ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిద్దాం

ABN , First Publish Date - 2020-02-10T09:35:05+05:30 IST

మానవులు దేహమే గొప్పదనే భ్రాంతిలో ఉంటారు. ఈ భ్రాంతితోనే జీవితాంతం అశాశ్వత వస్తువులు, ఆనందాల చుట్టూ తిరుగుతుంటారు. తమను ఉద్ధరించే శాశ్వత బ్రహ్మ పదార్థం ఒకటి ఉందన్న విషయం మరచిపోతారు. మనను నడిపించే ఆ శక్తి గురించి

ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిద్దాం

మానవులు దేహమే గొప్పదనే భ్రాంతిలో ఉంటారు. ఈ భ్రాంతితోనే జీవితాంతం అశాశ్వత వస్తువులు, ఆనందాల చుట్టూ తిరుగుతుంటారు. తమను ఉద్ధరించే శాశ్వత బ్రహ్మ పదార్థం ఒకటి ఉందన్న విషయం మరచిపోతారు. మనను నడిపించే ఆ శక్తి గురించి జ్ఞానం పొందడాన్నే ‘ఆత్మసాక్షాత్కారం’ అంటారు.


ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి

భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢా నిమాయయా


‘ఓ అర్జునా! యంత్రాన్ని ఎక్కిన వారిలాగా ఉన్న సమస్త ప్రాణులను తనశక్తితో కర్మల్లో ప్రవర్తింపజేస్తూ, ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నాడు’ అన్నాడు శ్రీకృష్ణుడు. రంగులరాట్నం ఎక్కిన పిల్లలు కొంతసేపటి తర్వాత భయంతో అక్కడ చూస్తు ఉన్నవారికి సైగ చేస్తే లాభం లేదు. రంగులరాట్నాన్ని తిప్పుతున్న వ్యక్తివైపు చూసి అరిస్తేనే ఉపయోగం. ఆ వ్యక్తి వల్లే అది ఆగుతుంది. సకల సృష్టికీ ఆధారభూతమైన పరమాత్మ తత్వమూ అంతే. 


సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు

సృష్టియున్నప్పుడు సృజన లేక

సకల దేశములందు సకల కాలములందు

సర్వ వస్తువులందు చంచలములేక

ప్రాగ్దక్షిణములందు పశ్చిమోత్తరమందు

నాల్గు మూలల మీద నడుమ క్రింద

అచలమై సత్యమై ఆద్యంతరహితమై

పరిపూర్ణమై బట్టబయలుగాను

ఏకమైయుండు ఏ బాధలేకయుండు

అట్టి వస్తువు కేవలాత్మయగును


.. అంటూ పరశురామ నరసింహ దాసు ఆత్మకు గొప్ప నిర్వచనం ఇచ్చాడు. ఉపనిషత్తులన్నీ ఆత్మ పదార్థాన్ని ఇలాగే వర్ణించాయి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొనేందుకు కఠోర సాధనలు అవసరం లేదు. మనలోని ‘నేను - మేను’ల భ్రమలను తొలగించుకొని స్వస్వరూపాన్ని పొందడమే ఆత్మజ్ఞానం. సాధకుడు రాగద్వేషాలను వదలిపెట్టి, అరిషడ్వర్గాల మాయలో పడకుండా ఉండడమే ఈ సాధనకు మొదటి మెట్టు. అందుకు మనస్సులోని మాలిన్యాలను ఒక్కొక్కటిగా తొలగించే పనికి పూనుకోవాలి. ఈ పొలుసులన్నీ తొలగిస్తూ పోతే అప్పుడూ ‘నేను’ అనేది కూడా లేకుండా పోతుంది. అలాంటి అత్యున్నత స్థితిలోకి వెళ్లడమే ఆత్మజ్ఞానం. మనమూ అలాంటి మహోన్నత స్థితిలోకి వెళ్లేందుకు గురుబోధ, గ్రంథాలు, సత్సంగం ఉపకరిస్తాయి.

- పి. భాస్కరయోగి

Updated Date - 2020-02-10T09:35:05+05:30 IST