మొలకెత్తే కాగితం..

ABN , First Publish Date - 2020-07-26T16:52:19+05:30 IST

కాగితాలు మొలకెత్తుతాయా? ఏంటి వింతగా ఉందే? అవును ఆశ్చర్యమే! నల్లగొండ పట్టణానికి చెందిన ప్రకృతి ప్రేమికురాలు అరుణజ్యోతి చెత్తను సత్తువగా చేసి..

మొలకెత్తే కాగితం..

కాగితాలు మొలకెత్తుతాయా? ఏంటి వింతగా ఉందే? అవును ఆశ్చర్యమే! నల్లగొండ పట్టణానికి చెందిన ప్రకృతి ప్రేమికురాలు అరుణజ్యోతి చెత్తను సత్తువగా చేసి.. విత్తనాలను మొలకెత్తిస్తున్నారు. మహారాష్ట్రలోని మరాఠా కుటుంబంలో పుట్టిన ఆమె.. వ్యర్థానికి అర్థాన్ని సృష్టించింది. ‘సీడ్‌ పేపర్‌ జ్యోతక్క’గా మన్ననలు పొందుతోంది.. ఆమె మాటల్లో..


మనం ఇచ్చిన కానుకలు పచ్చగా మొలకెత్తినప్పుడు వచ్చే ఆనందం ఇంకెందులోనూ ఉండదు. ‘జ్యోతక్కా.. చూశారా.. మీరిచ్చిన సీడ్‌ పేపర్‌లు మొక్కలయ్యాయి..’ అంటూ ఫోటోలు పంపిస్తుంటారు. పారేసే చెత్తతో ఇంత మంచి పనిచేస్తుంటే  సంతృప్తి అనిపిస్తుంది. సీడ్‌పేపర్‌ తయారీకి ముందు నేను కొన్ని ప్రయోగాలు చేశాను. అలా వచ్చింది ఈ ఆలోచన. వ్యర్థాల నుంచీ పనికొచ్చే వస్తువుల్ని చేయడం పెళ్లికి ముందు నుంచి అలవాటుంది. ఐస్‌పుల్లలతో ఫోటోఫ్రేమ్‌లు, ప్లాస్టిక్‌గ్లాసులు, కొబ్బరిబోండాల్లో మొక్కల పెంపకం.. ఇలా చేసేదాన్ని. ముప్పయిరెండేళ్ల వయసులో కూచిపూడి నేర్చుకుని పిల్లలకు శిక్షణ ఇచ్చేదాన్ని. ఏడు నిమిషాల్లో మట్టి గణపతి చేసేదాన్ని. హైదరాబాద్‌, బెంగళూరులోని ఐటీ సంస్థల ఉద్యోగులకు కూడా నేర్పించాను. టీటీడీ దేవస్థానం ఆహ్వానం మేరకు పదివేల మందికి మట్టి విగ్రహాల తయారీలో శిక్షణ ఇచ్చాను.


హోలీకి సహజమైన రంగుల్ని ఎలా చేయాలో కూడా తర్ఫీదునిస్తుంటా. కుట్లు, అల్లికల ద్వారా కొన్ని వస్తువుల్ని చేసి విక్రయిస్తుంటాను. ఇవన్నీ నా వ్యాపకాలు. అయితే పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం ఒకటి చేద్దామని ఆలోచించాను. అప్పుడు తయారుచేసిందే సీడ్‌ పేపర్‌. మనం రోజూ సొరకాయ, బీరకాయ, గుమ్మడి.. ఇలా ఎన్నో కూరగాయల వ్యర్థాలను చెత్తబుట్టలో పడేస్తుంటాం. గుజ్జుగా చేసిన ఆ చెత్తతోనే టిష్యూపేపర్‌పై విత్తనాలు చల్లి ‘సీడ్‌ పేపర్‌’ చేశాను. ఇంట్లో చెత్త పోగయ్యే పరిస్థితే ఉండదు. మున్సిపాలిటీ వాళ్లు కూడా ‘జ్యోతక్క ఇంట్లో చెత్త ఎక్కువగా ఉండదు’ అంటుంటారు. నాకు వీలున్నప్పుడల్లా సీడ్‌ పేపర్‌లను చేస్తుంటాను. వాటిని స్నేహితులకు ఇస్తుంటాను. మట్టిపైపొర తీసి.. ఈ సీడ్‌పేపర్‌లను పాతిపెట్టి, మట్టి కప్పి, నీళ్లు చల్లితే చాలు.. విత్తనాలు మొలకెత్తుతాయి.





గతంలో ఇలాగే సీడ్‌బాల్స్‌ చేశాను. నల్లగొండ పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో వాటిని విసిరేశాను. అయితే వర్షాలు రాక మొలకెత్తలేదు. బాల్‌లో మిశ్రమాలు సరిగా కలవక వృథా అయ్యాయి. ఆ చేదు అనుభవంతో ఇప్పుడీ సీడ్‌పేపర్‌ తయారు చేశా. ఇవి చక్కగా మొలకెత్తుతున్నాయి. అడిగిన వాళ్లకు ఇస్తున్నాను. ఇంట్లో ఖాళీగా ఉండటం దేనికి? ఇలా నలుగురికి పనికొచ్చే పనిచేస్తే మంచిదేగా!. పచ్చటి తెలంగాణ మనందరి లక్ష్యం. 


సీడ్‌పేపర్‌ ఎలా చేయాలి?

వృథాగా పడేసే కూరగాయల తొక్కలను మిక్సీలో వేసి, గుజ్జుగా చేసుకోవాలి..

ఓ టిష్యూ పేపర్‌పై ఆ గుజ్జుతో అలికేయాలి..

అలికిన కాగితంపై విత్తనాలను నలుమూలలా చల్లాలి.. పైన ఎండిన వేపాకును చల్లాలి..

దానిపై మళ్లీ ఒక టిష్యూ పేపర్‌ను పరచాలి..

రెండ్రోజులు ఈ కాగితాన్ని ఆరబెట్టాలి..

జొన్నరొట్టెలా గట్టిపడిన ఆ కాగితాన్ని.. మట్టి పైపొరను తీసి లోపలపెట్టి.. మళ్లీ మట్టిని వేయాలి. కాస్త నీళ్లు చిలకరిస్తే చాలు. విత్తనాలు మొలకెత్తుతాయి. కాగితం విత్తనాలను బంధుమిత్రులకు కానుకగా ఇవ్వొచ్చు. లేదంటే అడవుల్లో, బీడు భూముల్లో వేయొచ్చు.


మధుసూదన్‌ మారబోయిన, నల్లగొండ

ఫోటోలు: విజయ్‌ ముచ్చర్ల 


Updated Date - 2020-07-26T16:52:19+05:30 IST