ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌

ABN , First Publish Date - 2022-05-30T11:00:15+05:30 IST

ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌

ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌

ఫైనల్లో రాజస్థాన్‌ చిత్తు

హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ షో


అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మ్యాచ్‌ మ్యాచ్‌కూ తమ స్థాయిని పెంచుకుంటూ.. ఆల్‌రౌండ్‌ షో అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపించిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఇప్పుడు నయా చాంపియన్స్‌. లీగ్‌లో అడుగుపెట్టిన తొలిసారే  ప్రత్యర్థులను వణికించడంతో పాటు.. హోరాహోరీ తప్పదనుకున్న ఫైనల్‌ను కాస్తా ఈ జట్టు ఏకపక్షంగా మార్చేసింది. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ఒత్తిడిని దరి చేరనీయకుండా బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ రాణించి వహ్వా అనిపించాడు. ఫైనల్లోనూ రాజస్థాన్‌ ప్రమాదకర త్రయం శాంసన్‌, బట్లర్‌, హెట్‌మయెర్‌లను పెవిలియన్‌కు చేర్చి వారి వెన్నువిరిచాడు. ఇక 131 పరుగుల సాధారణ ఛేదనలో పెద్దగా మెరుపులు లేకపోయినా టైటాన్స్‌ సునాయాసంగానే మ్యాచ్‌ను ముగించి సొంత గడ్డపై అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.


అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజేతగా నిలిచింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34; 3/17) బ్యాటింగ్‌.. బౌలింగ్‌లోనూ ఇరగదీయగా, ఓపెనర్‌ గిల్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్‌) తుదికంటా నిలిచాడు. దీంతో ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. బట్లర్‌ (35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మాత్రమే రాణించాడు. హార్దిక్‌కు 3, సాయికిశోర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. మిల్లర్‌ (19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్‌) చివర్లో వేగంగా ఆడాడు. బౌల్ట్‌, ప్రసిద్ధ్‌, చాహల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హార్దిక్‌ నిలిచాడు. 


గిల్‌ అజేయంగా..: స్వల్ప ఛేదనే అయినా గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగానే సాగింది. తొలి ఓవర్‌లోనే జీవదానం లభించిన గిల్‌ తుదికంటా నిలిచి ఆదుకున్నాడు. మధ్య ఓవర్లలో హార్దిక్‌ అండగా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే సాహా (5)ను ప్రసిద్ధ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా, వేడ్‌ (8) కూడా నిరాశపర్చడంతో పవర్‌ప్లేలో స్కోరు 31/2 మాత్రమే. ఈదశలో గిల్‌, కెప్టెన్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మెకాయ్‌, చాహల్‌ ప్రమాదకరంగా బంతులు వేయడంతో వీరు ఆచితూచి ఆడారు. 12వ ఓవర్‌లో పాండ్యా 4,6తో జోరు పెంచడంతో 15 పరుగులు లభించాయి. 14వ ఓవర్‌లో చాహల్‌ చేతిలో పాండ్యా అవుటయ్యాడు. అప్పటికి విజయానికింకా 41 బంతుల్లో 45 రన్స్‌ కావాల్సి ఉంది. ఇక ఎప్పటిలాగే డేవిడ్‌ మిల్లర్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో మిగతా పనికానిచ్చాడు. చివర్లో నాలుగు పరుగులు కావాల్సిన వేళ గిల్‌ భారీ సిక్సర్‌తో మరో 11 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


హార్దిక్‌, రషీద్‌ మేజిక్‌: భారీ స్కోరుతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో టాస్‌ నెగ్గగానే రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ గుజరాత్‌ బౌలర్లు వారి అంచనాలను వమ్ము చేశారు. ముఖ్యంగా హార్దిక్‌, రషీద్‌ కట్టుదిట్టమైన బంతులతో పరుగులను నియంత్రిస్తూనే వికెట్లు తీస్తూ ఆర్‌ఆర్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశారు. బెంగళూరుపై ఆడిన జోరు బట్లర్‌ ఆటలో కనిపించకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకుంది. అయితే ఓపెనర్‌ జైశ్వాల్‌ (22) ఉన్నంత సేపు బ్యాట్‌ ఝుళిపించాడు. మూడో ఓవర్‌లోనే 4,6 బాదిన తను తర్వాతి ఓవర్‌లోనే భారీ సిక్స్‌తో ఊపు మీద కనిపించాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికి యష్‌ దయాల్‌ అతడిని అవుట్‌ చేశాడు. తొలి వికెట్‌కు 31 పరుగులు రాగా ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. ఆ తర్వాత శాంసన్‌ (14) రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో 44/1 స్కోరు సాధించింది. ఏడో ఓవర్‌లో బట్లర్‌ వరుస ఫోర్లతో కాస్త టచ్‌లోకి వచ్చాడు. హార్దిక్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. తొమ్మిదో ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి శాంసన్‌ను అవుట్‌ చేశాడు. పేలవ ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్‌ (2)ను 12వ ఓవర్‌లోనే రషీద్‌ అవుట్‌ చేశాడు. ఇక 13వ ఓవర్‌లో రాజస్థాన్‌కు హార్దిక్‌ అతి పెద్ద ఝలక్‌ ఇచ్చాడు. ప్రమాదకర బట్లర్‌ను అవుట్‌ చేయడంతో టైటాన్స్‌ సంబరాల్లో మునిగింది. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతి అతడి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ సాహా చేతుల్లో పడింది. దీనికి తోడు 11-14 ఓవర్ల మధ్య కేవలం 13 రన్స్‌ మాత్రమే రావడంతో ఆర్‌ఆర్‌ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. హెట్‌మయెర్‌ (11) 15వ ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించినా హార్దిక్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డెత్‌ ఓవర్లలో అశ్విన్‌ (6), పరాగ్‌ క్రీజులో ఉండడంతో కాసిన్ని పరుగులు వస్తాయని భావించినా 16వ ఓవర్‌లోనే అశ్విన్‌ వెనుదిరిగాడు. అయితే 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో జట్టు అత్యధికంగా 16 రన్స్‌ సాధించడం గమనార్హం. ఇక చివరి రెండు ఓవర్లలో 10 రన్స్‌ చేసి మెకాయ్‌ (8), పరాగ్‌ (15) వికెట్లను కోల్పోయిన ఆర్‌ఆర్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు


