విద్యుత్తు చార్జీల పెంపులో ఊరట!

ABN , First Publish Date - 2022-03-23T09:15:52+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులకు చార్జీల పెంపు భారంలో కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యుత్తు చార్జీల పెంపులో ఊరట!

  • డిస్కమ్‌లకు సబ్సిడీ పెంచనున్న ప్రభుత్వం
  • 2670 కోట్లు పెంచుతున్నట్లు ఈఆర్‌సీకి లేఖ 
  • వినియోగదారులపై భారం తగ్గించే యోచన!
  • నేడో రేపో విడుదల కానున్న టారిఫ్‌ ఆర్డర్‌


హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు చార్జీల పెంపు భారంలో కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్కమ్‌లకు ప్రభుత్వం ఇచ్చే స బ్సిడీని కొంత మేర పెంచాలని నిర్ణయించడమే ఇందుకు కా రణం. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం నుంచి టారిఫ్‌ సబ్సిడీ రూ.5,652 కోట్లు మాత్రమే రానుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు తొలుత నివేదించాయి. అయితే ఈ సబ్సిడీని రూ. 8,322 కోట్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తాజాగా తెలిపింది. అదనంగా రూ.2,670 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ ఇస్తున్నట్లు ఈఆర్‌సీకి ఇచ్చిన లేఖలో పేర్కొంది. దీంతో చార్జీల పెంపు ద్వారా వినియోగదారుల నుంచి రూ.6,831 కోట్లు పిండుకోవాలని నిర్ణయించిన డిస్కమ్‌లు/ప్రభుత్వం వడ్డనపై కాస్త మెత్తబడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చార్జీల పెంపు భారం తీవ్రంగా ఉండబోదని, కొంత ఉపశమనం ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షికాదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌) రూ.53,054 కోట్లు గా ఉంటుందని ఈఆర్‌సీకి డిస్కమ్‌లు తెలిపిన విషయం తెలిసిందే.


ఇందులో ఇప్పటిదాకా ఉన్న చార్జీల ద్వారా రూ. 42,126 కోట్లు రానున్నాయని, లోటు రూ.10,928 కోట్లు ఉం టుందని పేర్కొన్నాయి. ప్రతిపాదించిన కరెంట్‌ చార్జీల పెంపు భారం రూ.6,831 కోట్లు ఉంటుందని ప్రకటించాయి. మిగిలిన రూ.4097 కోట్ల లోటును అంతర్గత సామర్థంతో భర్తీ చేసుకుంటామని డిస్కమ్‌లు ప్రకటించాయి. అయితే ఎన్పీడీసీఎల్‌ పరిధిలో డెవల్‌పమెంట్‌ చార్జీల పేరిట వేలాది రూపాయల భారం మోపుతోంది. త్వరలో ఎస్పీడీసీఎల్‌లోనూ ఈ భారం ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రజల నుంచి ఏ మేర వసూలు చేస్తారో లెక్కలతో చెబితే.. ఆ మేర వేతన సవరణ ప్రయోజనాలు ఉంటాయని యాజమాన్యాలు ఇప్పటికే సంఘాలకు సందేశం కూడా ఇచ్చాయి. 


పెంచే సబ్సిడీ ఏ ఖాతాలోకి?

విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సబ్సిడీ పెంచుతున్నట్లు ప్రభు త్వం చెబుతున్నా.. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో మాత్రం అందుకోసం అదనంగా నిధులు కేటాయించలేదు. 2022-23 సంవత్సరానికిగాను రూ.10,500 కోట్లను విద్యుత్‌ సబ్సిడీగా ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ, 2021-22 లోనూ ఇంతే మెత్తం సబ్సిడీ ఇచ్చింది. అయితే ఈ మొత్తంలోనుంచే రాష్ట్రంలోని 26 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కరెంటు బిల్లులు, ఎత్తిపోతల పథకాల బిల్లులు, మిషన్‌ భ గీరథ పంపు కరెంట్‌ బిల్లులు, వాటర్‌బోర్డు కరెంట్‌ బిల్లులను జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పోగా.. చివరికి 2022-23లో వ్యవసాయ పంపుసెట్ల ఖాతాలో చేరేది రూ.4,415 కోట్లు మాత్రమే. ఐదేళ్లుగా వ్యవసాయ సబ్సిడీ పెరగడం లేదు. కాగా, డిస్కమ్‌ల లెక్కల ప్రకారం ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను అందించడానికి అయ్యే రూ. 9.20 ఖర్చు కానుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.1.06గా వస్తోంది. ఎన్పీడీసీఎల్‌-వరంగల్‌లో రూ.8.96 అవుతుండగా.. డిస్కమ్‌కు వచ్చే ఆదాయం రూ.4.44 ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.2670 కోట్ల మేర పెంచుతున్న సబ్సిడీ  ఏ ఖాతాలో చేరనున్నాయన్న దానిపై డైలమా నెలకొంది. 

Updated Date - 2022-03-23T09:15:52+05:30 IST