Snake Head In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. భయంతో వణికిపోయిన సిబ్బంది.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-07-26T16:57:15+05:30 IST

విమాన సిబ్బంది తింటున్న భోజనంలో పాము తల బయటడిన ఘటన తాజాగా టర్కీకి చెందిన విమాన సంస్థ సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో వెలుగు చూసింది.

Snake Head In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. భయంతో వణికిపోయిన సిబ్బంది.. వీడియో వైరల్!

ఇస్తాంబుల్‌: విమాన సిబ్బంది తింటున్న భోజనంలో పాము తల బయటడిన ఘటన తాజాగా టర్కీకి చెందిన విమాన సంస్థ సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో వెలుగు చూసింది. ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఒకరు విమానంలో అందించిన ఆహారం తింటున్న సమయంలో అందులోని కూరలో పాము తల కనిపించింది. అది చూసి విమాన అటెండెంట్ హడలిపోయాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సంఘటన జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో జరిగిందని ఓ ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అందులోని సిబ్బందికి ఈ ‍అనుభవం ఎదురైనట్లు వెల్లడించింది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటున్న సమయంలో ఆలూ, ఆకుకూరలతో చేసిన కర్రీలో పాము తల కనిపించినట్లు ఆ విమాన అటెండెంట్ తెలిపాడు. 


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది. దాంతో సిబ్బందికి ఆహారం వడ్డించిన ప్లేట్‌లోని కూర మధ్యలో చిన్న పాము తల ఉండడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఒకరు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు’ పేర్కొన్నారు. ఇక ఇలాంటి ఘటనే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కొనుగోలు చేసిన చికెన్ సలాడ్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. 



Updated Date - 2022-07-26T16:57:15+05:30 IST