Abn logo
Jun 19 2021 @ 00:42AM

సమ ప్రాధ్యానం లేని దక్షిణ భారతం

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న ప్రతిపాదన ఒకటి పరిశీలనలో ఉన్నది. అదే గనుక అమలయితే కేంద్రప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలపై కేరళ, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు చూపే కొద్దిపాటి ప్రభావం మరింతగా సన్నగిల్లిపోతుంది. అభివృద్ధి, సంక్షేమాలను అలక్ష్యం చేసిన ఉత్తరప్రదేశ్, బిహార్ మొదలైన రాష్ట్రాలు భారత ప్రభుత్వంలో తమ గణనీయమైన పలుకుబడిని మరింతగా పెంచుకుంటాయి. అధికమవనున్న ఈ అసమానతలు మొదటినుంచీ సున్నితమైన మన సమాఖ్య విధానంపై కొత్త భారాలు, ఒత్తిళ్లను మోపుతాయి.


‘భారత గణతంత్ర రాజ్య వ్యవహారాలలో దక్షిణ భారతావనికి సముచిత ప్రాధాన్యం లభించడం లేదు. దక్షిణాది రాష్ట్రాలలో పౌరజీవనంలో హింసాకాండ సాపేక్షంగా స్వల్పం. ముస్లింల పట్ల అసహనమూ తక్కువే. క్రమశిక్షణారాహిత్యం పెద్దగా ఉండదు. అరాచకానికి ఆస్కారం లేని విశ్వవిద్యాలయాలు, మెరుగైన విద్యాప్రమాణాలు, ఉత్కృష్ట పాలనా పద్ధతులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, అవినీతి రాహిత్యం, హిందూ పునరుద్ధరణ వాదం పట్ల లోపించిన ఆసక్తి దక్షిణ భారతావనికి ఒక ప్రత్యేకతను కల్పించాయి. మరి ఈ రాష్ట్రాలకు జాతీయ వ్యవహారాలలో ప్రాధాన్యం లేకపోవడం భారత్‌కే నష్టదాయకం. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడమే’. 


ఈ ఆసక్తికర వ్యాఖ్యలు 1966లో వెలువడిన ‘నెహ్రూ: ఏ కాంటెంపరరీ ఎస్టిమేట్’ అన్న పుస్తకం లోనివి. రచయిత వాల్టెర్ క్రోకెర్ ఆస్ట్రేలియన్ దౌత్యవేత్త. 1960వ దశకంలో మనదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా పని చేశారు. భారత ప్రథమ ప్రధానమంత్రిపై తన నిష్పాక్షిక అంచనాలో భాగంగా క్రోకెర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఔచిత్యాన్ని కలిగిఉన్నాయి.


క్రోకెర్ పుస్తకం వెలువడిన అర్ధశతాబ్ది అనంతరం ఆర్థికవేత్తలు శామ్యూల్ పాల్, కళా సీతారామ్‌ శ్రీధర్‌లు ‘ది పారడాక్స్ ఆఫ్ ఇండియాస్ నార్త్–-సౌత్ డివైడ్’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆర్థికాభివృద్ధిలో ఉత్తర భారతావని కంటే దక్షిణ భారతావని గణనీయంగా పురోగమించిందని శామ్యూల్, శ్రీధర్‌ వాదించారు. చాలవరకు అధికారిక గణాంకాలపై ఆధారపడి వారు ఆ అభిప్రాయానికి వచ్చారు. వారు తమ అధ్యయనాన్ని రెండురీతుల్లో నిర్వహించారు. తొలుత దక్షిణాదిలో ప్రధాన రాష్ట్రమైన తమిళనాడును, ఉత్తరాదిన ప్రధాన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పోల్చి చూశారు. ఆ తరువాత నాలుగు దక్షిణాది రాష్ట్రాలు–తమిళనాడు, కర్ణాటక, అవిభక్త ఆంధ్రప్రదేశ్, కేరళను నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు -ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పోల్చి చూశారు. వారు పరిగణనలోకి తీసుకున్న డేటా 1960తో ప్రారంభమయింది. ఆ తొలి సంవత్సరంలో తమిళనాడులో సగటు తలసరి ఆదాయం ఉత్తరప్రదేశ్‌లో కంటే 51శాతం అధికంగా ఉంది. 1980 దశకం తొలినాళ్లలో ఆ తేడా 39 శాతానికి తగ్గింది. దరిమిలా ఆ అంతరం శీఘ్రగతిన పెరిగింది. 2005లో తమిళనాడులో నివశించే వారి సగటు తలసరి ఆదాయం ఉత్తరప్రదేశ్‌లో నివశించే వారి తలసరి ఆదాయం కంటే 128 రెట్లు ఎక్కువ. ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న సమాచారం ప్రకారం 2021లో ఆ ఆదాయ వ్యత్యాసం దాదాపు 300 శాతానికి పెరిగింది. 


