Domestic Workers: కువైత్‌లో కొత్త రూల్స్.. ఇకపై యజమాని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-17T14:29:49+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ Domestic Worker లకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

Domestic Workers: కువైత్‌లో కొత్త రూల్స్.. ఇకపై యజమాని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ Domestic Worker లకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ న్యాయ మంత్రిత్వశాఖ గృహకార్మికులకు సంబంధించిన లా నం.68/2015కు తాజాగా మార్పులు చేస్తూ మినిస్ట్రియల్ డెసిషన్ నం. 22/2022ను తాజాగా విడుదల చేసింది. పాత చట్టంలోని కొన్ని అధికరణలను సవరించి ఈ కొత్త చట్టాన్ని రూపొందిచినట్లు మంత్రి జమాల్ అల్ జలావి వెల్లడించారు. ఇప్పటికే దీనికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఆమోదం తెలిపింది. దీంతో తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. 


ఇక కొత్త నిబంధనల ప్రకారం యజమాని ఏ సందర్భంలో కూడా వర్కర్‌కు సంబంధించిన వేతనంలో కోత పెట్టడం గానీ, డ్యూస్ ఉంచడం గానీ చేయకూడదు. అలాగే తన ఇంట్లో పనిచేసే కార్మికుడు/కార్మికురాలికి భోజనం, బట్టలు, వసతి సౌకర్యాలను యజమానినే కల్పించాలి. అంతేగాక డొమెస్టిక్ వర్కర్లకు మంత్లీ 75దినార్ల(రూ.18,982)కు తగ్గకుండా శాలరీ చెల్లించాలి. ఆర్టికల్ 31 ప్రకారం యజమాని తన ఇంటి పనివాడికి ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తే, అతను ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనానికి అదనంగా 10 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆరు పనిదినాల తర్వాత 24 గంటల వారాంతపు విశ్రాంతి ఇవ్వాలి. ఓవర్‌టైమ్ పనివేళలు రోజుకు రెండు గంటలకు మించకూడదు. అలాగే ఓవర్‌టైమ్ పనికి సగం రోజుల వేతనం చెల్లించబడుతుంది. ఓ వర్కర్ 11 నెలల పని చేసిన తర్వాత వేతనంతో కూడిన 30 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-05-17T14:29:49+05:30 IST