సలహాలకు ఇంతమందా?

ABN , First Publish Date - 2021-07-24T07:31:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది

సలహాలకు ఇంతమందా?

జడ్జీలకు మించి సౌకర్యాలా!

గతంలో మీడియాకు దూరం

నేడు రాజకీయ వ్యాఖ్యలూ చేస్తున్నారు

వారికి లక్షల్లో వేతనాలు, అలవెన్సులు

50,60 మందిని నియమించేటప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా గమనించుకోరా?

ఎస్‌ఈసీ సాహ్ని వ్యాజ్యం విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు


అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఖజానా నుంచి వారికి అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలు రూపేణా లక్షల్లో చెల్లిస్తున్నదని పేర్కొంది. సలహాదారులనే పేరుతో 50 నుంచి 60 మందిని నియమించడం ఏమిటని ఆక్షేపించింది. వారి నియామకం విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి  కదా అని వ్యాఖ్యానించింది. గతంలో సలహాదారులు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువని...ప్రసుత్తం కొంతమంది మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌సకు సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు... రాజశేఖరెడ్డి మరణించిన తరువాత ప్రజలకు ధైర్యం చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చారని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు ముగిశాయి. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, ఎస్‌ఈసీ నీలం సాహ్ని తరఫు వాదనలు వినేందుకు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.శశిభూషణరావు వాదనలు వినిపిస్తూ.... ‘‘ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. ఓటరుగా, దేశ పౌరునిగా ఈ నియామకాన్ని ప్రశ్నించేహక్కు పిటిషనర్‌కు ఉంది. పిటిషనర్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం జరగకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు.. వ్యాజ్యం దాఖలు చేయవచ్చు. స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 


నీలం సాహ్ని సీఎ్‌సగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించింది. పదవీవిరమణ చేసిన తరువాత సీఎం ముఖ్యసలహాదారుగా సేవలు అందించారు. ఎస్‌ఈసీ నియామకంపై గవర్నర్‌కు పంపిన పేర్లలో ఆమెను సీఎం ప్రతిపాదించారు. సీఎం రాసిన లేఖతో ఆమె ప్రత్యేక అర్హత పొందారు. ముందుగా నిర్ణయించిన మేరకే ఆమె నియామకం జరిగింది. నిజానికి, ఈ ప్రక్రియలో గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించాలి. గడచిన పరిణామాలు పరిశీలిస్తే స్వతంత్ర వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించినట్లు పరిగణించలేం. ఈ నేపధ్యంలో ఆమె నియామకాన్ని రద్దు చేయండి’’ అని కోరారు. విచారణ సందర్భంగా ఎస్‌ఈసీగా నియామకానికి గల అర్హతలు గురించి చర్చ జరిగింది. ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్‌ఈసీగా నియమితులయ్యేందుకు అర్హులని పంచాయతీరాజ్‌ చట్టంలో స్పష్టంగా ఉన్నప్పుడు స్వతంత్ర వ్యక్తే ఆ పోస్టుకు అర్హులని ఎలా చెబుతారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.... ‘‘పరిపాలనలో నిపుణులైనవారు ఎస్‌ఈసీగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నర్‌కు సీఎం పేర్లు పంపారు. అయితే, ఆ పేర్లనే గవర్నర్‌ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకానికి ముందు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నందున.. ఆమె స్వతంత్రంగా వ్యవహరించరని పిటిషనర్‌ వాదించడం సరికాదు. అంతా నిబంధనల ప్రకారమే జరిగింది’’ అని అన్నారు.


సలహాకు ఏమిటో అర్హతలు..

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సలహాదారుల నియామకం విషయం చర్చకు వచ్చింది. సలహాదారుల అర్హత, నియామకం విషయంలో నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి నిబంధనలు లేవని...వివిధ రంగాల్లో నిపుణులైన వారిని నిర్దిష్ట కాలంపాటు సలహాదారులుగా నియమించుకుంటారని ఏజీ బదులిచ్చారు. ‘‘సలహాదారుల నియామక జీవోలో వారి విధులు పేర్కొన్నారు. అర్హత గురించి ఎలాంటి నిబంధనలు లేవు. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి జీతం, అలవెన్స్‌లు చెల్లిస్తారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 40, 50 సలహాదారులను నియమించుకొనేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-07-24T07:31:35+05:30 IST