రెండు అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయి. అవి: మహిళా అక్షరాస్యత, శిశు మరణాలు, జీవిత పరిమాణం మొదలైన మానవాభివృద్ధి సూచకాలు; ఆర్థికాభివృద్ధికి కీలకమైన సాంకేతిక విద్య, విద్యుదుత్పత్తి, రహదారుల విస్తరణ, నాణ్యత. మానవాభివృద్ధి అంశాలలో పురోగతి ఆధునిక ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన సుశిక్షిత, ఆరోగ్యవంతులైన సిబ్బందిని సమకూర్చగా సాంకేతిక విద్యలో పురోగతి ఉత్పాదక సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంపొందించింది. పాలనాపరమైన సూచకాలలో కూడా దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల, ఆసుపత్రుల నిర్వహణ నాణ్యంగా ఉంది. చదువును మధ్యలో ఆపివేసేవారి సంఖ్య తక్కువ కాగా ఆసుపత్రులలో అవసరాల మేరకు డాక్టర్లు ఉండడమే కాకుండా వైద్యసామగ్రి నిల్వలకు లోటు లేదు. ఉత్తరాది పట్టణాలలోని మురికివాడల కంటే దక్షిణాది పట్టణాలలోని మురికివాడలు పరిశుభ్రత, తాగునీరు మొదలైన సదుపాయాలలో అన్నివిధాల మెరుగ్గా ఉన్నాయి. 


ఉత్తరాది-–దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం సాపేక్షంగా ఇటీవలి పరిణామమేనని శామ్యూల్, శ్రీధర్ నిర్ధారించారు. ఇప్పుడు విశ్వసించడం కష్టమే కావచ్చు గానీ 1960లో గ్రామీణ పేదరికం ఉత్తరప్రదేశ్‌లో కంటే తమిళనాడులోనే అధికంగా ఉంది. 1980వ దశకం నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే అన్నివిధాల ముందంజ వేయడం ప్రారంభమయింది. 1990ల నుంచి వీటి అభివృద్ధిలో అంతరాలు వేగవంతమయ్యాయి. 


శామ్యూల్, శ్రీధర్‌ల అధ్యయనం గణాంకాల ఆధారంగా జరిగింది. సామాజికశాస్త్ర పరమైన విశ్లేషణల జోలికి వారు పోలేదు. దక్షిణాదిలో సాంఘిక సంస్కరణల ప్రాధాన్యాన్ని కూడా వారు సూచనప్రాయంగా మాత్రమే ప్రస్తావించారు. హిందూ-–ముస్లిం ఘర్షణలు దాదాపుగా లేకపోవడమనే వాస్తవాన్ని సైతం వారు ప్రస్తావించనే లేదు. అయినప్పటికీ సామాజిక అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సాంఘిక, సాంస్కృతిక అంశాలు కీలకమైనవి. తమ అధ్యయనం స్వభావం, పరిమితుల దృష్ట్యా క్రోకెర్ పుస్తకాన్ని వీరిరువురు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఆస్ట్రేలియన్ దౌత్యవేత్త ప్రధానంగా ఎత్తిచూపిన సాంస్కృతిక అంశాలు, ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధి పథాలలో తేడాలను అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తాయి.


1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు వాటి వల్ల బాగా లబ్ధి పొందాయి. నైపుణం కలిగిన ఆరోగ్యదాయక కార్మికశక్తి అధికంగా ఉండడమే ఇందుకు కారణం. గత శతాబ్ది చివరి దశకం, ఈ శతాబ్ది ప్రథమ దశకంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఫ్యాక్టరీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, సాఫ్ట్‌‌వేర్ పార్క్‌లు, ఫార్మాసూటికల్ సంస్థల ఏర్పాటు ముమ్మరమవగా ఉత్తరప్రదేశ్, బిహార్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాలు ఎడతెగని మతతత్వ ఘర్షణలు, కుల వైషమ్యాలలో చిక్కుకున్నాయి. రామ జన్మభూమి ఉద్యమం, హిందూత్వ అఘాయిత్యాలు ఉత్తరాది రాష్ట్రాలను కుదిపివేశాయి. దక్షిణాదిలో వీటి ప్రభావం మొత్తంగా కాకపోయినప్పటికీ ఇంచుమించు చాలా తక్కువ. 


ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల కంటే అన్ని విధాల ముందంజ వేయడానికి కారణాలేమిటో అర్థం చేసుకోవడానికి చరిత్రను కూడా లోతుగా అవలోకించవలసి ఉంది. సముద్రతీర ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాలకు విదేశీయులు దురాక్రమణదారులుగా కాకుండా వ్యాపారులు, యాత్రికులుగా వచ్చేవారు. దాంతో పరప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్కపటంగా వ్యవహరించడం దక్షిణాది ప్రజలకు శతాబ్దాల పూర్వం నుంచే అలవడింది. దేశ విభజన భయానక సంఘటనలు ఏవీ దక్షిణ భారతావనిలో సంభవించలేదు. వాటి బాధాకర స్మృతుల ప్రభావం దక్షిణాది ప్రజలపై ఏ మాత్రం లేదు. 


సాంఘికరంగంలో బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక ఉద్యమాలు ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే తొలుత ప్రారంభమయ్యాయి. శ్రీనారాయణ గురు, పెరియార్ మొదలైన సంస్కర్తలు కులం, జెండర్ విషయాలలో సమతావాదాన్ని ప్రజల మనస్సుల్లో నెలకొల్పారు. అయితే, దక్షిణాది రాష్ట్రాలలో అన్ని రంగాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు లేవు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో దళితులు ఎదుర్కొంటున్న అణచివేత ఆ రాష్ట్రానికి ఒక సిగ్గుచేటైన విషయం. కర్ణాటకలో హిందుత్వ శక్తుల ప్రాబల్య, ప్రభావాలు క్రమంగా పెరుగుతున్నాయి. వాటి పర్యవసానాలు ఆరోగ్యకరంగా లేవు. 1960 దశకంలో దక్షిణాది రాష్ట్రాలలో అవినీతి సాపేక్షంగా చాలా తక్కువే అయినప్పటికీ ఆర్థిక సంస్కరణల అనంతరం హైదరాబాద్, బెంగలూరు, చెన్నైలలోని రాజకీయవేత్తలు అక్రమార్జనలలో ఉత్తరాదిలోని వారికి ఏమీ తీసిపోవడం లేదు. అయినప్పటికీ జాతీయ ఆర్థికవ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర భారతావని కంటే అధికంగా దోహదం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదాయంలోనూ దక్షిణాది నుంచి సమకూరేదే అధికం. 


ఆర్థికాభివృద్ధి విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉన్నాయి. ఈ పురోగతికి క్రోకెర్ సూచించిన సాంఘిక, సాంస్కృతిక అంశాలు, ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యం, మెరుగైన పాలనా ప్రమాణాలు, హిందూ పునరుద్ధరణ వాదంలో అనాసక్తి విశేషంగా తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. దక్షిణ భారతావని అద్భుతమైన సామాజిక అభ్యున్నతి, ఆర్థిక పురోగతి సాధించినప్పటికీ కేంద్రస్థాయిలో ఇప్పటికీ దానికి అంతగా ప్రాధాన్యం లేకపోవడం కొనసాగుతూనే ఉంది. ఉన్న ప్రాధాన్యం కూడా త్వరలో మరింత తగ్గిపోవచ్చు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న ప్రతిపాదన ఒకటి పరిశీలనలో ఉన్నది. అదే గనుక అమలయితే కేంద్రప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలపై (ప్రజలకు శ్రేయో పాలన నందించిన) కేరళ, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు చూపే కొద్దిపాటి ప్రభావం మరింతగా సన్నగిల్లిపోతుంది. అభివృద్ధి, సంక్షేమాలను అలక్ష్యం చేసిన ఉత్తరప్రదేశ్, బిహార్ మొదలైన రాష్ట్రాలు భారత ప్రభుత్వంలో తమ గణనీయమైన పలుకుబడిని మరింతగా పెంచుకుంటాయి. అధికమవనున్న ఈ అసమానతలు మొదటినుంచీ సున్నితమైన మన సమాఖ్య విధానంపై కొత్త భారాలు, ఒత్తిళ్లను మోపుతాయి.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)


ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...