రాజస్థాన్‌ రాయల్స్‌: జైస్వాల్‌ (సి) సాయికిశోర్‌ (బి) యశ్‌ దయాల్‌ 22, బట్లర్‌ (సి) సాహా (బి) హార్దిక్‌ 39, శాంసన్‌ (సి) సాయికిశోర్‌ (బి) హార్దిక్‌ 14, పడిక్కళ్‌ (సి) షమి (బి) రషీద్‌ 2, హెట్‌మయెర్‌ (సి) అండ్‌ (బి) హార్దిక్‌ 11, అశ్విన్‌ (సి) మిల్లర్‌ (బి) సాయికిశోర్‌ 6, రియాన్‌ (బి) షమి 15, బౌల్ట్‌ (సి) తెవాటియా (బి) సాయికిశోర్‌ 11, మెకాయ్‌ (రనౌట్‌) 8, ప్రసిద్ధ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 130/9; వికెట్ల పతనం: 1-31, 2-60, 3-79, 4-79, 5-94, 6-98, 7-112, 8-130, 9-130; బౌలింగ్‌: షమి 4-0-33-1, యశ్‌ దయాల్‌ 3-0-18-1, ఫెర్గూసన్‌ 3-0-22-0, రషీద్‌ ఖాన్‌ 4-0-18-1, హార్దిక్‌ పాండ్యా 4-0-17-3, సాయికిశోర్‌ 2-0-20-2.

గుజరాత్‌ టైటాన్స్‌: సాహా (బి) ప్రసిద్ధ్‌ 5, గిల్‌ (నాటౌట్‌) 45, వేడ్‌ (సి) పరాగ్‌ (బి) బౌల్ట్‌ 8, హార్దిక్‌ పాండ్యా (సి) జైస్వాల్‌  (బి) చాహల్‌ 34, మిల్లర్‌ (నాటౌట్‌) 32, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 18.1 ఓవర్లలో 133/3; వికెట్ల పతనం: 1-9, 2-23, 3-86; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-14-1, ప్రసిద్ధ్‌ 4-0-40-1, చాహల్‌ 4-0-20-1, మెక్‌కాయ్‌ 3.1-0-26-0, అశ్విన్‌ 3-0-32-0. 


ఫైనల్‌ హైలైట్స్‌


లీగ్‌ మొత్తంలో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ టాస్‌ నెగ్గడం అరుదు. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో సంజూ టాస్‌ నెగ్గి.. బ్యాటింగ్‌ ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పిచ్‌ కొంత పొడిగా ఉండడంతోపాటు గత చరిత్ర ఆధారంగా సంజూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. 


బుల్లెట్‌ లాంటి బంతులతో ఫెర్గూసన్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 5వ ఓవర్‌లో మూడు బంతులను గంటకు 150 కిమీ. కంటే వేగంగా బౌల్‌ చేశాడు. ఈ క్రమంలో ఆఖరి బంతిని గంటకు 157.3 కిమీ వేగంతో వేసిన ఫెర్గూసన్‌.. ఈ సీజన్‌లో అత్యధిక వేగవంతమైన డెలివరీని బౌల్‌ చేశాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (157 కిమీ)ని ఫెర్గూసన్‌ అధిగమించాడు. 


ఒకవైపు బట్లర్‌ జాగ్రత్తగా ఆడడంతో.. రన్‌రేట్‌ను పెంచాల్సిన భారం మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై పడింది. దీంతో తప్పని సరిస్థితుల్లో రిస్క్‌ తీసుకొన్న శాంసన్‌.. పాండ్యా బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ ఆడే క్రమంలో అవుటయ్యాడు. 


హార్ధిక్‌ పాండ్యా వేసిన 13వ ఓవర్‌లో అవుటై తీవ్రంగా నిరాశపడిన బట్లర్‌.. బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్‌ను ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. 


సాయి కిషోర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన బౌల్ట్‌.. మిల్లర్‌ క్యాచ్‌ అందుకున్నా.. బౌండ్రీ రోప్‌ తాకాడు. 


గిల్‌ క్యాచ్‌ను వదిలేసిన చాహల్‌. బౌల్ట్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ నాలుగో బంతిని గిల్‌ ఫ్లిక్‌  చేయబోతే.. ఎడ్జ్‌ తీసుకున్న బంతిని ఫార్వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న చాహల్‌ అనవసరంగా డైవ్‌ చేయడంతో.. క్యాచ్‌ చేజారింది. 


రెండో ఓవర్‌ నాలుగో బంతికి సాహా మిడిల్‌ స్టంప్‌ను లేపేసిన ప్రసిద్ధ్‌. డ్రైవ్‌ చేయబోయిన సాహా.. బ్యాట్‌, ప్యాడ్‌ ఖాళీలోంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసిన బంతి. 


మెకాయ్‌ (18.1) బౌలింగ్‌లో గిల్‌ సిక్స్‌తో మ్యాచ్‌ ఫినిష్‌. 


Updated Date - 2022-05-30T11:00:15+05:30 IST