Abn logo
Nov 21 2020 @ 01:04AM

ఎందరో తల్లుల కంటి దివ్వె

ఒక అమ్మగా బిడ్డలు దూరమైన తల్లులు పడే బాధ ఆమెకు తెలుసు. ఏ తల్లి కూడా బిడ్డలను కోల్పోకూడదనే లక్ష్యంతో పనిచేస్తూ 76మంది చిన్నపిల్లలను వాళ్ల కన్నవాళ్ల ఒడికి చేర్చారు సీమా ఢాకా. ఢిల్లీ పోలీస్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె చిన్నపిల్లల కిడ్నాప్‌, అదృశ్యం కేసులను చేధిస్తూ, తన పనితీరుతో పదోన్నతి సాధించారు. వృత్తి పట్ల అంకితభావంతో ఎందరో తల్లుల కళ్లల్లో వెలుగులు నింపిన సీమ ప్రయాణమిది...


ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న చిన్నపిల్లల కిడ్నాప్‌, అదృశ్యం కేసులు సీమను కలవరపరిచేవి. పిల్లలు అదృశ్యమయితే వారి తల్లులు ఎంతగా తల్లడిల్లుతారో ఎనిమిదేళ్ల బాబు ఉన్న సీమకు తెలుసు. ఈ కేసుల మీద ఆమె కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. ఆమెకు పై అధికారుల నుంచి కూడా సహకారం లభించడంతో తొందరగా పిల్ల్లల ఆచూకీ కనిపెట్టగలిగారు. ‘‘పై అఽధికారులు, మా బృందంలోని సభ్యులు నాకు ఏఎస్సైగా పదోన్నతి రావడానికి ఎంతగానో సహకారం అందించారు. నేనూ ఒక బిడ్డకు అమ్మను. ఏ తల్లి కూడా తన పిల్లలను దూరం చేసుకోకూడదని కోరుకుంటా. రోజూ వారీగా మా దృష్టికి వచ్చిన చిన్న పిల్లల కిడ్నాప్‌, అదృశ్యం కేసులను చేధించేందకు మా బృందం పగలురాత్రీ పనిచేసింది’’ అని చెబుతారు సీమ.

 

రెండు నదులు దాటి మరీ

ఈ ప్రయాణంలో సీమ బృందానికి సవాల్‌ విసిరిన సందర్భాలు అనేకం. గత అక్టోబర్‌లో పశ్చిమబెంగాల్‌లో ఒక మైనర్‌ను కాపాడే క్రమంలో పెద్ద సాహసమే చేసింది సీమా టీమ్‌. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నా, పడవ సాయంతో రెండు నదులు దాటి మరీ ఆ చిన్నారిని రక్షించారు. ‘‘ఆ బాలుడి తల్లి రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేసింది. అయితే ఆ తరువాత వేరే ప్రాంతానికి వెళ్లడం, ఫోన్‌ నంబర్‌ మార్చేయడంతో కనిపెట్టడం కష్టమైంది. అయితే ఆమెది పశ్చిమబెంగాల్‌ అని తెలిసింది. సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఎలాగోలా ఆ బాలుడిని తల్లి వద్దకు తీసుకెళ్లాం. మేము పిల్లలను కాపాడిన తరువాత వారికి కౌన్సెలింగ్‌ ఇస్తాం. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతాం. వీరిలో చాలామంది రైల్వేస్టేషన్‌ లేదా బస్‌స్టేషన్‌లో తచ్చాడుతూ కనిపిస్తుంటారు’’ అని ఆమె వివరించారు.


అదృశ్యమైన పిల్లల ఆచూకీ కోసం పలు చోట్లకు తిరిగేవారామె. ఈ క్రమంలోనే జూలైలో కరోనా బారిన పడ్డారు. మూడు వారాలు స్వీయనిర్భందంలో ఉండి కోలుకున్న తరువాత తిరిగి విధుల్లో చేరారు. తప్పిపోయిన చిన్నపిల్లల కేసులే కాదు తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి, మత్తుపదార్థాలు, మద్యానికి బానిసలైన టీనేజర్స్‌ కేసులు కూడా చేధించారామె. దేశరాజధాని ఢీల్లీలోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలలో కూడా చిన్నపిల్లలను కాపాడారు. పిల్లలను వారి కన్నవారి దగ్గరికి చేర్చిన క్షణం వారి కళ్లలో కనిపించే ఆనందం చూడగానే తను పడిన కష్టమంతా మరచిపోతానంటారామె. ఎంతైనా ఆమె ఒక అమ్మే కదా!


ప్రోత్సాహక కార్యక్రమం

ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌.ఎన్‌.శ్రీవాత్సవ చిన్నపిల్లల అదృశ్య కేసుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసుల విషయంలో పోలీసులు చురుకుగా పని చేసేందుకు ‘అవుట్‌ ఆఫ్‌ టర్న్‌ ప్రమోషన్‌’ (ఏదైనా గుర్తించదగ్గ పని చేసిన వారికి సీనియారిటీ లేకున్నా కూడా పదోన్నతి ఇవ్వడం) అనే ప్రోత్సాహక స్కీమ్‌ను ప్రారంభించారు. కానిస్టేబుల్స్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఎవరైతే కనీసం 50 మంది చిన్నారులను (14 ఏళ్ల లోపు వారిని) కాపాడతారో వారికి ‘అవుట్‌ ఆఫ్‌ టర్న్‌ ప్రమోషన్‌’ ఇస్తామని ప్రకటించారు. పై అధికారులు ఇచ్చిన ప్రోత్సాహం, సహకారంతో సీమ గత మూడు నెలల్లో 76 మంది చిన్నారులను వారి కన్నవారి చెంతకు చేర్చారు. ఆమె కృషిని అభినందిస్తూ సీమకు ఈ మధ్యే ఏఎస్సైగా పదోన్నతి ఇచ్చారు. ‘అవట్‌ ఆఫ్‌ టర్న్‌ ప్రమోషన్‌’ ద్వారా మూడు నెలల్లోనే పదోన్నతి పొందిన మొదటి కానిస్టేబుల్‌ సీమానే కావడం విశేషం. 2006లో ఉద్యోగంలో చేరిన సీమ ఢిల్లీ ఉత్తర ప్రాంతం రోహిణి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా అదే జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement