరందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసినా నిధులు లేక రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయి. చెంతనే ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రామగుండం ప్రాంతానికి సాగునీటిని ఇవ్వకపోవడంతో ఎక్కడో ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిపైనే రైతులు ఆధార పడాల్సి వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి సక్రమంగా నీళ్లు రాక ప్రతి ఏటా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. నిధులు విడుదల చేయకపోవటంతో బిల్లులు రాక  కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. దీనిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గానీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో రైతుల కల నెరవేరడం లేదు. 


ఆయకట్టు చివరి భూములకు సాగునీరు కరువు

రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల భూములకు ఎస్సారెస్పీ డి-83, 27ఎల్‌, 17ఎల్‌ కాలువల ద్వారా సాగు నీరందుతున్నాయి. ఈ భూములు కాలువకు చివరన ఉండడంతో సక్రమంగా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో గోదావరిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించినప్పుడు తమ భూములకు నీరందించాలని ఈ ప్రాంత రైతులు కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానైనా ఈ ప్రాంతానికి సాగు నీటిని అందించాలని కోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-28T09:06:17+05:30 IST