ప్రజా ఉద్యమంతోనే ప్రత్యేక హోదా

ABN , First Publish Date - 2020-02-20T09:11:26+05:30 IST

ఫిబ్రవరి 20వ తేదీ. సీమాంధ్ర తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని రోజు. 10 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన చేసిన సందర్భంలో ఐదున్నర కోట్ల ఎ.పీ. ప్రజలకు ఆనాటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తూ...

ప్రజా ఉద్యమంతోనే ప్రత్యేక హోదా

రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు తమిళనాడు, తెలంగాణ తరహాలో అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించే వరకు హోదా ఒక ఓట్ల జాతర అంశంగానే ఉంటుంది. రాజకీయ పార్టీలకే సంజీవనిగా చలామణి అవుతుంది. హోదా సాధనలో విశ్వసనీయత ఉండాలని చెప్పిన వైకాపా ఆ దిశగా హోదాను సాధించలేకపోతే, కాలం గడిచే కొద్దీ హోదా సాధన వైఫల్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతిమంగా ప్రజలు నిద్రాణ స్థితిని వీడి బలమైన ప్రజా ఉద్యమం నిర్మిస్తేనే హోదా సాధ్యం.


ఫిబ్రవరి 20వ తేదీ. సీమాంధ్ర తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని రోజు. 10 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన చేసిన సందర్భంలో ఐదున్నర కోట్ల ఎ.పీ. ప్రజలకు ఆనాటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తూ ప్రకటన చేసిన రోజు. ఇప్పటి అధికార బీజేపీ నాయకులు కూడా ప్రత్యేక హోదాను మేమే సాధించాం అని చెప్పుకున్న రోజు కూడా అదే. అయితే, ఆరేళ్ళు గడచినా సుదినమో, దుర్థినమో కూడా అర్థంకాని పరిస్థితి ఏ.పీ. ప్రజలది. ఇప్పటికైనా ‘వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ అన్న గురజాడ మాటను సీమాంధ్రులు గుర్తుకు తెచ్చుకోవాలి. అందరూ ఒక్కటై హోదా సాధించి తీరాలి. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతోపాటు అన్ని రాజకీయ పక్షాల, విద్యార్థి, యువత, ఉద్యోగ, మేధావుల అందరి డిమాండ్‌. గత ఆరేళ్ళుగా ఇదే డిమాండ్‌పై అన్ని పక్షాల వారూ విడివిడిగానో, ఐక్యంగానో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలోనూ పలు ఆందోళనలు చేశారు. అయినా మోదీలో కించిత్‌ కదలికను తీసుకురాలేక పోయాం. నిన్నటి అధికార పక్షమైన తెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబుకు హోదాపై విశ్వసనీయత లేదన్న నేటి అధికార పార్టీ వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీకి చెందిన 25మంది పార్లమెంట్‌ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రత్యేక హోదా సాధించుకొస్తానని హామీ ఇచ్చారు. జగన్‌ కోరినట్టుగానే సీమాంధ్ర ఓటర్లు ఆయనకు 151 అసెంబ్లీ స్థానాలను, 22 పార్లమెంటరీ స్థానాలను ఏకపక్ష తీర్పుతో పట్టం కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ‘రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సంజీవని అయిన ప్రత్యేక హోదా తప్పనిసరి. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇస్తున్న గ్రాంట్లు తలసరి రూ.5,573 ఉంటే ఏపీకి ఇస్తున్న తలసరి గ్రాంటు రూ. 3,428. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఆదాయపు పన్ను రాయితీ, జీఎస్టీ మినహాయింపు, పారిశ్రామిక ప్రోత్సాహకాల అందించటం వల్ల హోదాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దారితీసే పారిశ్రామిక ప్రగతి జరగాలన్నా ప్రత్యేకహోదా అవసరం’ అంటూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ హోదా తీర్మానాన్ని ఆమోదింప చేశారు. తీర్మానానికి ముందు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని, నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి హోదాపై విజ్ఞప్తులు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి, ఒకటికి 30 సార్లు ‘ప్లీజ్‌... ప్లీజ్‌...’ అంటూ బతిమిలాడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఢిల్లీలోనే తేల్చేశారు. మరిప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? అనే భేతాళ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చేప్పే ‘విక్రమార్కులు’ రాష్ట్రంలో లేరు. పోనీ, ఢిల్లీ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తునట్టు ‘హోదా ముగిసిన అధ్యాయమా’? అంటే ఏ పార్టీ అంగీకరించటం లేదు. అయితే, హోదా ఎలా వస్తుంది? ఎవరు తెస్తారు? తెచ్చేందుకు ఏం చేస్తారు? బలమైన ప్రధానిని ఎలా అంగీకరింప జేస్తారు? రాజ్య సభలో వెంకయ్యనాయుడు అడిగినట్టు హోదా పదేళ్లు ఇవ్వక పోయినా, ఆనాటి ప్రధాని మన్‌మోహన్‌ ప్రకటించినట్టు కనీసం ఐదేళైనా ఇస్తారా? ఈ ప్రశ్నలకూ ఎవరి దగ్గరా సమాధానాలు లేవు. హోదా సాధనలో ముఖ్యంగా అధికార పక్షం కర్తవ్యం ఏమిటి? తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యునిస్టుల ప్రణాళికలేంటి? సమైక్య మేధావులు, ఎన్జీవోల వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హోదా తీసుకొస్తామని ప్రజల్ని నమ్మించిన వారంతా ఊరకుండిపోవాలా? పదవుల్లో, అధికారాల్లో తులతూగుతుంటారా? ఫలితంగా ప్రజాస్వామ్య దేశంలో, అత్యున్నత పార్లమెంట్‌ ఇచ్చిన హోదా హామీని, న్యాయ మైన హక్కులను వదులుకోవాలా? అంటే ఐదున్నర కోట్ల సీమాంధ్ర ప్రజలు మౌనంగా మిన్నకుండి పోవాలా? పాలకులు ప్రజల ఆకాంక్షలను, కోరికలను, న్యాయమైన హక్కులను కాలరాస్తున్నప్పుడు ప్రజలకు ఉద్యమాలే అంతిమ మార్గం. ఇలాంటి ఉద్యమాలను రాష్ట్ర రాజకీయ పక్షాలు నిర్మాణం చేస్తాయా? ప్రజల్ని చైతన్య పరచి నవ్యాంధ్ర సంజీవని సాధనకు నడుంకడతాయా? అధికార పక్షం అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఐక్యకార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఢిల్లీ పెద్దలపై తలపడతారా? 

