Abn logo
Sep 26 2020 @ 00:25AM

ఎడతెగని పాట

రెహమాన్‌ చెప్పినట్టు, అతను తన అద్భుతమైన స్వరంతో మనకు అమితమైన ఆనందాన్నిచ్చాడు. సంగీతంలో ఓలలాడే, విశ్రమించే, ఆనందించే గొప్ప అవకాశాన్నిచ్చాడు. అక్షరాలను గుండెగొంతుకతో ఆలపించి ఉద్వేగాలను వెదజల్లాడు. ఐదు దశాబ్దాల కాలానికి అనేక అలవరసల నేపథ్యగీతాన్ని ఆలపిస్తూ అర్థాంతరంగా అతను విశ్రమించాడు. గంధర్వలోకానికి తిరిగి వెళ్లిపోతూ, మన మనసుల్ని ముక్కలు చేశాడు.


దక్షిణాది శ్రోతలందరికీ, ముఖ్యంగా తెలుగువారికి గురువారం సాయంత్రం నుంచి ఒక సన్నటి భయసంగీతం లోలోపల సుడులు తిరుగుతూనే ఉన్నది. యాభైరోజులుగా తమ అభిమాన గాయకుడు విజేతగా తిరిగివస్తాడని నిర్మించుకున్న నమ్మకం, తమ ప్రార్థనలతో అతని యుద్ధంలో తామూ భాగమైపోయిన అభిమానం– నిష్ఫలమవుతున్నాయన్న తెలివిడి, ఎడతెగని అపశ్రుతి వలె, దుర్వార్తను సూచించే అపశకునం వలె కలవరపెడుతూనే ఉన్నది. శుక్రవారం మధ్యాహ్నానికి అర్థమైపోయింది. ఆ తరువాత ప్రకటన ఒక లాంఛనం మాత్రమే. 


శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీవిత విశేషాలను, అధిగమించిన అవరోధాలను, అధిరోహించిన శిఖరాలను, అగణిత గణాంకాలను వల్లెవేయవలసిన పనే లేదు. కోట్లాది హృదయాలు అశ్రుసిక్తమవుతున్నప్పుడు, పరిచయం ఒక పునరుక్తి. 


అసమాపక క్రియ దగ్గర నిలిచిపోయిన ప్రయాణాన్ని అంచనావేయడం కష్టం. బాలసుబ్రహ్మణ్యం చేయాలనుకున్నది ఎంతో ఉన్నది. చేయగలిగింది, చేయవలసింది చాలా ఉన్నది. ఆయన గొంతుకే కాదు, కాలికీ, మనసుకీ కూడా విశ్రాంతి లేదు. అతను గాయకుడు, సంగీతదర్శకుడు, నటుడు, గాత్రదాత, ప్రయోక్త, వక్త, అంతే కాదు, పాటను ఒక జెండాగా ధరించి ప్రచారం చేసిన సంగీత కార్యకర్త. ఆయన సినిమాపాటలు తగ్గిపోయి రెండు దశాబ్దాలు కావస్తున్నది కానీ, ఆయన వేదిక నుంచి వైదొలగలేదు. విస్మృతిలోకి జారిపోలేదు. నిత్యం అతను పాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. కనిపిస్తున్నాడు.


ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి గాయక దిగ్గజం తెలుగు సినీసంగీత ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోజుల్లోనే బాలసుబ్రహ్మణ్యం ఇరవయ్యేళ్ల బాలుడిగా రంగప్రవేశం చేశాడు. అప్పటి వరకు సినీగాయకుల కోవలోని గొంతు కాదది. మృదువైన, మెత్తటైన, తియ్యటి స్వరం. అది కొందరికి ఆకర్షణీయంగా అనిపించింది. కొందరికి విముఖత కలిగించింది. ఘంటసాల అనంతరం తనకు ఆమోదాన్ని సాధించుకోవడానికి బాలసుబ్రహ్మణ్యం చాలా కష్టపడ్డాడు. సంప్రదాయ సంగీత శిక్షణ లేని బాలు, కేవలం సాధన ద్వారానే పాటలో రాటుదేలాడు. అనుభవమే ఆయనకు ఎంతో నేర్పింది. శంకరాభరణం సినిమా కోసం కొంత కష్టపడ్డాడు, ఆ తరువాత కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు. శంకరాభరణం ఆయనకు జాతీయ బహుమతిని తెచ్చిపెట్టింది. బాలు అలవోకగా కాక, కష్టపడి పాడగలిగిన పాటలు సినిమారంగంలో అరుదుగానే వచ్చాయి. అయినా ఆయన తన విద్యను పెంచుకుంటూనే ఉన్నారు. తరువాతి తరానికి పంచుతూనే వచ్చారు. ఆయన టెలివిజన్‌ కార్యక్రమాలను, బహిరంగ ఉపన్యాసాలను విన్నవారికి, బాలు అనుభవ పాండిత్యం, శాస్త్రీయ సంగీత పరిచయం అర్థమవుతాయి. ప్రతిభ, అభ్యాసం– ఆయనకు వ్యుత్పత్తిని కూడా అందించాయి. 


