జిల్లాలను పెంచాలనుకోవడం కరెక్ట్ కాదు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-10T19:35:09+05:30 IST

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల సంఖ్య పెంచాలనే యోచన కరెక్ట్ కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

జిల్లాలను పెంచాలనుకోవడం కరెక్ట్ కాదు: సోమిరెడ్డి

అమరావతి: పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల సంఖ్య పెంచాలనే యోచన కరెక్ట్ కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించవద్దని సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు కూడా డిమాండ్ చేశారు. విజయనగరం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం లాంటి జిల్లాలను విభజించి పెంచాల్సిన అవసరం లేదు. అనంతపురం, చిత్తూరు, గోదావరి లాంటి పెద్ద జిల్లాలను విభజించినా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అనడంలో న్యాయం లేదు. 2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాల హద్దులు మారిపోతాయి. అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా?, 1985కి ముందు పంచాయతీ సమితులు ప్రజలకు పరిపాలనపరంగా సౌలభ్యంగా లేవు. సమితి పరిధిలోని గ్రామాలకు, సమితి కేంద్రానికి 150 కిలోమీటర్లు కూడా ఉన్న పరిస్థితి. అప్పట్లో ఎన్టీ రామారావు సమితులను రద్దు చేసి మండల వ్యవస్థ తెచ్చారు. ఈ రోజుకీ మండలాలు చిరస్థాయిగా నిలిచి ప్రజలకు పరిపాలన పరంగా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కాకుండా అవసరమైన చోట పెంచాలి. తెలంగాణలోనూ అతిగా చేసి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చి ప్రాముఖ్యత లేకుండా చేసేశారు. జిల్లా అంటే ఒక విలువ ఉండాలి. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని విభజిస్తే కృష్ణపట్నం పోర్టు, షార్, శ్రీసిటీ అన్నీ తిరుపతి పరిధిలోకి పోతాయి. నెల్లూరు ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఉదాహరణకు నా స్వగ్రామం అల్లీపురం నెల్లూరు నగరపాలక సంస్థలో ఉంది. అల్లీపురం నెల్లూరు కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే మా పొరుగునే ఉన్న నరుకూరు, చిన్నచెరుకూరు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జిల్లాల విభజన జరిగితే ఆ రెండు గ్రామాలు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్తాయి. ఆయా గ్రామాల ప్రజలు తిరుపతి కలెక్టరేట్‌కి వెళ్లాలంటే నెల్లూరును దాటుకుని 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదో మేమనుకున్నది చేయాలనే ధోరణి వద్దు. ప్రజలకు చిరస్థాయిగా ఉపయోగపడేలా, సౌకర్యవంతంగా జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి’’ అంటూ సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-10T19:35:09+05:30 IST