సీమాంధ్రలోనూ ప్రజా వెల్లువలకూ, తెగింపు ఉద్యమాలకూ కొదవ లేదు. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా, నిజాం ప్రభువుకు నిరసనగా, తెంలగాణ సాయుధ పోరాటానికి సంఫీుభావంగా ఎన్నో చారిత్రక ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు త్యాగపూరిత ఉద్యమాలకు సీమాంధ్రకు చెందిన విద్యార్థులు, యువకులే నాయకత్వం వహించారు. కానీ, ప్రజల్లో ఉన్న అలాంటి ఉద్యమ స్ఫూర్తిని సీమాంధ్ర పాలకులే నిర్వీర్యం చేశారు. పోరాడకుండా ప్రజల్ని భ్రమల్లోకి నెట్టారు. దళారీలను, వైట్‌ కాలర్‌ సోకాల్డ్‌ నాయకులను ప్రోత్సహించి కృత్రిమ ఆందోళనలతో సరిపెట్టారు. ప్రజల్లో నుంచి ఉద్యమాలను, నాయకులను పుట్టకుండా చేశారు. కోరిక న్యాయమైనదే అయినా భవిష్యత్‌ మార్గం సుగమనం చేసేదే ఐనా ప్రజల్ని ప్రేక్షకులుగా మిగిల్చారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు తమిళనాడు, తెలంగాణ తరహాలో అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించే వరకు హోదా ఒక ఓట్ల జాతర అంశంగానే ఉంటుంది. రాజకీయ పార్టీలకే సంజీవనిగా చలామణి అవుతుంది. హోదా సాధనలో విశ్వసనీయత ఉండాలని చెప్పిన వైకాపా ఆ దిశగా హోదాను సాధించలేక పోతే, కాలం గడిచే కొద్దీ హోదా సాధన వైఫల్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతిమంగా ప్రజలు నిద్రాణ స్థితిని వీడి బలమైన ప్రజా ఉద్యమం నిర్మిస్తేనే హోదా సాధ్యం.

పోతుల బాలకోటయ్య

(ఫిబ్రవరి 20: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన రోజు)

Updated Date - 2020-02-20T09:11:26+05:30 IST