Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే..

ఎవరికీ హాని చేయలేదు.. నేనేంటో రామకృష్ణకు తెలుసు

ఇరవై ఏళ్ల పాటు సిగరెట్లు తాగాను.. శైలజకు 75 మార్కులు వేస్తాను

ఒక్క శంకరాభరణం సినిమాకే ప్రత్యేకంగా ప్రాక్టీసు చేశా

ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు మాత్రమే గాత్రం మార్చా.. 

కృష్ణ గారితో ఫోన్‌లో వివాదం.. మూడేళ్ల తర్వాత మళ్లీ కలిశాం

ఒక రకంగా నేనే మా పిల్లలకు శాపమేమో..

ఓపిక ఉన్నంత వరకు పాడుతూనే ఉండాలనేది నా ఆశ

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 37వేల పాటలు పాడిన గానగంధర్వుడు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. చదువు కావాలా.? పాట కావాలా..? అని తండ్రి అడిగితే పాటనే ఎంచుకున్నారాయన.. ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తన అనుభవాలూ జ్ఞాపకాలూ మనసులో మాటల్ని 17-01-2012న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పంచుకున్నారు. ఆ కార్యక్రమ విశేషాలు...


ఆర్కే: మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి

ఎస్పీ: శ్రుతిలయలే జననీ జనకులు కాగా..


ఆర్కే: అప్పటికీ ఇప్పటికీ మీ స్వరం మార్పు లేకుండా సాగిపోతోంది.. ఎలా సాధ్యమయింది?

ఎస్పీ: నా జీవితం వింతైనది. నిజానికి నాకు సంగీతం రాదు. ఇంజనీరు కావాలని కలలు కని గాయకుణ్నయ్యా. ఒక్క ‘శంకరాభరణం’ సినిమాకు పాడే విషయంలో ప్రత్యేకించి ప్రాక్టీసు చేశాను. ఐస్‌వాటర్‌ తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు.. లాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేదు. 20 సంవత్సరాలపాటు సిగరెట్లు తాగాను. గాయకుడిగా ఏ నిబంధనలు పెట్టుకోలేదు. 40 సంవత్సరాలుగా రోజుకు 10 గంటలపాటు పాడుతూ వచ్చాను. అదే నా ప్రాక్టీసు. స్వరపేటికకు రెండుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా పాడుతూనే ఉన్నాను. ఇదంతా విధిరాత అనుకుంటాను. 36 వేల నుంచి 37 వేల పాటలు పాడిఉంటాను. కానీ ఎంత పొందానో, అంతగా కోల్పోయింది కూడా ఉంది.


ఆర్కే: మీ గాడ్‌ఫాదర్‌ ఎవరు?

ఎస్పీ: కోదండపాణిగారు. మద్రాసులో ఇంజనీరింగ్‌ చదివేసమయంలో జాతీయ నాటక సంగీత పోటీలు జరిగాయి. ఘంటసాల, పెండ్యాల, దక్షిణామూర్తి మాస్టార్లు జడ్జీలు. సినిమాపాటలు కానివి పాడమంటే పాడాను. అక్కడే ఉన్న కోదండపాణి నా పాట విని.. ‘సినిమాలకు పాడుతావా?’ అని అడిగారు. మొదట పాడనన్నాను. ఆ తరువాత ఆయనే నాకు ‘మర్యాదరామన్న’లో తొలి అవకాశం ఇచ్చారు. నా చదువుకు ఇబ్బంది కలగడంతో నాన్నగారి అభిప్రాయం అడిగాను. జోడు గుర్రాల మీద స్వారీ లేకుండా ఏదైనా ఒకటే ఎంచుకోమన్నారు. నేను పాటలే ఎంచుకున్నాను.


ఆర్కే: మద్రాసు పోటీల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పిన పాట?

ఎస్పీ: ‘‘రాగము, అనురాగము, జీవన రాగములౌగా..’’ అనే పాట. ‘మర్యాద రామన్న’లో పాడింది ‘‘ఏమి ఈ వింత మోహం..’’. నా గానం గురించి తెలిసి ఎమ్మెస్‌ రెడ్డి గారు ‘కాలచక్రం’ డబ్బింగ్‌ సినిమాలో పాటలు అన్నీ పాడే అవకాశం ఇచ్చారు.


ఆర్కే: హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఎలా పాడగలిగారు?

ఎస్పీ: నేను అందరికీ గాత్రం మార్చి పాడలేదు. అల్లురామలింగయ్యకు, రాజబాబుకు వారివారి గాత్రాలకు దగ్గరగా పాడాను. ఎన్టీయార్‌, ఏఎన్నార్‌లకు గాత్రం మార్చాను. మిగిలిన వారికి మామూలుగానే పాడాను.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే..

