దేశంలో నువ్వే సంపన్నురాలివమ్మా!

ABN , First Publish Date - 2021-05-14T08:46:39+05:30 IST

‘ఒకరి కష్టాలు చూసేందుకు కళ్లే ఉండాల్సిన అవసరం లేదు. మనసు ఉంటే చాలు’... అని నిరూపించింది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లికి చెందిన బొడ్డు నాగలక్ష్మి! 23 ఏళ్ల ఆ అంధు

దేశంలో నువ్వే సంపన్నురాలివమ్మా!

తన ఫౌండేషన్‌కు 15 వేలు పింఛను డబ్బులు విరాళమిచ్చిన అంధురాలికి సోనూసూద్‌ ప్రశంస

వరికుంటపాడు, మే 13: ‘ఒకరి కష్టాలు చూసేందుకు కళ్లే ఉండాల్సిన అవసరం లేదు. మనసు ఉంటే చాలు’... అని నిరూపించింది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లికి చెందిన బొడ్డు నాగలక్ష్మి! 23 ఏళ్ల ఆ అంధురాలు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు రూ.15 వేలు విరాళం ఇచ్చింది. ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ.. దివ్యాంగురాలైన తనకు వస్తున్న పింఛను మొత్తాన్ని ఐదు నెలలుగా దాచుకుంటూ... ఇప్పుడు పరులకోసం ఇచ్చేసింది. సోనూ తన ఫౌండేషన్‌కు విరాళాలు కోరినట్లు తన సోదరుడు ఆదినారాయణరెడ్డి ద్వారా తెలుసుకున్న వెంటనే ఇలా స్పందించింది. ఈ విషయం తెలిసి సోనూసూద్‌ ఆమె మంచి మనసుకు చలించిపోయారు. ఆమెతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ప్రశంసించారు. తన ట్విటర్‌ ఖాతాలోనూ నాగలక్ష్మి పెద్దమనసును కొనియాడారు. ‘ఒక అంధురాలు, యూట్యూబర్‌ నాగలక్ష్మి నా ఫౌండేషన్‌కు రూ.15వేలు విరాళం ఇచ్చారు. ఇది ఆమె ఐదు నెలల పింఛను. నా దృష్టిలో దేశంలో ఆమే అత్యంత సంపన్నురాలు. ఒకరి కష్టాలు చూసేందుకు కంటిచూపు ఉండాల్సిన అవసరంలేదు’’ అని కీర్తించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నాగలక్ష్మి పుట్టుకతోనే అంధురాలు. 5వ తరగతి వరకే చదువుకున్న ఆమె ఇటీవలే ‘కవిత నాగ వ్లాగ్స్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ను స్థాపించి దానిద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ శరణాలయాలు, వృద్ధులు, పేదలకు అందిస్తోంది. ఆమె యూట్యూబ్‌ చానల్‌కు లక్ష మందికిపైగా సబ్‌స్రైబర్లు ఉన్నారు.

Updated Date - 2021-05-14T08:46:39+05:30 IST