Abn logo
Jul 22 2021 @ 03:13AM

ఎవరా సాంకేతిక సలహాదారు?

8 నెలల కిందట గుట్టుగా నియామకం 

సీనియర్‌ అధికారులకూ తెలియకుండా జీవో 

చక్రం తిప్పుతోన్న అధికారి ఒక్కరికే సుపరిచితుడు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఆయన... కేంద్ర సర్వీసుల్లో పనిచేసి రిటైర్‌ అయిన అధికారి. ఏపీతో ఏ సంబంధం లేని వ్యక్తి. ప్రజా పనుల విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన్ను... రాష్ట్రానికి చెందిన ఓ అధికారి ముచ్చటపడి తెచ్చుకున్నారు. ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా నియమింపజేశారు. ఏకంగా కేబినెట్‌ ర్యాంకు కూడా ఇప్పించారు. గుట్టుచప్పుడు కాకుండా ఆయన్ను నియమించి 8 నెలలు అయింది. ఇంతకీ ఆయనెవరో, ఎలా ఉంటారో రాష్ట్రంలోని అధికారులకూ తెలీదు. అప్పుడప్పుడు ఆన్‌ లైన్‌ మీటింగ్‌ అని మెసేజ్‌లు వచ్చినా అవేవీ జరగలేదని, ఆయన కనిపించిందే లేద ని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వసతి, సౌకర్యాలు, కేబినెట్‌ హోదా అనుభవించడం తప్ప ఆయన ఏపీకి చేసిందేమిటో ఎవరికీ తెలియడం లేదు. అయినా సరే... రాష్ట్ర అధికారికి ఆయనపై అంత ప్రేమ ఎందుకో గానీ, అలాగే కొనసాగిస్తున్నారు. ఇంతకూ ఆయన ఎవరంటారా...? ఆయన పేరు ప్రభాకర్‌ సింగ్‌. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక(టెక్నికల్‌) సలహాదారు. కేంద్ర ప్రజా పనుల విభాగంలో డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి 2018లో రిటైరయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఒక ఏడాది కొనసాగింపునిచ్చారు. గతేడాది నవంబరు 16న ఆయన ఏపీ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. ఏపీ భవన్‌లో ఆఫీసు, కారుతో పాటు ఒక రాష్ట్ర మంత్రికి ఉండే అన్ని సదుపాయాలు సమకూర్చి పెట్టారు. ఆయన సాంకేతికంగా నైపుణ్యం ఉన్న వ్యక్తి కావొచ్చు. అంతకుమించి ఆయనపైఆరోపణలు, విమర్శలు, కోర్టు ధిక్కార చర్యలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే, ఢిల్లీలో ఉండే ఆయనకు, ఏపీకి ఉన్న సంబంధమేంటి? 8నెలలుగా కేబినెట్‌ ర్యాంకు అనుభవిస్తూ ఆయన రాష్ట్రానికి చేసిన మేలు, సేవలేమిటన్నది చర్చనీయాంశంగా మారింది.


ఇంతవరకు చూడ లేదు 

ఏపీలో ఏకపక్షంగా చక్రం తిప్పుతోన్న ఓ అధికారి ముచ్చటపడి ప్రభాకర్‌ సింగ్‌ను తెచ్చుకున్నారని, ఆయనకు, ఈయన కు ఏవో లావాదేవీలు ఉండొచ్చని అధికారులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఆయన నియామకమే ఇప్పటి వరకూ చాలా గుట్టుగా ఉంచారు. జీవో.1791 గురించి ఇప్పటికీ ఆర్‌అండ్‌బీలోని సీనియర్‌ అధికారులకు కూడా తెలియదు. ‘‘ప్రభాకర్‌ సింగ్‌ పేరు ఒకటి రెండుసార్లు విన్నాం. ఓ అధికారి మీటింగ్‌లో ఈ ప్రస్తావన వచ్చింది. కానీ ఇంతవరకు ఆయన్ను చూడలేదు. ఆన్‌ లైన్‌ మీటింగ్‌ ఉంటుందని మెసేజ్‌లు వచ్చినప్పుడు కనిపిస్తారేమో అనుకున్నాం. కానీ ఆ మీటింగే జరగలేదు. ఇక ఆయన్ను చూసే అవకాశం రాలేదు’’ అని ఆర్‌అండ్‌బీలోని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. ప్రముఖ, విశిష్టమైన, దూరదృష్టి గల సాంకేతిక నిపుణుడిని సాంకేతిక సలహాదారుగా నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. అయితే, ప్రభాకర్‌ సింగ్‌ గురించి ఆరా తీసినప్పుడు క్యాట్‌ ఉత్తర్వులు ధిక్కరించిన కేసులో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొన్నారని ఢిల్లీ అధికారులు చెబుతున్నట్లుగా ఇక్కడి వారు వివరిస్తున్నారు. ప్రజా పనుల విభాగంలో అంతటి నిపుణుడైన వ్యక్తిని సలహాదారుగా నియమించుకుంటే రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, పురపాలకశాఖ పరిధిలో ఆయన సేవలను విరివిగా ఉపయోగించుకోవాలి. ఆయన సలహాలతో పనులు చేపట్టాలి. అయితే, ఆయా శాఖల్లోని సీనియర్‌ అధికారులే ఆయనెవరని ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఈ సలహాదారు రాష్ట్రానికి ఏం చేస్తున్నట్లు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.