రామకృష్ణ నాకు తమ్ముడులాంటి వాడు


ఆర్కే: తనను దెబ్బతీసేందుకు మీరు చక్రవర్తిని ప్రోత్సహించారని రామకృష్ణ అన్నారు. దీనికి మీ బదులేమిటి?

ఎస్పీ: పేపర్లో చదివాను. ఇలాంటి వాటిమీద కామెంట్‌ చేయను. రామకృష్ణ నాకు తమ్ముడులాంటి వాడు. నిజమేమిటో అతడికి తెలుసు, నాకు తెలుసు, పరిశ్రమకు తెలుసు.


ఆర్కే: ఇప్పటి గాయకులు పాడుతుంటే పాట ఏమిటో తెలీదు. ఎవరికి పాడుతున్నారో తెలీదు..

ఎస్పీ: దురదృష్టమండీ. ఎక్కువ గాయకులయ్యారు, ఎక్కువమంది ఆర్టిస్టులయ్యారు. కానీ గాత్రం గుర్తులేకుండా పోయింది. కానీ ఇపుడున్నవారిలోనూ టాలెంట్‌ ఉంది. వారిలో ముగ్గురు, నలుగురిని ఎంపిక చేసుకుని వారితోనే ఎక్కువ పాటలు పాడించాలి. వారిని సీనియర్ల దగ్గర పనిచేయించాలి. అప్పుడు పాట బాగుపడుతుంది.


ఆర్కే: సినిమారంగంలో కులం పాత్ర ఏంటి?

ఎస్పీ: ఈ రంగంలో కులగజ్జి పెరిగిపోయింది. కులాలపేర్లన్నీ బయటికి వచ్చేశాయి. నిర్మాతలకు గౌరవం లేదు.


ఆర్కే: కృష్ణగారితో వివాదం ఏంటి?

ఎస్పీ: ఒక సంస్థనుంచి నాలుగైదేళ్లయినా బకాయిలు రాకపోవడంతో, ఫోన్‌ చేసి నిర్మాతను అడిగాను. దురుసుగా మాట్లాడారు. దాంతో నేను ఫోన్‌ పెట్టేశాను. ఆ తరువాత కృష్ణ ఫోన్‌ చేసి, ‘‘మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్‌ కావన్నారట.. మీ డబ్బులు వెంటనే పంపుతాను. మీ తరఫున మిత్రుడొకరు నాకు 20వేలు బకాయి ఉన్నారు కదా? అది వెంటనే పంపండి’’ అని ఫోన్‌ పెట్టేశారు. ఆయన చెక్కు పంపారు. నేను కూడా 20వేలు పంపేశాను. రెండు, మూడేళ్లు ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత వేటూరి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేశారు. నేను పద్మాలయ ఆఫీసుకు వెళ్లి గతంలో జరిగినదాని గురించి కృష్ణకు వివరించబోగా.. ‘‘అదంతా మరచిపోండి, మళ్లీ కలిసిపనిచేద్దాం’’ అన్నారు.


ఆర్కే: ఉన్నతదశకు వచ్చిన తరువాత కొందరిని మీరు ఎదగనివ్వలేదని ఆరోపణ...

ఎస్పీ: ఎవరికీ నేను హాని చేయలేదు. ఇలాంటివి విని చాలా బాధపడ్డాను.


ఆర్కే: శైలజకు ఎన్ని మార్కులు వేస్తారు?

ఎస్పీ: 75 మార్కులు వేస్తాను. అయితే మిగిలినవారిని ప్రోత్సహించినట్లు శైలజను, మా అబ్బాయిని నేను ప్రోత్సహించలేదని మా ఆవిడ ఆరోపణ. ఒక రకంగా నేనే వారికి శాపమేమో.


ఆర్కే: మీ పిల్లల గురించి..

ఎస్పీ: అమ్మాయి గృహిణి. బాధ్యతల వల్ల పాడడం మానేసింది. మా అబ్బాయి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. సంగీతం అన్నాడు. నటన అన్నాడు. సినిమాలు తీస్తా అన్నాడు. 5 సినిమాలు తీశాడు. 11 కోట్లు పోయాయి. ఇంకా సినిమాలు తీసేపనిలో ఉన్నాడు. బాగా కృషి చేస్తున్నాడు. మా అమ్మాయికి, అబ్బాయికీ కూడా కవలపిల్లలు. అది తెలిసి కొందరు నన్ను ‘కవలల తాతయ్య’ అంటారు.


ఆర్కే: మిగిలిన కోరిక?

ఎస్పీ: చావంటే తెలియకుండా కన్నుమూయాలి. ఓపిక ఉన్నంతవరకు పాడుతుండాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.