Beach Umbrella: గాలికి ఎగిరొచ్చి ఛాతిలో దిగబడ్డ గొడుగు..! మహిళ మృతి

ABN , First Publish Date - 2022-08-12T21:37:10+05:30 IST

గొడుగుకున్న కడ్డీ ఛాతిలో దిగబడటంతో ఓ మహిళ(63) అనూహ్య రీతిలో మృతి చెందింది. అమెరికాలోని సౌత్ కెరొలీనా రాష్ట్రంలో(South Carolina) బుధవారం ఈ దారుణం జరిగింది.

Beach Umbrella: గాలికి ఎగిరొచ్చి ఛాతిలో దిగబడ్డ గొడుగు..! మహిళ మృతి

ఎన్నారై డెస్క్: గొడుగుకున్న కడ్డీ ఛాతిలో దిగబడటంతో ఓ మహిళ(63) అనూహ్య రీతిలో మృతి చెందారు. అమెరికాలోని సౌత్ కెరొలీనా రాష్ట్రంలో(South Carolina) బుధవారం ఈ దారుణం జరిగింది. గార్డెన్ సిటీ బీచ్‌లో(Garden city Beach) టామీ పెరాల్ట్ సేద తీరుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. సముద్రం తీరంలో ఒక్కసారిగా పెనుగాలి వీచడంతో సమీపంలోని ఓ గొడుగు ఎగిరొచ్చి ఆమె ఛాతిలో దిగబడిందని తెలిపారు. గొడుగుకు ఉన్న కడ్డీ గుచ్చుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కొందరు వైద్యులు టామీ పెరాల్ట్‌కు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. టైడ్‌ల్యాండ్స్ వాకమా కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ‘‘ఆమె మరణం తమ ప్రాంత వాసులకు తీరని లోటు’’ అని హోర్రీ కౌంటీ ఎమర్జెన్సీ ప్రతినిధి థామస్ బెల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ కష్టసమయంలో మృతురాలి కుటుంబసభ్యులకు దేవుడు మనశ్శాంతి ప్రసాదించాలని కోరుకున్నారు.


కాగా.. బీచ్‌లలో(Beach) వాడే గొడుగుల కారణంగా మరణాలు సంభవించడం అసాధారణమేమీ కాదని స్థానిక అధికారులు తెలిపారు. గొడుగులకు ఉన్న కడ్డీల కారణంగా గాయాలు అయ్యే అవాశం ఉందని చెప్పారు. సముద్రతీరంలో భారీ గాలులకు కొట్టుకొచ్చే గొడుగులు ఒక్కోసారి ప్రాణాంతక ఆయుధాలుగా కూడా మారతాయని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ గొడుగుల కారణంగా ఏటా 3 వేల మంది గాయాల పాలవుతుంటారు. 2016లో వర్జినీయా బీచ్‌లో సేదతీరుతున్న లాటీ మిషెల్ బెల్క్ కూడా ఇదే రీతిలో మరణించింది. దాంతో.. బీచ్‌లో వాడే గొడుగుల విషయంలో భద్రతా నిబంధనలు సమీక్షించాలని స్థానిక ప్రభుత్వం తయారీ దారులను ఆదేశించింది. 

Updated Date - 2022-08-12T21:37:10+05:30 IST