బాలసుబ్రహ్మణ్యం గానజీవితం ఆరంభించిన రోజులు తెలుగులో తొలితరం క్లాసికల్‌ సినిమాలు అంతరిస్తున్న కాలం. సినిమాలలో వేషభాషలు, అభిరుచులు, వ్యక్తీకరణలు, కథనాలు అన్నీ మారుతున్న కాలం అది. పాటల్లో సాహిత్యం కంటె లయకు, దృశ్యానికి ప్రాధాన్యం పెరగసాగింది. సాహిత్యం కూడా కొత్త వ్యక్తీకరణలతో, కొత్త తరపు నుడికారాలతో రావడం మొదలయింది. మారుతున్న కాలానికి పనికివచ్చే లాలిత్యంతో, వేగాన్ని, కొత్త తరపు ధోరణులను పలికే గొంతుతో బాలు సహజంగానే వేదికను ఆక్రమించాడు. కాలం కోరినట్టే ఇళయరాజా వంటి సంగీతదర్శకులు కొత్తరకం బాణీలను కట్టారు. ఇప్పుడు నలభైల్లో, యాభైల్లో ఉన్నవారందరి కౌమార యవ్వన సంవత్సరాలు బాలూ పాటలతో ఉర్రూతలూగినవే. బాలూ నిష్క్రమణ వర్తమాన దుఃఖాన్నే కాదు, గతకాలపు బెంగను కూడా రగిలిస్తున్నది అందుకే. 


బాణీ, సాహిత్యం నిర్దేశించే గానానికి మించి, సొంతంగా గాయకుడు కొంత విలువ జోడించాలని నమ్మే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. పాడుతున్న క్రమంలోనే, అప్పటికప్పుడు మార్పులు చేయడం ఆయనకు అలవాటు. అది అనేక సందర్భాలలో ఆయనకు ఉపకరించింది. నాటి అగ్రనటులు ఎన్‌టిఆర్‌, ఎఎన్నార్‌లు ఇద్దరికీ, ఎవరికి వారికి నప్పేటట్టుగా బాలు పాడగలిగారు. ఆ ఇద్దరి విషయంలో ఘంటసాల కూడా ఆ పని చేశారు కానీ, సీనియర్‌ నటులు కృష్ణ దగ్గర నుంచి మొదలుకొని చిరంజీవి దాకా అందరికీ తన గొంతును అతికించగలిగిన ఘనత మాత్రం చెప్పుకోదగ్గదే. గాయకులు కేవలం పాడడం కాదు, గొంతుతో నటించాలి కూడా అంటారు ఆయన. స్వరనటుడిగా ఆయన అనేక అనువాద చిత్రాలలోను, సూటి చిత్రాలలోను కూడా మేటి నటులకు గొంతునిచ్చారు. ఆయన సమయోచిత, పాత్రోచిత వాచకం అపూర్వం. 


సినిమారంగం, సినీగాయకులు వ్యాపార కళాప్రపంచానికి చెందినవారు. మార్కెట్‌ శక్తులు అక్కడి కళలను, కళాకారులను కూడా కట్టడిచేస్తాయి. ఆయా పరిమితులన్నిటికి లోబడి, వ్యాపార కళలలోని జనరంజకత్వం ప్రజాసామాన్యాన్ని ఆకర్షిస్తుంది. ప్రజలు వ్యక్తం చేయలేని భావాలకు, ఉద్వేగాలకు సినిమా ఒక ఆలంబన. జీవితాల్లో ఉండే అన్ని సందర్భాలకు తగిన మాటలు, పాటలు, అభినయాలు ఈ సమాంతర కళాప్రపంచంలో లభిస్తాయి. ఉత్తమశ్రేణి సినిమాగాయకులకు ఉన్న ప్రాసంగికత అదే. కళల తోడు లేకుండా జీవితం ఉండదు. అనేక సందర్భాలలో మనలను స్పందింపజేసే సాహిత్యం ఒక అమృత స్వరపేటిక గుండా జాలువారి మనసులను స్పృశిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం కొన్ని తరాల యువకులకు ఆస్థానగాయకుడు. వారి ఉద్వేగాలకు గొంతునిచ్చినవాడు. 


అందుకే కదా, ఇంతటి దుఃఖం!

Advertisement
Advertisement