అధ్యాత్మ వేదిక.. గురుసన్నిధి

ABN , First Publish Date - 2020-08-19T09:46:26+05:30 IST

ప్రశాంత, అనంత అంతశ్చేతన కేవలం అనుభవం వల్లనే తెలుస్తుంది. సంపూర్ణ జ్ఞానము మాత్రమే దాన్ని అనుభూతి మయం చేస్తుంది.

అధ్యాత్మ వేదిక.. గురుసన్నిధి

ప్రశాంత, అనంత అంతశ్చేతన కేవలం అనుభవం వల్లనే తెలుస్తుంది. సంపూర్ణ జ్ఞానము మాత్రమే దాన్ని అనుభూతి మయం చేస్తుంది. సద్గురువు, సద్గ్రంథం లభించే అదృష్టం పరమాత్మ అనుగ్రహం వల్లనే దక్కుతుంది. సుశిక్షితుడైన పడవ సరంగు వల్లనే పడవ ఒడిదుడుకులకు లోనుకాకుండా ప్రయాణించినట్టు.. సంసార సాగరాన్ని దాటడానికి సత్సాంగత్యం అవసరం. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సంసారభావనకు ఆత్మవిచారమే అసలు మందు అనే విషయం తెలుసుకోవాలి. సత్యదర్శనం సాధించిన వ్యక్తి నిజమైన గురువు. అతడే కల్పతరువు. ఆ తరుచ్ఛాయలలో ప్రాప్తిని అనుసరించి అన్నీ లభిస్తయ్‌.


సద్గురు సన్నిధి మౌనమయం, అది ప్రశాంతిధామం. సద్గురువల చమత్కార సంభాషణలు సైతం జ్ఞానపరిపూతాలు, సందేశాత్మకాలు, మార్గదర్శనాలు, సూచనలు, హెచ్చరికలు. వారితోడి సాంగత్యం శూన్యాన్ని పూర్ణంగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా, లేమిని కలిమిగా రూపాంతరీకరణం చేస్తుంది. జిజ్ఞాసియైున శిష్యుడికి చేసే బోధ మాత్రమే ఫలప్రదమౌతుంది. అది మాత్రమే సమగ్ర విజ్ఞానం. అలవాటుగా చేసే బోధ, సంప్రదాయాన్ని కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శిష్యుడి ఆర్తి, ఏకాగ్రత స్పష్టతలే ఆతడికి అచ్చమైన అవగాహనను కలిగిస్తయ్‌. శాస్త్రాలు, గురువులు ఆత్మసాక్షాత్కారానికి మార్గం చూపిస్తారంతే! శిష్యుల లేదా అర్థించినవారి అనుభవమే ఆత్మావిష్కరణ చేస్తుంది. 


ఆచరణకు నోచని ఏ కళైనా జారిపోతుంది. కాలగర్భంలో కలసి పోతుంది. చైతన్య విలసితమైన బుద్ధ్యాత్మక కళ నిరంతరమూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇంద్రియాలకు లోబడిన వ్యక్తి విషయ వాంఛలను ఆలింగనం చేసుకుంటాడు. విష్ణువాంఛగల వ్యక్తి ఆనందరూపుడౌతాడు పరిమిత, ప్రాకృత విషయాలు బుద్ధిని వికాసమానం చేయవు. అనేక కాలాల అనుభవాన్ని సంక్షిప్తంగా ఒక స్వల్పకాలానికి పరిమితమైన స్వప్నంలో అనుభవించినట్లుగా, సుదీర్ఘ జాగ్రదవస్థలో మాయ తన విలాసాన్ని కొనసాగిస్తుంది. మాయ చైతన్యానికి ఛాయ. అంతరంగంలో ప్రశాంతిని, వైరాగ్యాన్ని అనుభవిస్తూ, కేవలం సాక్షిగా ఉండగలిగితే, అతడే నిత్యసుఖి.


మూర్తీభవించిన ఆనందమే గురువు సంకల్ప, వికల్పాలు లేనివాడి జీవితం ఆనందమయం. మలగుతున్నది దేహమే; వెలుగుతుండేది ఆత్మే; అవినాశియైున బ్రహ్మమే ప్రకృతిగా శోభిల్లుతున్నది. జనన, మరణాతీతమైన ఆత్మ దేశ కాలాలకు అతీతమైనది. అది పదార్థం కాదు.. యథార్థం. ఆద్యంతరహితమై, అనంతమై, అవ్యయమై, అద్భుతమై, అఖండమై ప్రకాశించే చిద్ఘనరసం ఆత్మ! అది సనాతనం. ఇంతటి ఉదాత్త భావనలు కలిగించగల శక్తే గురుశక్తి. శాంతం, కరుణ, జ్ఞానం, వైరాగ్యం, సత్ప్రవర్తన ఏకకాలంలో అనుగ్రహించ గల అధ్యాత్మ వేదిక గురుసన్నిధి.


వీఎస్సార్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-08-19T09:46:26+05:30 IST